Friday, June 10, 2016

బందీగా బాల్యం!

కైలాస్‌ సత్యార్థి వంటి 'నోబెల్‌' యోధులు బాలల వెట్టిచాకిరి నిర్మూలనకు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటం- అనితరం. కాలం దొర్లిపోతున్నా బందీగా ఉన్న బాల్యాన్ని ప్రభుత్వాలు విడిపించ లేకపోవడమే అసలు విషాదం. బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్ట సవరణ బిల్లునైనా పార్లమెంటులో గట్టెక్కిస్తారేమో చూడాలి...
మానవ హక్కుల ఉల్లంఘనలో అతి పెద్దది, ఎంతో ఘోరమైనది బాల్యాన్ని కబళించడం! బడిలో ఉండాల్సిన పిల్లలు- పొలాల్లో గనుల్లో కార్ఖానాల్లో రెక్కలు ముక్కలు చేసుకునే స్థితి 'మానవతా! నువ్వెక్కడ' అని ప్రశ్నిస్తోంది. జైపూర్‌లో రాళ్లు కొట్టే పని, సూరత్‌లో వజ్రాల చెక్కుడు, అలీగఢ్‌లో తాళాల తయారీ, ఫిరోజ్‌బాద్‌లో అద్దాల పరిశ్రమ, శివకాశిలో బాణసంచా తయారుచేసి విక్రయించే వైనం, తిరువళ్లూరులో ఇటుక బట్టీల్లో కాలిపోయే బతుకులు...ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని నగరం హైదరాబాద్‌కు బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, ఒడిశా, తమిళనాడు, అసోం, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి బాలకార్మికుల తరలింపు కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. దిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, చెన్నైలతో పోల్చిచూస్తే హైదరాబాద్‌లోనూ ఆ కష్టజీవుల సంఖ్య అధికంగా ఉంటోంది! వివిధ పనులతో బతుకులీడుస్తున్న అనేకమంది పిల్లలను ఇటీవల హైదరాబాద్‌లో మెరుపు దాడుల సందర్భంగా అధికారులు గుర్తించారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ పలువురిని వెట్టి నుంచి విముక్తం చేసి తిరిగి స్వస్థలాలకు పంపించారు. వారిలో బిహార్‌తో పాటు ఉత్తర, దక్షిణాది ప్రాంతాలకు చెందిన ఎందరెందరో బాలలున్నారు. బాలలతో చాకిరి చేయించడాన్ని అంతర్జాతీయ సంస్థలు 'దోపిడి వ్యవస్థ'గా, చాలా దేశాలు 'చట్టవిరుద్ధం'గా ప్రకటించాయి. వెట్టి విముక్త బాలబాలికలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు దాదాపు వంద దేశాల్లో రెండు దశాబ్దాలుగా నడుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఇప్పుడు 'బాలల హక్కుల పరిరక్షణ సంఘాల' నిర్మాణ, నిర్వహణల్లో తలమునకలవుతున్నాయి. జీవనాధార కల్పన, హక్కుల సంరక్షణలే అన్నిటికన్నా ముఖ్యమని కేంద్ర కార్మిక- ఉపాధి కల్పన శాఖ దృఢంగా విశ్వసిస్తోంది. అందుకే పిల్లలతో అలవిమాలిన పనులు చేయించే యజమానులు, తల్లిదండ్రులకు సైతం కారాగారవాస శిక్ష, జరిమానాలు విధించేలా ప్రతిపాదించామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇటీవల ప్రకటించారు.
భారత్‌లో చేయాల్సిందేమిటి?
