Sunday, August 17, 2014

ఆర్థిక వ్యవస్థకు 'నల్ల'జబ్బు


విదేశీ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్నది ఇప్పటిదాకా మాటలకే పరిమితమైంది. ఇప్పుడిప్పుడే చేతలమీద ఆశలు చిగురిస్తున్నాయి. భారతీయులు విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా దాచిపెట్టుకొన్న డబ్బుతోపాటు బంగారం, ముత్యాలు, వజ్రవైఢూర్యాలు తదితర విలువైన వస్తువులను ఎలా వెనక్కి తేవాలన్న దానిపై విధి విధానాలు రూపొందించేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి అధ్యక్షతన 'సిట్‌' ఏర్పాటు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం అభినందించదగ్గ చర్య తీసుకొంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజల్ని మభ్యపెట్టడానికి నల్లధనాన్ని వెనక్కి తెస్తామంటూ రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం మామూలైపోయింది. రెండు దశాబ్దాలుగా ఈ తంతు సాగుతోంది. అవినీతిని ఉపేక్షించడం ద్వారా రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో యువతరం ఇప్పుడు చురుగ్గా పాలుపంచుకుంటోంది. సమాచార హక్కును అస్త్రంగా మలచుకొని మధ్యతరగతి ప్రజానీకమూ సత్తా చాటుతోంది. సమాజాన్ని గుల్లబారుస్తున్న అవినీతిని అంతమొందించాలన్న ఆలోచనకు కట్టుబడి ఉన్నామని, అందుకోసమే ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వాలు చాటుకొనక తప్పని పరిస్థితి దీంతో ఉత్పన్నమైంది.

