ఫిబ్రవరి - 14,2014
¤ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. » ఆమ్ ఆద్మీ పార్టీ 49 రోజుల 'పాలన ప్రయోగం' ముగిసింది. |
» ఎన్నికల హామీల్లో ఒకటైన 'జన్ లోక్‌పాల్' బిల్లును ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమ్ఆద్మీ పార్టీ విఫల యత్నం చేసింది. కాంగ్రెస్, భాజపాలు కలసి గట్టిగా అడ్డుకున్నాయి. శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టే ప్రతిపాదనను 42-27 తేడాతో ఓడించాయి. ఇది జరిగిన వెంటనే కేజ్రీవాల్ మంత్రివర్గం సమావేశమై రాజీనామా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు రాజీనామా లేఖను అందించారు. రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో 'శాసనసభను రద్దుచేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలి' అని సిఫార్సు చేశారు. గవర్నర్ ఈ లేఖతో పాటు కేంద్రానికి నివేదిక పంపనున్నారు. దాన్ని అనుసరించి రాష్ట్రపతి పాలన విధించాలా? ఎన్నికలు నిర్వహించాలా? అనే విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుంది. » కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో సత్సంబంధాలు నెరిపిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ 'జన్ లోక్‌పాల్' బిల్లు విషయానికి వచ్చే సరికి నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. అన్ని బిల్లుల్లాగే దీనికీ కేంద్రం అనుమతి తీసుకోవాలని కుండబద్దలు కొట్టారు. అందుకు విరుద్ధంగా వెళ్లవద్దని ఏకంగా శాసనసభ స్పీకర్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ దాన్ని లెక్క చేయకుండా తన పార్టీకే చెందిన స్పీకర్ సాయంతో సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ శాసనసభలో ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఆవిష్కృతమయ్యాయి. బిల్లు సభా ప్రవేశం దశలోనే కాంగ్రెస్ - భాజపాలు అడ్డుకున్నాయి. » కేంద్రం అనుమతి తీసుకోవాలంటే గవర్నర్ పంపిన సందేశం మీద చర్చ జరగాలని పట్టుబట్టాయి. కేజ్రీవాల్ వారి డిమాండ్లను తోసిపుచ్చుతూ, బిల్లును సభ ముందు ఉంచారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్, భాజపా విరుచుకుపడ్డాయి. దాంతో స్పీకర్ మధ్యేమార్గంగా బిల్లును సభ స్వీకరించాలా? వద్దా? అనే విషయమై సభ అనుమతి కోరారు. అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. బిల్లు ప్రవేశాన్ని సభ తిరస్కరించినట్లయింది. |
No comments:
Post a Comment