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొదటినుంచి ఓ సమస్యగా భావిస్తున్నాయే తప్ప సవాలుగా స్వీకరించడం లేదు. రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి లోపించడమే ఇందుకు మూలమన్నది నిస్సందేహం. 'ఓటు బ్యాంకు కాదు' కనుకే పిల్లల బాగోగుల్ని ఏ రాజకీయపక్షమూ పట్టించుకోవడం లేదన్నది నూరుపాళ్లూ నిజం. పేదరికం, నిరక్షరాస్యత, పిల్లల చాకిరి... ఈ మూడింటి చక్రబంధాన్నీ అవగతం చేసుకుంటేనే సమస్య పూర్వాపరాలు తెలుస్తాయి. పరిష్కరించే మార్గాలూ కనిపిస్తాయి. సార్వత్రిక ప్రాథమిక విద్య అమలును కేవలం ఓ ప్రచారాస్త్రంగానో, న్యాయస్థానాలు ఎప్పుడైనా నిలదీసినప్పుడు ప్రభుత్వ 'స్పందన'ను సూచించే కార్యక్రమంగానో వాడుకుంటే అంతకు మించిన ప్రజాద్రోహం మరొకటి ఉండదు. సామాజిక వెనకబాటును ఛేదించేలా ఆ విద్యాప్రక్రియ నిర్మాణ నిర్వహణలు ఉండాలి. ఇకముందైనా దాన్ని 'ప్రచార దశ' నుంచి ప్రజా ఉద్యమ స్థాయికి చేరిస్తేనే పాలనా వ్యవస్థమీద అందరికీ గురి కుదురుతుంది. 'పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు- బడిలో' అని నినదించగానే సరిపోదు. బాలకార్మిక వ్యవస్థను నిషేధించినట్లు ప్రకటించడంతోనే, దానంతట అది దేశంలో మటుమాయమైనట్లు కాదు. సంతానానికి చదువు చెప్పించడం వల్ల ఆ కుటుంబానికి, సంఘానికి, దేశానికి కలిగే ప్రయోజనాలను- ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులకు వివరంగా తెలియజేసే కృషి అత్యవసరం.
ఇందులో ఉపాధ్యాయులతో పాటు విశ్రాంత ఉద్యోగులు, మహిళా కార్యకర్తలు, స్వచ్ఛంద-యువజన సంస్థల సేవలను క్షేత్రస్థాయి నుంచే వినియోగించుకోవచ్చు.
పిల్లల్ని చాకిరి మాన్పించి బడికి పంపిస్తే- పరిహారం ఇస్తామనో పునరావాసం కల్పిస్తామనో హామీలిచ్చినంత మాత్రాన పేదల కష్టనష్టాలన్నీ ఉన్నపళంగా తీరిపోవు. ఆ ముందూ వెనకా ఉన్న అన్ని స్థితిగతులనూ పరిగణించి వ్యవహరించాల్సిన కనీస బాధ్యత పాలకులదే. మరో ముఖ్య కార్యక్రమం- వయో విభజన ఆధారంగా వెట్టి విముక్త బాలలకు వెంటనే విద్యాలయాల్లో ప్రవేశం కల్పించడం. ప్రత్యేక తరగతులు, శిక్షణ కార్యక్రమాలు వెంటవెంటనే నిర్వహిస్తే వారిలో ఆసక్తి, ఆత్మవిశ్వాసం తప్పక పెరుగుతాయి. బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను కచ్చితంగా తేల్చగలిగే సమగ్ర సర్వేలను పకడ్బందీగా నిర్వహించుకోవడం ప్రభుత్వాల కర్తవ్యం. ఉపాధ్యాయులతో పాటు గ్రామీణ యువజన సంఘాలకు ఈ ప్రక్రియలో ఎంత ఎక్కువగా భాగస్వామ్యం కల్పిస్తే అంత బాగా ఫలితాలుంటాయి. సమస్యను పరిష్కరించే తీరు పట్ల స్పష్టత, క్షేత్రస్థాయి అనుభవం కలిగిన ప్రభుత్వేతర సంస్థలతో సమన్వయం అన్నింటికన్నా ప్రధానం. కుటుంబ పరిధితో పాటు చిన్నచిన్న బృందాలుగా పనిచేసే పిల్లలు బాలకార్మిక నిరోధక చట్టం పరిధిలోకి రారన్నది ఇప్పటికీ పలువురు తల్లిదండ్రులు, వ్యాపారుల్లో ఉన్న అభిప్రాయం. దీన్ని ఆసాంతం తొలగించాల్సిన ముఖ్య విధి పూర్తిగా ప్రభుత్వాలదే! అంతేకాక విముక్త బాలలను చదివించేందుకు ముందు నిలిచే కార్పొరేట్‌, ఇతర సామాజిక సేవా సంస్థలకు మార్గదర్శనం చేయాల్సి ఉంది. విద్య, కార్మిక, శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ... ఇలా పలు విభాగాలు అంతటా ఉన్నాయి. ఎవరి పని వారిదిగా, ఎవరి నివేదికలు వారివిగా ఉండటంవల్లే సమస్య నానాటికీ సంక్లిష్టమవుతోంది. వివిధ శాఖలు, సంస్థలు, సంఘాల మధ్య అన్వయం, పరస్పర సహకారం కుదిరేలా ప్రభుత్వం అప్రమత్తత వహించాలి. రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థల ఉమ్మడి కృషే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం!