లెక్కలకు అందనంత... 
విదేశాల్లోని వివిధ బ్యాంకుల్లో, పన్నుల బాదరబందీలేకుండా ఎంత దొంగ సొత్త్తెనా బేషుగ్గా దాచుకొనేందుకు వీలు కల్పిస్తున్న చోట్ల భారతీయులు దాచుకొన్న అక్రమ సంపాదన ఎంత అన్నదానిపై కచ్చితమైన అంచనాకు రావడం కష్టం. వాషింగ్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ 'గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటెగ్రిటీ' ప్రకారం- భారత్‌ నుంచి విదేశాలకు తరలివెళ్లిన నల్లడబ్బు 2002లో 800కోట్ల డాలర్లు. 2011నాటికి అది 34,400కోట్ల డాలర్లకు చేరుకొంది. విదేశీ బ్యాంకులు, పన్నుల బెడద లేని చోట్ల భారతీయులు దాచుకొన్న నల్లధనం రెండులక్షల కోట్ల డాలర్ల దాకా ఉంటుందని భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య అంచనా వేసింది. భారత్‌ నుంచి బయటికి వెళుతున్న నల్లడబ్బు పరిమాణం నానాటికీ పెరుగుతోందని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటెగ్రిటీ పేర్కొంది. భారతీయ కంపెనీలు విదేశాల్లోని దొంగ కంపెనీలను అడ్డం పెట్టుకొని అక్రమార్జనకు పాల్పడుతున్నాయని అది తెలిపింది. పైగా, పన్నుల ద్వారా భారత్‌ పొందుతున్న ఆదాయం దాదాపు 15శాతమే. అదే ఐరోపా సమాజం (ఈయూ)లో 40శాతం దాకా ఉంది. కొంతమంది భారతీయులు పన్నులు ఎగ్గొట్టేందుకే విదేశాల్లో డబ్బు దాచుకొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఆ అక్రమ సంపాదనను తక్షణం వెనక్కి తెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చొరవ తీసుకోని యూపీఏ 
దేశంలోనూ చాలామంది నల్లధనస్వాములు పోగుబడి ఉన్నారు. వారు తమ అక్రమార్జనను దర్జాగా ఇక్కడే దాచుకొని, వ్యవస్థల్నే శాసించే స్థాయికి చేరుకొన్నారు. సర్కారు తలచుకొంటే- ఆ డబ్బును వెలికితీయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకొన్న నల్లడబ్బును తీసుకురావడమన్నది అంత సునాయాసం కాదు. అందుకు విదేశాలు సహకరించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ చట్టాలు, ఆయా దేశాలకు వర్తించే నిర్దిష్ట చట్టాలనూ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై ప్రపంచ మీడియాలో వెల్లువెత్తిన సమాచారం ఎంతో ఆసక్తికరంగా ఉంది. విదేశాల్లోని నల్లడబ్బును స్వదేశానికి రప్పించడమన్నది ఎంత సంక్లిష్టమైన ప్రక్రియో, అందుకోసం ఎంతటి కసరత్తు చేయవలసి ఉంటుందో దాని ద్వారా తేటతెల్లమవుతోంది. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రమైనదిగా పరిగణించి, దృఢ రాజకీయ సంకల్పంతో ముందడుగు వేస్తే తప్ప, గమ్యం చేరడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది. జర్మనీ అధికారులు 2008 ఫిబ్రవరిలో గూఢచర్యం నిర్వహించి, లీచ్‌టెన్‌స్టెయిన్‌ బ్యాంకులో నల్లడబ్బు దాచుకొన్న వివిధ దేశాల వ్యాపారుల జాబితా బయటపెట్టారు. ప్రిన్స్‌ ఆఫ్‌ లీచ్‌టెన్‌స్టెయిన్‌ ఫౌండేషన్‌ యాజమాన్యంలోని బ్యాంకు అది. జర్మన్‌ అధికారులు వెల్లడించిన 1400 ఖాతాదారుల జాబితాలో సగానికిపైగా జర్మనేతరులే. ఆసక్తిగల ఏ దేశానికైనా తమ వద్ద ఉన్న సమాచారం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆనాడు జర్మనీ అధికారులు ప్రకటించారు. నార్వే, స్వీడన్‌ వంటి దేశాలు వెంటనే స్పందించి, తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకొన్నాయి. ఆప్పటి భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఉలుకూ పలుకూ లేకుండా మిన్నకుండిపోయింది. అందుకు దాని కారణాలు దానికి ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటా అని వూహించుకోవడం మనకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఆ తరవాత ప్రభుత్వంమీద ఒత్తిడి బాగా పెరిగింది. దాన్ని అది తట్టుకొనలేకపోయింది. చివరకు జర్మనీ అధికారుల నుంచి 100 పేర్లు తెలుసుకోగలిగింది. దాంతోనే సరిపెట్టింది. తదుపరి చర్యల మాటే లేదు. ఆ వందమంది సంగతి ఏం తేల్చారో ప్రజలకు తెలియకుండా పోయింది.
అదే సంవత్సరం, అంటే 2008లోనే ఇటాలియన్‌- ఫ్రెంచి పౌరుడు హెర్వ్‌ ఫాల్సియాని మరో సంచలనం సృష్టించారు. స్విస్‌ అనుబంధ బ్యాంకులో ఎనిమిదేళ్లపాటు పనిచేసిన ఆయన, హెచ్‌ఎస్‌బీసీ, స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్‌ డివిజన్‌లో అక్రమ ఖాతాలు కలిగి ఉన్న 24,000 మంది వివరాలు చేజిక్కించుకొని, ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. బ్రిటన్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ తదితర ఐరోపా దేశాల్లోని పన్ను అధికారులకు ఆయన ఆ జబితా అందజేశారు. జెనీవా హెచ్‌ఎస్‌బీసీలో అక్రమ ఖాతాలు కలిగి ఉన్న భారతీయుల జాబితా ఫ్రెంచి ప్రభుత్వం వద్దకు చేరింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లతో పోలిస్తే ఈ విషయంలో ఆనాటి భారత ప్రభుత్వం కనపరచిన ఆసక్తి కానీ, చేపట్టిన చర్యలుగానీ పెద్దగా లేవు. ఫాల్సియాని జాబితాలోని 6,800 బ్యాంకు ఖాతాదారుల వివరాలను బ్రిటన్‌ సమకూర్చుకోగలిగింది. పన్నులు చెల్లించాల్సిందిగా అందులో 3,800 మందికి బ్రిటన్‌ అధికారులు నచ్చజెప్పగలిగారు. అక్రమ ఖాతాలపై అక్కడ 13 దర్యాప్తులు జరుగుతున్నాయి. ఫాల్సియాని సమకూర్చిన జాబితాలను ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాల పన్నుల అధికారులూ సద్వినియోగం చేసుకొన్నారు. అక్రమ ఖాతాదారుల నుంచి స్పెయిన్‌ 22కోట్ల పౌండ్లు, ఫ్రాన్సు 18.8కోట్ల పౌండ్లు స్వాధీనపరచుకోగలిగాయి. ఈ విషయంలో భారత ప్రభుత్వం మాత్రం అలాంటి చొరవగానీ, రాజకీయ సంకల్పంగానీ ప్రదర్శించలేకపోయింది. యథాలాపంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అక్రమ ఖాతాదారుల పేర్లు, ఖాతాల వివరాలతో కూడుకొన్న సీడీని ఫ్రాన్సు అధికారులకు ఫాల్సియానీ విక్రయించారు. ఫ్రాన్సు అధికారులు ఇతర దేశాలకు ఆ వివరాలు అందజేశారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీలో అక్రమ ఖాతాలు కలిగి ఉన్న 782మంది భారతీయులకు సంబంధించి సమాచారాన్ని ఫ్రెంచి ప్రభుత్వం భారత్‌కు అందజేసింది. ఆ పేర్లతో స్విస్‌ అధికారులను భారత్‌ ఆర్థిక మంత్రి సంప్రతించారు. హెచ్‌ఎస్‌బీసీ జెనీవా శాఖ నుంచి దొంగిలించిన వివరాలను పరిగణనలోకి తీసుకొనబోమని, ఆ వివరాల ఆధారంగా సమాచారం ఇవ్వడానికి తమ చట్టాలు అంగీకరించవని స్విస్‌ అధికారులు స్పష్టం చేశారు. ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి విధానాన్ని తాము గుర్తించడంలేదనీ తెగేసి చెప్పారు. జి-20 వేదిక మీద ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆర్థిక మంత్రి అన్నప్పటికీ, స్విస్‌ అధికారులు భారత్‌తో సహకరించకుండా మొండికేశారు.

