Wednesday, July 23, 2014

హిజ్రా (ట్రాన్స్‌జెండర్)లకు హక్కులు కల్పిస్తూ, సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏప్రిల్ - 15,2014
¤ హిజ్రా (ట్రాన్స్‌జెండర్)లకు హక్కులు కల్పిస్తూ, సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.           
»   ఇప్పటివరకూ అధికారికంగా లింగ వర్గీకరణ విషయంలో స్త్రీలు, పురుషులు అనే కేటగిరీలు మాత్రమే ఉండగా, హిజ్రాలకు మూడో కేటగిరీ కింద చట్టబద్ధమైన గుర్తింపును సుప్రీంకోర్టు మంజూరు చేసింది.           
»    హిజ్రాలను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాలుగా గుర్తించి, విద్యాసంస్థల్లో, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తింపజేయాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి వీలు కల్పిస్తూ, వారు ఎదుర్కొంటున్న భయం, సిగ్గు, సామాజిక ఒత్తిడి, కుంగుబాటు, అపవాదు వంటి సమస్యలను తొలగించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.           
»   కొతీ, అరవాణీ, జోగప్ప, శివ-శక్తి, కొజ్జా తదితర పేర్లతో కూడా వ్యవహరించే హిజ్రాలు ఎదుర్కొంటున్న వివక్ష అనూహ్యమని, వారు కూడా ఈ దేశ పౌరులేనని, స్త్రీ-పురుషులకు ఉన్నట్లే రాజ్యాంగం ప్రకారం వారికీ అన్ని హక్కులూ ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సి ఉందని న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.కె.సిక్రీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.           
»   రాజ్యాంగంలోని మూడో భాగం కింద, పార్లమెంట్, శాసనసభలు చేసిన చట్టాల కింద లింగ నిర్ధారణలో స్త్రీ, పురుష వ్యత్యాసంతో (బైనరీ జెండర్) పాటు హిజ్రాలను లింగ నిర్ధారణలో మూడో కేటగిరీ వ్యక్తుల కింద సుప్రీంకోర్టు ప్రకటించింది.           
»   నేపాల్, పాకిస్థాన్ సహా పలు దేశాలు హిజ్రాల హక్కులను గుర్తించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. హిజ్రాలను పంజాబ్ ప్రభుత్వం పురుషులుగా గుర్తించడం చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది.           
»   తమ తీర్పు కేవలం హిజ్రాలకు మాత్రమే పరిమితమని, స్వలింగ సంపర్కులు (గే, లెస్బియన్), ద్విలింగ సంపర్కులు (బై సెక్సువల్) వంటి వారికి వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వారిని కూడా సాధారణంగా ట్రాన్స్‌జెండర్ అని పిలుస్తుండటంతో సుప్రీంకోర్టు ఈ వివరణ ఇచ్చింది.           
»   ట్రాన్స్ జెండర్ వ్యక్తులను లింగ నిర్ధారణలో మూడో కేటగిరీగా గుర్తించాలంటూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

No comments:

Post a Comment