స్ఫూర్తిదాత బ్రెజిల్‌
వివిధ రూపాల్లోని బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామంటూ అంతర్జాతీయస్థాయి 'డిక్లరేషన్‌'పై సంతకాలు చేసిన దేశాల్లో బ్రెజిల్‌ ఒకటి. చక్కటి భవిత ఆశించి, సంతానాన్ని బడులకు పంపించే పేద తల్లిదండ్రులకు ఆ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. నగదు బదిలీ పథకం అమలును వూరూవాడా విస్తరించి, అందరి లోగిళ్లలో వెలుగుపూలు పూయిస్తోంది. ఫలితంగా రెండు దశాబ్దాల కాలవ్యవధిలో అక్కడ పాఠశాలలకు బాలల హాజరు శాతం 97శాతానికి పెరిగింది. పిల్లలతో చాకిరిని నిర్మూలించేలా శాసన వ్యవస్థలన్నింటినీ ఏకీకృతం చేయడం, సంబంధిత సంస్థలు- సంఘాల కార్యకలాపాలు అన్నివిధాలా ముమ్మరమయ్యేలా చూడటం ఆ ఘనతకు కారణాలు. విరివిగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తూనే, మరో వైపు బాలకార్మిక స్థితిగతులపై ఆ దేశంలో అధికారులు విస్తృత తనిఖీలు సాగించారు. చట్టసంబంధమైన అనేక సంస్కరణలు తెచ్చి, పేదబాలల బతుకుచిత్రం మార్చారు. పిల్లల హక్కుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం, వాటికి భంగం కలిగించిన పరిశ్రమలపై అత్యంత కఠినంగా వ్యవహరించడం... ప్రభుత్వం ఆశించిన ఫలితాలను అనతికాలంలోనే అందించాయి. బాధాకర స్థితుల్లో, అనారోగ్య వాతావరణంలో, ప్రమాదభరిత పనులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అభాగ్య బాలలకు అధికారులే కుడిఎడమల అండగా నిలిచారు.

తెలుగుతోనే బంగరు భవిత!

ప్రపంచవ్యాప్తంగా ఆయా జాతులవారు తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, పరివ్యాప్తికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి 'మాతృభాషా దినోత్సవాలు' ఒక వేదిక. ఈసారి మాతృభాషా దినోత్సవంనాడు కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మూడో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించడం అభినందనీయం.
కుటుంబానికి అమ్మ కేంద్రబిందువు. మన సంస్కృతీ సభ్యతలను పరిరక్షించుకోవడానికి అమ్మ భాష ఎంతో అవసరం. 'కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం మరచినవాడు మానవుడే కాదు' అంటారు కదా! నేనెంతో దురదృష్టవంతుణ్ని. ఏడాదిన్నర వయసులో ఉండగానే, అమ్మను కోల్పోయాను. తెలుగువాడిననే భావం, 'ఒక మహత్తర భాషకు వారసుణ్ని' అనే సంతృప్తి నాలో ఉంది. ఇంతటి మహోన్నత సంస్కృతి ఉన్న మన తెలుగు భాషను రక్షించుకోవాలి. మాతృభాషను రక్షించుకోవడం- మానసిక వికాసాన్ని, సృజనాత్మకతను వెలికితీస్తుంది. ఒక రచయిత చెప్పినట్లు 'మాతృభాష మన కళ్లలాంటిది. పరభాష కళ్లజోడులాంటిది. కళ్లు లేకుండా కళ్లజోడు పనికిరాదు. అంధుడికి ఎంత విలువైన కళ్లజోడు పెట్టినా ప్రయోజనం ఉండదు'. అందుకే మనం ముందుగా మాతృభాషను అభ్యసించాలి. ఆ తరవాత ఎన్ని భాషలనైనా సులభంగా నేర్చుకోవచ్చు. వాటిలో పాండిత్యం సంపాదించవచ్చు.
మహాసభలకు సందేశం పంపిస్తూ రామోజీరావు చెప్పినట్లు, 'ఇది మన ఇంట్లో పండుగ'. మన ఇంట, మన పంట, మన వంట, మన జంట- దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. మన మాట, మన పాట, మన ఆట, మన బాట, మన చేతి రాత, మన భాష, మన ధ్యాస, మన ప్రాస, మన మాండలికం, మన గ్రాంథికం, మన సంగీతం, మన సాహిత్యం... ఉత్కృష్టమైనవి. ఇలాగే భారతీయ భాషలన్నింటికీ విశిష్టతలున్నాయి.
