Wednesday, July 23, 2014

16వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

మే - 16
¤ దేశంలో 16వ లోక్‌సభకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.      

» మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 సీట్లు అవసరం. భాజాపా ఒక్కటే 282 స్థానాలు సాధించి, అధికారానికి దూసుకెళ్లింది. భాజపా 24 పార్టీలతో కలిసి 'ఎన్‌డీఏ' కూటమిగా ఏర్పడింది. ఈ కూటమికి మొత్తం 335 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. యూపీఏ మిత్రపక్షాలు మొత్తం (కాంగ్రెస్‌తో కలుపుకొని) కేవలం 59 స్థానాలకే పరిమితమయ్యాయి. ఇతరులు 149 చోట్ల గెలుపొందారు.     

» 1984లో రాజీవ్‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ 417 స్థానాలు సాధించిన తర్వాత తాజాగా.. అంటే 30 ఏళ్ల తర్వాత సొంతంగా లోక్‌సభలో భాజపా స్పష్టమైన ఆధిక్యం సాధించడం విశేషం.     

» వడోదర, వారణాసి రెండు నియోజక వర్గాల నుంచీ నరేంద్రమోడీ విజయ దుందుభి మోగించారు. వడోదర నుంచి 5.7 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధుసూధన్ మిస్త్రీపై గెలుపొందారు.     
 » ఒడిశాలో బిజూ జనతాదళ్ పార్టీ (బీజేడీ) అసెంబ్లీ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 114 సీట్లు గెలుచుకుంది. దీంతో వరుసగా నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాన్ని నవీన్ పట్నాయక్ పొందారు.     

» దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను భాజపా తన ఖాతాలో వేసుకుంది. అయిదు నెలలక్రితం అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన 'ఆప్' ఇప్పుడు కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.      

» లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే చరిత్రాత్మక విజయం సాధించింది. ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని ఈ పార్టీ తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు 37 చోట్ల గెలుపొంది, సత్తా చాటింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకున్న ఏకైక పార్టీగా రికార్డు సృష్టించింది. భాజపా, డీఎంకేలు ఒక్కో స్థానాన్ని పొందాయి.     

» పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కూడా తిరుగులేని గెలుపు సాధించింది. మొత్తం 42 లోక్‌సభ స్థానాలకుగాను 34 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ 4 చోట్ల, భాజపా, వామపక్షాలు రెండేసి చోట్ల విజయం సాధించాయి.     

» మధ్య ప్రదేశ్‌లో కూడా అధికార భాజపా లోక్‌సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 29 స్థానాల్లో 27 చోట్ల భాజపా అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ తక్కిన రెండు స్థానాల్లో విజయం సాధించింది.      

» రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలనూ భాజపా గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇక్కడ వసుంధర రాజే నేతృత్వంలో భాజపా అధికారంలో ఉంది.     

» గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లనూ భాజపా గెల్చుకుంది. కాంగ్రెస్ గుజరాత్‌లో ఒక్కసీటునూ గెలుచుకోలేకపోవడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.
 

¤ 16వ లోక్‌సభలో స్వతంత్రులు కాకుండా మొత్తం 35 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది.      

» లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి అతి తక్కువగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. 1952 నుంచి మొదలైన ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఇదో రికార్డు. 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో 8241 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 3234 మంది స్వతంత్రులే. ఈ స్వతంత్రుల్లో ముగ్గురు విజయం సాధించగా, వారిలో ఇద్దరు కేరళకు చెందినవారు. అస్సాంలోని కోఖ్రాజర్ నుంచి పోటీ చేసిన నబకుమార్ సరానియా, కేరళకు చెందిన హాస్యనటుడు ఇన్నోసెంట్, న్యాయవాది జోయిస్ జార్జి ఈ ఎన్నికల్లో స్వతంత్ర ఎంపీలుగా నెగ్గారు. 1957లో రికార్డు స్థాయిలో 42 మంది స్వతంత్రులు లోక్‌సభకు నెగ్గారు.      

» ఈ దఫా లోక్‌సభలో మహిళా నేతల సంఖ్య 61కి పెరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో విజేతలై చట్టసభకు వచ్చిన మహిళలు 59 మంది కాగా ప్రస్తుతం ఈ సంఖ్య 61కి చేరింది. మొత్తం 543 మంది పార్లమెంటేరియన్లలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 11 శాతమే. మిగిలిన 89 శాతానికి పురుషులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.     

» ప్రస్తుత 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కేవలం 20 మంది ముస్లింలు మాత్రమే గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధికంగా ఏడుగురు, బీహార్ నుంచి నలుగురు ముస్లిం వర్గానికి చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. గత లోక్‌సభలో మాత్రం 25 మందికి పైగా ఎంపీలు ఉన్నారు.      

» ప్రస్తుతం దేశంలో 1687 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో కేవలం 35 పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. దేశవ్యాప్తంగా 1652 రాజకీయ పార్టీలు సున్నా ఫలితాలను సాధించాయి. ఖాతా తెరవని ప్రముఖ పార్టీల జాబితాలో బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ), అసోం గణ పరిషత్ (ఏజీపీ) ఉన్నాయి.

No comments:

Post a Comment