నవంబరు - 5,2013
ప్రపంచ వ్యవసాయ సదస్సును హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా ప్రారంభించారు. దేశదేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో సదస్సును ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి తారిఖ్ అన్వర్, ఇతర ప్రముఖులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రపంచ వ్యవసాయ సదస్సు ఛైర్మన్ కెన్నెత్ బేకర్, సదస్సు సలహామండలి అధ్యక్షుడు జేమ్స్ బోల్గర్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. |
మాదాపూర్ హైటెక్స్‌లో ప్రపంచ వ్యవసాయ సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభించిన ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి |
» ప్రపంచ వ్యవసాయ వేదిక (డబ్ల్యుఏఎఫ్) అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సదస్సును మూడు రోజులపాటు నిర్వహిస్తోంది. » అమెరికాతో పాటు మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఆర్థికసాయంతో డబ్ల్యూఏఎస్ పని చేస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ఇది ప్రపంచ వ్యవసాయ సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న సదస్సు ఏడవది. » రైతుల్లో మూడోవంతు నష్టాలకు గురవుతున్న తరుణంలో 2050 నాటికి 1,000 కోట్ల (10 బిలియన్ల) జనాభాకు ఆహారాన్ని అందించడమనేది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సవాలుగా మారిందని సదస్సులో వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. » పెరుగుతున్న జనాభా అవసరాలకు సరిపడా ఆహారోత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఆధునిక విధానాల్లో వ్యవసాయం చేయడం; చిన్న, సన్నకారు రైతులకు చేయూతనివ్వడం; సాంకేతికతతో కూడిన వ్యవసాయ పనిముట్ల వాడకం; ఆహారోత్పత్తుల్లో పోషక విలువలను పెంచడం; వివిధ సంస్థల మధ్య భాగస్వామ్యం పెంచడం అనే అయిదు విధానాలను అనుసరించాలని నిపుణులు పేర్కొన్నారు. » విద్యావంతులైన యువత వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించాలని ఈ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ పిలుపునిచ్చారు. దేశానికి వ్యవసాయమే జీవనాధారమని, దీనిపై ఆసక్తి తగ్గడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని, వాటికి పరిష్కారాలు కనుక్కుని రైతులకు లాభసాటిగా మార్చాలని, ఇందుకోసం విస్తృత పరిశోధనలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్లే యువత వ్యవసాయాన్ని చేపట్టేందుకు ముందుకురావడం లేదని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఆహారశుద్ధి, ఉద్యానవనాలు, కోళ్లు, చేపలు, పశువుల పెంపకం వంటి రంగాలమీదా దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయాభివృద్ధికి నిపుణులు చేసిన సిఫార్సులు ¤ అయిదెకరాల్లోపు ఉన్న రైతులకు కొత్త విధానాల్లో వ్యవసాయం చేయడం నేర్పించాలి. ¤ చౌడు భూములుగా మారిన వేలాది ఎకరాలను తిరిగి సాగులోకి తీసుకురావాలి. ¤ కర్బన ఉద్గారాలను తగ్గించి, నీటి యాజమాన్య పద్ధతులు ఆచరణలోకి తీసుకురావాలి. ¤ అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకు వెళ్లాలి. ¤ సౌరశక్తి పంపులకు రాయితీలు ఇవ్వడం ద్వారా విద్యుత్తు వాడకంపై భారం తగ్గించాలి. ¤ భవన నిర్మాణాల్లో పచ్చదనం పెంచాలి. పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ¤ రైతుల పంటలకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపర్చాలి. |
No comments:
Post a Comment