మనకు స్వరాజ్యం వచ్చిందే కానీ- మన సొంత భాషను మరచి పరభాషలమీద మోహంతో పాశ్చాత్య సంస్కృతిపై వ్యామోహంతో కొట్టుమిట్టాడుతున్నాం. జాతీయ స్థాయిలో హిందీ తరవాత రెండో స్థానంలో ఉన్న మన తెలుగు భాష క్రమంగా వెనకబడిపోతోంది. ఇంగ్లిషు నేర్చుకోవడంలో తప్పు లేదు. ఆ మనస్తత్వాన్ని అలవరచుకోవడమే ప్రమాదకరం!
కొత్త తరంలో తెలుగు చదివేవారి సంఖ్య తగ్గిపోతోంది. తెలుగు సాహిత్యం, తెలుగు పద్యం, తెలుగు కథలు, తెలుగు కళలు మొదలైన అంశాలకు సంబంధించిన పరిజ్ఞానం క్రమంగా తగ్గుతోంది. తెలుగులో మాట్లాడటానికీ జంకుతున్నారు. నామోషీగా భావిస్తున్నారు. ఇప్పుడు చాలా విద్యాలయాల్లో తెలుగు అంతరించింది. దీని ఫలితంగా తెలుగు చదవటం, తెలుగు రాయడంలో ఈతరం పిల్లలు వెనకబడిపోతున్నారు.
ఏ భాషైనా విశ్వవ్యాప్తం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరం. ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదం అయినంతగా, మన తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదు. దీనికోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 'కేంద్రీయ హిందీ సంస్థాన్‌'లా తెలుగు భాషకూ ఓ ప్రత్యేక సంస్థ ఉంటే, తెలుగును మరింతగా వ్యాపింపజేయవచ్చు. అనువాద విధానంలో మనం వెనకబడి ఉండటం వల్ల మన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, పొట్టి శ్రీరాములు పట్టుదల, మన టంగుటూరి, మన విశ్వనాథ, మన శ్రీనాథల సాహిత్య సౌరభాలు, వారి ప్రజ్ఞాపాటవాలు... వింధ్య పర్వతాల ఆవల ఉన్నవారికి తెలియడం లేదు.
మన తెలుగు ఎంతో మధురమైన భాష. ముత్యాలవంటి అక్షరాలు మన భాషకు ఉన్న ప్రత్యేకత. మన శబ్ద మాధుర్యం, భావ సౌందర్యం విశిష్టమైనవి. అందుకే తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 'సుందర తెలుంగు' అని ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయలు కన్నడ ప్రభువు అయినా తెలుగులో 'ఆముక్తమాల్యద' పేరిట అద్భుత ప్రబంధాన్ని రచించి 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు భాషా వైశిష్ట్యాన్ని కొనియాడాడు. ఇటలీ దేశవాసి నికోలో కోంటి తెలుగును 'ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌' అని ప్రశంసించాడు. మన తెలుగుభాష ఉన్నతికి, వ్యాప్తికి కృషిచేసిన విదేశీయుడైన సీపీ బ్రౌన్‌ మహాశయుణ్ని మనం గుర్తుంచుకోవాలి. మన భాష కోసం కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ, శ్రీపాద, విశ్వనాథ, తాపీ ధర్మారావు వంటి మహనీయుల్ని మనం నిత్యం స్మరించుకోవాలి.
సంస్కృతి, సంస్కారం భాషలో ఇమిడి ఉంటాయి. భాషలో సంస్కృతి, సంస్కృతిలో భాష మమేకం అవుతాయి. పలు భాషల్లో అధ్యయనం, వివిధ సంస్కృతులతో అనుబంధం- మానవాళికి మంచి చేకూరుస్తాయి. అంతకుముందే, మన పునాది అయిన మాతృభాషను శక్తిమంతం చేసుకోవాలి. మాతృభాషను కోల్పోతే మన వారసత్వాన్ని కోల్పోయినట్లే. 'తెలుగుభాషను నేర్చుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్తు' అనే భావన కల్పించాలంటే- తెలుగును తప్పనిసరిగా ప్రాథమిక, ఉన్నతవిద్యా స్థాయుల్లో పాఠ్యాంశంగా చేర్చాలి. పెద్ద బాలశిక్షను తిరిగి పాఠ్యాంశం చేయాలి. మాతృభాష అభివృద్ధికి శాసనకర్తలు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, అధికారులు, సాధారణ ప్రజలు... పరిపాలకుల నుంచి పరిపాలితుల వరకు అందరూ కృషిచేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలు, న్యాయస్థానాల్లో తీర్పులు, నామ ఫలకాలు, వీధుల సూచికలు, బస్సు మార్గాలు- ఇలా అన్నీ తెలుగులో ఉండాలి. ప్రాచీనమైన తెలుగుభాష పరిరక్షణకు ఒక సాధికారిక సంస్థ లేదా మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలి. అన్ని స్థాయుల్లో తెలుగుభాష వాడకాన్ని ప్రోత్సహించాలి.మన తెలుగువారికి ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఇద్దరు 'చంద్రులూ' శ్రీకృష్ణదేవరాయల్ని ఆదర్శంగా తీసుకుని, తెలుగుభాష అభ్యున్నతికి కృషిచేయాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం- ఏడాది పొడవునా మాతృభాషోత్సవాలు నిర్వహించాలని, అన్ని రాష్ట్రాలూ అందుకు చర్యలు తీసుకోవాలని కోరడం చాలా సంతోషం.