మారిన స్విస్‌ వైఖరి 
పన్ను వ్యవహారాల్లో ఆటోమేటిగ్గా సమాచార మార్పిడికి ఉద్దేశించిన ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రకటన మీద స్విట్జర్లాండ్‌ మొన్న మే నెలలో సంతకం చేసింది. దరిమిలా, సమాచార మార్పిడి విషయంలో స్విట్జర్లాండ్‌ వైఖరిలో కొంత మార్పు వచ్చింది. ఎంపిక చేసుకొన్న దేశాలతో ద్వైపాక్షిక పన్నుల మీద సంప్రతింపులు ప్రారంభిస్తామని స్విస్‌ ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశంతో సన్నిహిత ఆర్థిక, రాజకీయ సంబంధాలు కలిగి ఉండటంతోపాటు తమ ఆర్థిక వ్యవస్థకు గొప్ప మేలు చేకూర్చే విస్తృత మార్కెట్‌ సామర్థ్యం కలిగిన దేశాలతో తొలుత ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి కార్యక్రమం ప్రారంభిస్తామని స్విట్జర్లాండ్‌ వెల్లడించింది. ఈ పరిణామాలకు అంతర్జాతీయ ఒత్తిడీ తోడు కావడంతో, స్విస్‌ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న కొద్దిమంది భారతీయులకు సంబంధించిన సమాచారాన్ని స్విట్జర్లాండ్‌ మొన్న జూన్‌లో భారత్‌కు అందజేసింది. హెచ్‌ఎస్‌బీసీ జాబితాలోని 782 మంది భారతీయుల ఖాతాల వివరాలు మాత్రం స్విస్‌ అధికారులు సమకూర్చనేలేదు. స్విస్‌ బ్యాంకుల్లో నల్ల డబ్బు దాచుకొన్న కొందరి సమాచారం వారు అందజేసినప్పటికీ, ట్రస్టులు, దేశీ కంపెనీలు, దేశం వెలుపల పనిచేస్తున్న కంపెనీలు దాచుకొన్న డబ్బు వివరాలే అందులో ఎక్కువ అన్న అనుమానాలు ఉన్నాయి.

అరుదైన అవకాశం 
ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నిబంధనలను ప్రపంచవ్యాప్తంగా చిత్తశుద్ధితో అమల్లోకి తేగలిగినప్పుడే- ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి వల్ల భారత్‌కు అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. విదేశాల్లోని నల్లడబ్బును తెప్పించుకొనేందుకు భారత్‌కు ఆ పరిణామం సహాయపడగలదని చెబుతున్నారు. కానీ, ఓఈసీడీ నిబంధనల్లో ఆదాయాల మీద అధికంగా దృష్టి కేంద్రీకరించారు. పన్నులు ఎగ్గొట్టి నల్లడబ్బు దాచుకొన్నవారు దారికొచ్చి తమ ధనాన్ని పెట్టుబడిగా పెట్టారనే అనుకొందాం. అప్పుడు వడ్డీ, డివిడెండ్ల వంటి ఆదాయ వివరాలను వారు వెల్లడించవలసి ఉంటుంది. అందుకు వారు ఇష్టపడకపోవచ్చు. దాంతో ఆ ప్రక్రియకు పరిమితులు ఏర్పడతాయి. ఓఈసీడీ నిబంధనలు, ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి యంత్రాంగం మీదే భారత్‌ పూర్తిగా ఆధారపడాలా, లేక సమాచార సేకరణ కోసం ఇతర మార్గాలేవైనా అనుసరించాలా అన్నది చిక్కుప్రశ్నే. మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సహాయం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి విషయాల్లో స్విట్జర్లాండ్‌లో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారానే విదేశీ బ్యాంకుల్లోని నల్ల ధనానికి సంబంధించిన సమాచారాన్ని సత్వరం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, నల్ల డబ్బును తిరిగి తెచ్చే విషయమై చిత్తశుద్ధితో ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. దాంతోపాటు దేశంలో ఉత్పత్తి అవుతున్న నల్లడబ్బును అదుపు చేసే దిశలోనూ సర్కారు విస్పష్ట కార్యాచరణతో కదం తొక్కవలసిన అవసరం ఉంది. మన ఆర్థిక వ్యవస్థను గుల్లబారుస్తున్న 'నల్ల'జబ్బుకు ఇదే సరైన మందు.

No comments:

Post a Comment