Sunday, August 17, 2014

చైనా కొత్త పాచిక.. సాగర ఆధిపత్యమే లక్ష్యం


అదొక యుద్ధం కాని యుద్ధం. అందులో ఫిరంగులు పేల్చేవి గుళ్లు కాదు- బలమైన నీటిధార. దక్షిణ చైనా సముద్రంలో చమురు-సహజవాయువు అన్వేషణ కోసం ఈ ఏడాది మే నెలలో చైనా ఒక చమురు రిగ్గును పంపింది. అంతకుముందు అదే ప్రాంతంలో చమురు అన్వేషణ కాంట్రాక్టును భారత్‌కు చెందిన ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌కు వియత్నాం అప్పగించింది. దీన్ని వ్యతిరేకించిన చైనా, కవ్వింపు చర్యగా తన సొంత రిగ్గును అక్కడకు తరలించింది. దాన్ని అడ్డగించడానికి వచ్చిన వియత్నాం తీరరక్షక నౌకలపై చైనా యుద్ధనౌకలు నీటి ఫిరంగులతో దాడిచేశాయి. ఆ ఫిరంగుల నుంచి నీటిధార చాలా బలంగా చిమ్మడంతో వియత్నాం నౌకల యాంటెన్నాలు విరిగిపోవడంతోపాటు ఇతరత్రా భారీనష్టం చవిచూశాయి. చిన్న చిన్న వియత్నాం నౌకలు, బోట్లను భారీ చైనా నౌకలు ఢీకొని వాటిని ముంచేస్తున్నాయి. లేదా మరమ్మతులకు పంపాల్సిన స్థితిని కల్పిస్తున్నాయి. చివరికి అంతర్జాతీయ విమర్శలకు తలొగ్గి చైనా తన ఆయిల్‌ రిగ్గును అక్కడి నుంచి ఉపసంహరించినా, దక్షిణ చైనా సముద్రంలో 90శాతం తన జాగీరేనని బలంగా చాటింది. దీన్ని వియత్నాం, ఫిలిప్పీన్స్‌ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. వీటితో గొంతు కలపాల్సిన సాటి అగ్నేయాసియా సంఘ (ఆసియన్‌) సభ్యదేశాలు చైనా యత్నాలకు లోపాయికారీగా వత్తాసు పలుకుతున్నాయి. బ్రూనై, కాంబోడియా, ఇండొనేసియా, మలేసియా, మయన్మార్‌, లావోస్‌, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లు సభ్యులుగా ఉన్న 'ఆసియన్‌'కు చైనాయే అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఉభయుల మధ్య 2013లో జరిగిన వాణిజ్యం అర లక్ష కోట్లడాలర్లను దాటింది. కాంబోడియా, మలేసియాలకు చైనా భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది. థాయ్‌లాండ్‌లో 2,300కోట్ల డాలర్ల హైస్పీడ్‌ రైలు యంత్రాంగ నిర్మాణానికి చైనా తోడ్పడుతోంది. మయన్మార్‌లో చైనా నిర్మించిన రెండో గ్యాస్‌ పైప్‌లైన్‌ సహజవాయువు సరఫరా మొదలు పెట్టింది.
వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా ఆసియన్‌పై బలమైన పట్టు సాధించిన చైనా, దక్షిణ చైనా సముద్ర జలాల్లో కవ్వింపు చర్యలకు స్వస్తి పలకాల్సిందిగా అమెరికా తెచ్చిన ఒత్తిడిని ఖాతరు చేయలేదంటే ఆశ్చర్యమేముంది? మయన్మార్‌లో జరిగిన 21వ ఆసియన్‌ ప్రాంతీయ వేదిక సమావేశంలో భారతదేశం కూడా చైనా బలప్రయోగాన్ని నిరసించింది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి, అక్కడి వనరులను అంతర్జాతీయ చట్టాల ప్రకారం వినియోగించుకోవడానికి తీరప్రాంత దేశాలకు హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించింది. అమెరికా, జపాన్‌లు ఇక్కడ మరింత ప్రముఖపాత్ర పోషించాలని ఫిలిప్పీన్స్‌ ఆశిస్తుంటే, భారత్‌ ప్రమేయం పెరగాలని వియత్నాం భావిస్తోంది.