మన తెలుగుభాషను ఉపయోగించాల్సిన తీరులో మనం ఉపయోగించలేకపోవడం విచారకరం. పాశ్చాత్య వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాం. 'ఏ బోర్డు చూసినా ఏమున్నది గర్వకారణం... అంతటా ఆంగ్లమయం' అన్నట్లు పరిస్థితి తయారైంది. 'అమ్మా, నాన్నా!' అని నోరారా పిలవలేకపోతున్నాం. మమ్మీ డాడీల పిలుపులకు మురిసిపోతున్నాం! 'మమ్మీ' అనే పదం కేవలం పెదవులమీద నుంచి వస్తుంది. అమ్మ పదం హృదయపు లోతుల నుంచి వెలువడుతుంది, అదే మన భాషలోని గొప్పతనం. మన తెలుగును మనమే నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. 'మహాత్మాగాంధీ రోడ్డు' అని ముచ్చటగా పేరు ఉంటే 'ఎంజీ రోడ్డు' అంటున్నాం. ఎందుకీ భాషా దారిద్య్రం? తిరుమల-తిరుపతి దేవస్థానంవారు సైతం అర్చనానంతర దర్శనాన్ని 'ఏఏడీ' అంటున్నారు. నిజపాద దర్శనాన్ని 'ఎన్‌పీడీ' అని పిలుస్తున్నారు. 'ఎయిర్‌ హోస్టెస్‌'ను తెలుగులో 'గగన సఖి' అని ఎంత అందంగా చెప్పవచ్చు! 'గుడ్‌ మార్నింగ్‌' బదులు 'నమస్కారం' అనడంలో ఎంతో సంస్కారం ఉంది. నేను ఆంగ్లంలో మాట్లాడుతూ, అప్పుడప్పుడు పదాలు దొరక్క తెలుగులో మాట్లాడేస్తుంటా. వెంటనే చప్పట్లు మోగుతాయి. అదీ అమ్మ భాష ఘనత! తెలుగుభాష ఏ భాషా పదాన్నైనా ఇముడ్చుకోగలుగుతుంది. ఈ అంతర్జాల యుగంలో సాంకేతికత సాయంతో తెలుగును విశ్వవ్యాప్తం చేద్దాం. ఈ పని రాత్రికి రాత్రే జరగదు! మనం విశేషంగా కృషిచేసి, అన్ని రంగాల్లో తెలుగును ప్రయోగించినప్పుడే ఇది సాధ్యం.
భౌగోళికంగా, రాజకీయంగా విడిపోయినా తెలుగువారందరం ఒక్కటే. రాష్ట్ర విభజన తెలుగు ప్రజల్ని విభజించకూడదు. ప్రపంచంలోని ఏ భాషా వ్యవహర్తలూ ఒకే విధంగా మాట్లాడరు. అనేక వ్యవహార భేదాలు అంటే, మాండలిక భేదాలు ఉంటాయి. మన తెలుగులోనూ ఉన్నాయి. కళింగాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలికాలున్నాయి. అంతటా ఒకే తెలుగు. వ్యవహారంలోనే భేదం. ఎన్ని వ్యవహార భేదాలున్నా తప్పు లేదు. కానీ ప్రతిచోటా తెలుగు కనిపించాలి, వినిపించాలి. మొదట మాతృభాష అభ్యాసం, ఆ తరవాత పరభాష అధ్యయనం, బహు భాషల అధ్యయనం అవసరం.
