Monday, July 21, 2014

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2014-15 కేంద్ర బడ్జెట్ కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2014-15 కేంద్ర బడ్జెట్ కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్    »    పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేసే కొన్ని ప్రతిపాదనలకు బడ్జెట్‌లో స్థానం దక్కింది.
   »    విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఈ ప్రతిపాదనల్లో కీలకమైనదిగా భావిస్తున్నారు. విశాఖ - చెన్నై కారిడార్‌ను చేపడతామని, దీనిలో భాగంగా 20 నూతన పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. తూర్పు తీరానికి కంఠహారంగా రూపొందే ఈ కారిడార్‌లో 90 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉండటం గమనార్హం.
   »    విశాఖపట్నం - చెన్నై మధ్య దూరం దాదాపు 800 కిలోమీటర్లు. ఇందులో దాదాపు 700 కిలోమీటర్ల మేరకు ఆంధ్రప్రదేశ్ భూభాగం.
   »    విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో తొలివిడత కనీసం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది.
   »    ఈ కారిడార్‌కు అవసరమైన ప్రణాళిక తయారీ, పెట్టుబడుల కోసం ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఆసక్తి చూపుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, అభివృద్ధి ప్రణాళికను జపాన్ అంతర్జాతీయ సహకార సమాఖ్య (జైకా) సిద్ధం చేస్తోంది.
   »    ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కాకినాడలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కును ప్రతిపాదించింది. కేంద్రమే నేరుగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు లభించనున్నాయి. ఇక్కడ తయారైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను నేరుగా కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
   »    నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ప్రాంతంలో చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఒక స్మార్ట్ సిటీని నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారిడార్‌లో తమిళనాడులోని 7 జిల్లాలు, కర్ణాటకలోని 7 జిల్లాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం, జిల్లాలు ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కూడా చేరింది. చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా తమిళనాడులోని పొన్నేరి, కర్ణాటకలోని తుముకూరు, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నాన్ని స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
   »    కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ఒక జాతీయ పారిశ్రామిక కారిడార్ల అథారిటీ ఏర్పాటు కానుంది. దీన్ని పుణె కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి రూ.100 కోట్ల నిధులు కేటాయించారు.
   »    ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఏర్పాటుకు తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ఐఐటీతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకూ తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
   »    బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ జాతీయ అకాడమీని కేంద్రం మంజూరు చేసింది. అనంతపురం జిల్లా హిందూపురం వద్ద ఈ అకాడమీని నెలకొల్పుతారు. ప్రస్తుతం జాతీయ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కోటిక్స్ అకాడమీ (ఎన్ఏసీఈఎన్) ప్రధాన శిక్షణ కేంద్రం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా కొనసాగుతోంది. ఈ అకాడమీకి బెంగళూరు, ముంబయి, చెన్నై, పాట్నా, వడోదర, కొల్‌కత, కాన్పూర్, హైదరాబాద్, ఢిల్లీల్లోనూ ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.
   »    కేంద్ర ప్రభుత్వం బెంగళూరు - ముంబయి పారిశ్రామిక కారిడార్‌ను కూడా ప్రతిపాదించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు మేలు జరిగే అవకాశం ఏర్పడుతుంది.
తెలంగాణ 
   »    తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశే మిగిలింది. అనేక వరాలను ప్రభుత్వం కోరినా ఒక్క ఉద్యానవన విశ్వవిద్యాలయంతోనే కేంద్రం సరిపెట్టింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన వాటిలో ఇది ఒకటి. అందులోని మిగిలిన ఏ ఒక్కదానిపైనా ప్రభుత్వం దృష్టి సారించలేదు.
కేంద్ర పన్నుల్లో రెండు రాష్ట్రాల వాటా:
   »    ఆంధ్రప్రదేశ్‌కు 2014-15 కేంద్ర పన్నుల్లో వాటా రూపేణా రూ.16,838 కోట్ల మేర లభించనుంది.
   »    ఇదే సమయంలో తెలంగాణకు రూ.9,749 కోట్లు అందుతాయి.
   »    కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా వాటాలను వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిర్ధరించిన శాతాన్ని రెండు రాష్ట్రాలకు జానాభా నిష్పత్తిలో వేరుచేసి ఆ దామాషాలో నిధులను పొందుపరిచింది.
   »    కేంద్ర ప్రభుత్వానికి అందే పన్ను రాబడుల్లో ప్రస్తుతానికి 32 శాతం మేర రాష్ట్రాలకు లభిస్తుంది. ఈ 32 శాతంలో ఏ రాష్ట్రానికి ఎంత వాటాను ఇవ్వాలనేది 2010లో 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.
   »    దీని ప్రకారం సేవా పన్ను మినహా మిగతా ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ లాంటి వాటిలో ఉమ్మడి రాష్ట్రానికి 6.937 శాతం మేర లభించేది. సేవా పన్నులో 7.047 శాతం అందేది.
   »    రాష్ట్రం వేరుపడిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు పన్నుల మొత్తాలను వేర్వేరుగా ఇవ్వాల్సి ఉండటంతో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వాటాలనే రెండు రాష్ట్రాలకు కేంద్రం జనాభా నిష్పత్తిలో విభజించింది. దీంతో సేవా పన్ను మినహా మిగతా పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 4.044 శాతం మేర, తెలంగాణకు 2.893 శాతం మేర తాత్కాలిక వాటాలు లెక్కతేలాయి.
   »    14వ ఆర్థిక సంఘం చేసే సిఫారసుల మేరకు 2015-16 బడ్జెట్ మొదలుకుని రెండు రాష్ట్రాలకు స్పష్టమైన వాటాల శాతాలు ఉంటాయి.
   »    ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు దానిలో కేంద్ర పన్నుల్లో రూ.27,028 కోట్ల మేర రానున్నట్లు అంచనా వేశారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు కలిపి రూ.26,588 కోట్లను ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడం బట్టి ఉమ్మడి రాష్ట్ర అంచనా కంటే రూ.440 కోట్ల మేర తగ్గినట్లయింది.

No comments:

Post a Comment