అపార నిక్షేపాల గని 
దక్షిణ చైనా సముద్రంలో పారాసెల్‌, స్ప్రాట్లీ దీవులతో సహా దాదాపు 100 చిన్నాచితకా దీవులు, పగడాల దిబ్బలు, ఇసుక గట్లు, శిలా నిక్షేపాలు ఉన్నాయి. అవి తమవంటే తమవని చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేసియా, తైవాన్‌ దేశాలు వాదించుకుంటున్నాయి. 1974లో చైనా పారాసెల్‌ దీవులపై దాడిచేసి 70మంది వియత్నాం సైనికులను వధించింది. 1988లో స్ప్రాట్లీ దీవులపై దాడిచేసి 60మంది వియత్నాం నావికులను హతమార్చింది. ఫిలిప్పీన్స్‌తో కూడా చైనాకు ఘర్షణలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రంలో 1,100కోట్ల పీపాల చమురు, 190లక్షల కోట్ల ఘనపుటడుగుల సహజవాయు నిక్షేపాలు ఉండవచ్చునని 2013లో అమెరికా అంచనా వేసింది. చైనా లెక్కల ప్రకారం ఇక్కడ మూడు వేలకోట్ల టన్నుల చమురు, 16లక్షల కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువు నిక్షేపాలు ఉండవచ్చు. వియత్నాం ఆహ్వానంపై భారత్‌ ఇక్కడ 34.30కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడం, చైనాకు ఏమాత్రం గిట్టడం లేదు. దక్షిణ చైనా సముద్రం తన అడ్డా అని చాటుకొంటున్న చైనా అక్కడ కృత్రిమ దీవులను నిర్మించే పనిని ముమ్మరంగా చేపట్టింది. స్ప్రాట్లీ దీవుల సమీపంలోని జాన్సన్‌ సౌత్‌ రీఫ్‌(ఇసుక, రాళ్లగుట్ట)ను దీవిగా మార్చే పనిని చైనా ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టింది. చైనా తవ్వోడ సముద్రం అడుగు నుంచి ఇసుకను తవ్వి, ఈ రీఫ్‌ వద్ద ఎత్తిపోసింది. సిమెంటు, కలప, ఉక్కును తీసుకువస్తున్న చైనా నౌకలు ఈ రీఫ్‌తోపాటు మరో రెండింటిని విస్తరిస్తున్నాయి. జాన్సన్‌ సౌత్‌ రీఫ్‌కు పడమటి దిక్కుగా 90మైళ్ల దూరంలోని పైయరీ క్రాస్‌ రీఫ్‌ను కృత్రిమ దీవిగా మార్చి, అక్కడ ఎయిర్‌స్ట్రిప్‌, 5000 టన్నుల నౌక లంగరు వేయడానికి ఒక బెర్తు నిర్మించి, దాన్ని పూర్తిస్థాయి సైనిక స్థావరంగా తీర్చిదిద్దడానికి చైనా సిద్ధమవుతోంది. పదేళ్లలో 500 కోట్ల డాలర్లు ఖర్చుచేసి ఈ రీఫ్‌ను 13,400 ఎకరాల దీవిగా విస్తరించాలని ఉద్దేశిస్తోంది. అప్పుడది హిందూ మహాసముద్రంలోని అమెరికా నౌకాస్థావరం డీగోగార్సియాకు రెట్టింపు ఉంటుంది. ఇది పూర్తయిన తరవాత దక్షిణ చైనా సముద్రంపై వైమానిక రక్షణ మండలాన్ని ఏర్పాటు చేయడానికి చైనా నడుం బిగించగలుగుతుంది. అంతకుముందు తూర్పు చైనా సముద్రాన్ని తన వైమానిక రక్షణ మండలంగా ప్రకటించడంవల్ల చైనా, జపాన్‌ల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ సముద్రంలోని సెంకాకు దీవులు తమవంటే తమవని చైనా, జపాన్‌లు వాదిస్తున్నాయి.
సముద్ర సిల్క్‌ మార్గం 
పసిఫిక్‌ మహాసముద్రంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాలపై తన హక్కులను ప్రకటించుకున్న చైనా, హిందూ మహాసముద్రంవైపు దృష్టి సారించింది. ఇంధన వనరుల కోసం పశ్చిమాసియా మీద, ఖనిజ నిక్షేపాల కోసం ఆఫ్రికా మీద ఆధారపడుతున్న చైనా, హిందూ మహాసముద్రం ద్వారా ఈ వనరుల రవాణా మార్గాన్ని భద్రం చేసుకోవాలనుకుంటోంది. పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల మధ్య ఏర్పడే ఈ మార్గాన్ని సరికొత్త సముద్ర 'సిల్క్‌ రూట్‌'గా పిలుస్తోంది. ఇప్పటికే చైనా, కజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌ల మీదుగా సహజవాయు వ్యాపారం కోసం భూతల సిల్క్‌ రూట్‌ ఏర్పడింది. తరవాత బంగ్లాదేశ్‌, చైనా, భారత్‌, మయన్మార్‌ (బీసీఐఎం) కారిడార్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. మయన్మార్‌, థాయ్‌లాండ్‌, వియత్నాంలతో సంబంధాలు బలపరచుకుని చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయాలన్న భారత్‌ పథకాన్ని బీసీఐఎం నీరుగారుస్తోంది. అది చాలదన్నట్లు తాజాగా సముద్ర సిల్క్‌ మార్గాన్ని చైనా ముందుకు తెచ్చింది. ఈ 160కోట్ల డాలర్ల పథకం కింద ఆగ్నేయాసియా, హిందూ మహాసముద్ర తీర దేశాల్లో రేవులు, నిల్వ గోదాములు, స్వేచ్ఛా వాణిజ్య మండలాల ఏర్పాటుకు భారత్‌, శ్రీలంకలను కలుపుకొని పోవాలనుకుంటోంది. కోల్‌కత, కొలంబో రేవుల్లో మౌలిక వసతుల వృద్ధికి చైనా పెట్టుబడి పెడతానంటోంది. ఇప్పటికే పాకిస్థాన్‌లో గ్వాడర్‌ రేవును నిర్మించిన చైనా, శ్రీలంకలో కొత్తగా హంబన్‌ టోటాలో భారీ రేవు నిర్మాణానికి నిధులు సమకూరుస్తోంది. ఇంకా మయన్మార్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవుల్లో రేవుల నిర్మాణం లేదా అభివృద్ధిని చేపడుతోంది. మరోవైపు జోరుగా విమాన వాహక యుద్ధనౌకలు, ఫ్రిగేట్ల నిర్మాణాన్ని చేపడుతూ సముద్రంపై ఆధిపత్య సాధనకు సమాయత్తమవుతోంది. చైనా ఈ విధంగా పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల మధ్య వారధి నిర్మించుకుంటే, చివరకు అది భారత్‌ను చక్రబంధంలో ఇరికిస్తుందని రాజనీతిజ్ఞుల ఆందోళన. ప్రాచీన చైనా యుద్ధతంత్రజ్ఞుడు సున్‌ జు మెచ్చే వ్యూహమిది. అయితే, భారతదేశం చైనాతో ఆర్థిక సహకారం నెరపుతూనే అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, వియత్నాంలతో తన సైనిక బంధాన్ని బలపరచుకొంటే కౌటిల్యుడు సెభాష్‌ అనక మానడు.

No comments:

Post a Comment