మన మాతృభాష తెలుగును గౌరవిద్దాం. మన తెలుగు సంస్కృతిని మనం ఆదరిద్దాం. ప్రజలు నడుం కడితే తెలుగుభాషకు అంతం ఉండదు. తెలుగు భాషను, సంస్కృతిని రక్షించుకునే ఉద్యమం ప్రజల్లో మొదలు కావాలి. ప్రజలు కోరుకుంటే ప్రభుత్వం ఏ భాషావ్యాప్తికైనా దోహదం చేస్తుంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభ స్ఫూర్తితో తెలుగు వారందరం ఐక్యంగా సాగుదాం. మన భాషను, సంస్కృతిని సంరక్షించుకుందాం. మన ఉనికి కాపాడుకుందాం!

మార్కుల విద్య... మార్పులు మిథ్య!

* ‘ప్రాథమిక’ సంస్కరణలు కీలకం... 
భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందడానికి మరీ ఇంత ఆలస్యమవుతోందేం? ఆర్థికాభివృద్ధి పథంలో చైనా పరుగులు చూసి ప్రతి ఒక్కరూ వేసుకొంటున్న ప్రశ్న ఇది. ఈ పరుగులో భారత్‌ వెనకబడటానికి అనేక కారణాలున్నా వాటిలో ప్రధానమైంది- లోపభూయిష్టమైన మన విద్యావ్యవస్థ. కొంతకాలం నుంచి అన్ని రంగాల్లో సంభవిస్తున్న సమూల మార్పులకు దీటుగా భారతీయ బాలలు, యువతీయువకులను సిద్ధం చేయడంలో మన విద్యావ్యవస్థ విఫలమైంది. 21వ శతాబ్దిలో పెరుగుతున్న సవాళ్లను ఎలా తట్టుకోవాలో తెలియక తెల్లమొహం వేస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రస్తుత వృత్తి ఉద్యోగాలకు క్రమంగా మంగళం పాడుతుంటే, వాటి స్థానంలో రాబోయే ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏయే కొత్త టెక్నాలజీలు ఉద్భవిస్తాయో, అవి ఎలాంటి రాజకీయ ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకువస్తాయో, నూతన వృత్తిఉద్యోగాల స్వరూప స్వభావాలు ఎలా ఉండబోతున్నాయో మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు. అయినాసరే ఎలాంటి మార్పులు వచ్చినా తట్టుకుని రాణించేలా మన విద్యార్థులను సిద్ధం చేసే సత్తా మన విద్యావ్యవస్థలో ఏ మాత్రం కనిపించడం లేదు. పైగా భారతీయ విద్యాయంత్రాంగం రానురానూ శిథిలమైపోతోంది. ఈ క్షీణదశ నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను రక్షించాలన్న స్పృహ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొరవడుతోంది.

కొరవడిన నియంత్రణ 
ఆర్థిక సరళీకరణ ఫలాలను అందుకున్న సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలు నాణ్యమైన విద్యను డిమాండు చేస్తున్నాయి. దీన్ని సర్వశిక్షా అభియాన్‌ కాని, రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్‌ కాని తీర్చలేకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు. వారిని చూసి పేద, దిగువ మధ్యతరగతి వర్గాలూ అదేబాట పడుతున్నాయి.ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో తమ విద్యార్థులు భారీగా ప్రవేశాలు సాధిస్తున్నారంటూ ప్రైవేటు సంస్థలు చేస్తున్న ఆర్భాటం మరింతమందిని ఈ సంస్థలవైపు ఆకర్షిస్తోంది. కానీ, ప్రైవేటు విద్య మహా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఈ ప్రైవేటు సంస్థలను ప్రధానంగా రాజకీయ నాయకులు, పలుకుబడి గలవారే నిర్వహిస్తున్న దృష్ట్యా అవి తీసుకునే విరాళాల(డొనేషన్ల) మీద కాని, వసూలుచేసే రుసుముల మీద కాని ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది. ప్రైవేటు విద్య నాణ్యమైందనే భావన జనంలో పాదుకుపోవడంతో ఈ సంస్థలకు గిరాకీ విజృంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు నాసిగా ఉండటంతో ప్రైవేటు విద్యాసంస్థల పట్ల జనాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఈ గిరాకీ-సరఫరా చక్రంలో సామాన్యుడు నలిగిపోతున్నాడు. ప్రైవేటు విద్య అతడి పిల్లలకు అందని మాని పండు అయింది. విద్య ఓ వ్యాపార సరకుగా మారి, కిండర్‌ గార్టెన్‌ సీట్లూ బోలెడు డబ్బు ధారపోసి కొనుక్కోవలసిన అగత్యమేర్పడింది. ఆంగ్ల మాధ్యమం కోసం అందరూ ఆరాటపడటం ఈ ధోరణిని మరింత ఎగదోస్తోంది. పిల్లలకు మంచి చదువు చెప్పించడం కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. అనేకమంది తమకున్న కొద్దిపాటి ఆస్తులు కూడా తెగనమ్ముకుంటున్నారు. ఏటా పెరిగిపోతున్న ట్యూషన్‌ ఫీజులు తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. నర్సరీ స్కూళ్ల చదువు సైతం ఖరీదైనదిగా మారింది. అయిదు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వార్షిక ఆదాయం గల కుటుంబాలు అందులో 20శాతం పాఠశాల చదువుకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. కిండర్‌ గార్టెన్‌ నుంచి పదో తరగతి వరకు చదువు చెప్పి, ఆ తరవాత మీ డిపాజిట్‌ మీకు వాపసు చేస్తామంటూ కొన్ని విద్యాసంస్థలు వందలాది తల్లిదండ్రులకు టోపీ వేస్తున్నాయి. రుసుములకు తోడు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, రవాణా పేరిట డబ్బు పిండటం ప్రైవేటు విద్యాసంస్థలకు పరిపాటి. హైదరాబాద్‌ మహానగర పరిధిలోని మూడువేల పైచిలుకు ప్రైవేటు పాఠశాలల్లో సగానికి ఆట మైదానాలు లేవు. ప్రైవేటు విద్యాసంస్థల పాఠ్య ప్రణాళికల్లో వ్యాయామానికి స్థానం కల్పించడం లేదు. పాఠశాల అంటే బట్టీ చదువుల నిలయం కారాదు. అది విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి బాట వేయాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దిగనాసిగా ఉండటంవల్లే విద్యార్థులు ప్రైవేటు ట్యూషన్లు, కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోందని జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ఇటీవల తేల్చింది. ఫలితంగా ఒక కుటుంబ ఆదాయంలో 11-12శాతం ట్యూషన్లు, కోచింగ్‌కే పోతోంది. నేడు 7.1కోట్లమంది, అంటే మొత్తం విద్యార్థుల్లో 26శాతం ట్యూషన్లు తీసుకుంటున్నారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులిద్దరూ ఉన్నారు. వైద్య, ఇంజినీరింగ్‌, చార్టర్డ్‌ ఎకౌంటెన్సీ చదువుల పట్ల తల్లిదండ్రుల్లో ఉన్న మోజే కోచింగ్‌ సెంటర్ల విస్తరణకు దోహదం చేస్తోంది. తల్లిదండ్రులు తమ కలలు, కోరికలను పిల్లల మీద రుద్దకూడదని హితవు చెబుతూ కోట(రాజస్థాన్‌) కలెక్టర్‌ బహిరంగ లేఖ రాశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఫీజులు, పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ పేరిట భారీ మొత్తాలు వసూలుచేసే ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఉపాధ్యాయులకు సరైన జీతభత్యాలు చెల్లించడంలో మాత్రం అదే జోరు చూపడం లేదు. వారికి సామాజిక భద్రత లేదు. నిర్ణీత పని గంటలూ లేవు. అనేక స్కూళ్లు నైపుణ్యం లేని కూలీలకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలకన్నా తక్కువ మొత్తాలను ఉపాధ్యాయులకు చెల్లిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఉపాధ్యాయులు తమ విజ్ఞానస్థాయిని పెంచుకోవడానికి ఎలా కృషి చేయగలుగుతారు?
ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 25శాతం సీట్లు పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలని విద్యాహక్కు చట్టంలోని 12వ సెక్షన్‌ నిర్దేశిస్తున్నా, అది అమలుకు నోచుకోవడం లేదు. ఆదాయపరంగా ఇతరత్రా అసమానతలను తగ్గించి అందరికీ సమానావకాశాలు, సౌకర్యాలను కల్పించాలని రాజ్యాంగంలోని 38 (2) అధికరణ పేర్కొంటున్నా ప్రభుత్వాలు సాధించిందేమీ లేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యాహక్కు చట్టాన్ని వర్తింపజేయాల్సి ఉంది. దీని ప్రకారం ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉండాలి. మరుగుదొడ్లు, తాగునీటి వసతి, తరగతి గదుల నిర్మాణం, విద్యార్థుల భద్రత కోసం ప్రహరీగోడ నిర్మాణం వంటి నిబంధనలను కూడా విద్యాసంస్థలు పాటించడంలేదు.
ఒకప్పుడు ఉన్నత విద్య కోసం చైనా విద్వాంసులు భారతదేశానికి వచ్చేవారు. నేడు పరిస్థితి తారుమారైంది. ప్రపంచంలో 100 అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో తరచూ చైనా యూనివర్సిటీలు స్థానం సంపాదిస్తుండగా, భారత్‌ నుంచి కనీసం ఒక్క సంస్థ అయినా ఆ గౌరవం దక్కించుకోలేకపోయింది. చైనా ప్రాథమిక పాఠశాల స్థాయినుంచే పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటే, భారత్‌లో కనీసం ఉపాధ్యాయులు కూడా లేని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇప్పటికీ పాఠశాలలు లేని గ్రామాలు కొల్లలు. సర్వశిక్ష అభియాన్‌ పథకాన్ని చేపట్టి 14ఏళ్లు, విద్యాహక్కు చట్టం తీసుకొచ్చి ఎనిమిదేళ్లయినా ఇంకా ఈ దుస్థితి నెలకొని ఉండటం దారుణం. పటిష్ఠ విద్యావ్యవస్థ లేనిదే భారతదేశం విజ్ఞానాధారిత సమాజంగా ముందడుగు వేయలేదు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పడంకన్నా ఇతర కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు ఏకరూప దుస్తులు అమరేలా చూడటం, పారిశుద్ధ్య రక్షణ, బాలలకు మందుల పంపిణీ, జనగణన, ఇంటింటి సర్వేలు, ఎన్నికల విధులు తదితరాలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను నిజానికి ప్రభుత్వ పథకాల సమన్వయకర్తలని పిలవాలి. ఇలా విద్యేతర పనుల ఒత్తిడి పెరిగిపోవడంతో టీచర్లు విద్యార్థులకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. పైగా అనేక ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల కొరత ఉంది. అదే ప్రైవేటు విద్యాసంస్థలను చూస్తే అక్కడ ఉపాధ్యాయులకు పాలనా వ్యవహారాలతో నిమిత్తం ఉండదు. వారు తమ పూర్తి సమయాన్ని, శక్తియుక్తులను విద్యార్థుల చదువుసంధ్యల మీదే కేంద్రీకరించాల్సి ఉంటుంది. అయినా, ఏవో కొన్ని పేరున్న విద్యా సంస్థల్లో తప్ప ఇతర ప్రైవేటు సంస్థల్లో టీచర్ల జీతభత్యాలు చాలా తక్కువ. ఈ వాతావరణంలో ప్రతిభావంతులు ఉపాధ్యాయ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనబరచడంలేదు. ఏ దారీ లేదనుకున్నప్పుడు మాత్రమే బోధనా వృత్తి ఎంచుకొంటున్నారు.

దారిచూపిన న్యాయస్థానం 
చాలినంతమంది ఉపాధ్యాయులు లేక పలు ప్రభుత్వ పాఠశాలలు మూతబడిపోయాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని అలహాబాద్‌ హైకోర్టు నిరుడు ఆగస్టులో జారీచేసిన ఆదేశం అందరికీ శిరోధార్యం. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు పెంచే ముందు విద్యాశాఖాధికారుల అనుమతి తీసుకోవాలంటూ ఇటీవల దిల్లీ ప్రభుత్వం జారీచేసిన ఆదేశమూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం. తల్లిదండ్రులు కూడా అధిక మార్కులే విద్యకు పరమావధి అని భావించరాదు. పిల్లల వ్యక్తిత్వం అన్ని విధాలుగా వికసించేలా శ్రద్ధ వహించాలి. వేగంగా మారిపోతున్న 21వ శతాబ్ది ప్రపంచంలో వారు రాణించగలిగేలా తీర్చిదిద్దాలి. దీనికి ఓం ప్రథమంగా మన ప్రాథమిక విద్యావ్యవస్థను పటిష్ఠపరచాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచాలి. అన్నింటినీ మించి విద్యకు అధిక నిధులు కేటాయించాలి. అమెరికా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 5.4శాతం, బ్రెజిల్‌లో 5.7శాతం విద్యకోసం వెచ్చిస్తుండగా, భారత్‌ తన జీడీపీలో కేవలం మూడు శాతం ఖర్చు చేస్తోంది. ఈ లోటుపాట్లను సరిదిద్దాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రహించారు. ‘ఇంతవరకు ప్రభుత్వం దేశమంతటికీ విద్యా సౌకర్యాలను విస్తరించడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. పిల్లలను పాఠశాలలకు పంపడంతోనే పని జరగదు. వారు విలువైన అంశాలు నేర్చుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి’ అంటూ ప్రధాని ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భవిష్యద్దర్శనం చేశారు. ఆయన పలుకులు ఆచరణ రూపం ధరిస్తే పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది!