Monday, July 21, 2014

రైల్వే బడ్జెట్‌ 2014-15

జులై - 8, 2014
¤  రైల్వే మంత్రి సదానందగౌడ తన తొలి రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. రికార్డు స్థాయిలో రూ.1,64,374.30 కోట్లతో రూపొందించిన రైల్వే బడ్జెట్‌లో ఊహించినట్లే ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి, రైల్వేల ఆధునికీకరణకు ప్రాధాన్యమిచ్చారు. కానీ ప్రజాకర్షక ప్రకటనలేవీ చేయలేదు.   »    పట్టాలు తప్పిపోతున్న రైలు బండిని గాడిన పెట్టాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. తరిగిపోతున్న రాబడితో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేమని గుర్తించింది. ఛార్జీలు పెంచుకుంటూ పోవడమే పరిష్కారం కాదని, అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడులకు సంస్కరణలే మార్గమని తీర్మానించింది. రైల్వే నుంచి అద్భుత ప్రమాణాలు ఆశించాలంటే భారీ ఎత్తున నిధులు అవసరమని, అందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం తప్పదని రైల్వే మంత్రి తేల్చిచెప్పారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సిందేనని స్పష్టం చేశారు.   »    రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్ ప్రసంగంలో రైల్వే శాఖ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కొన్ని కఠోర వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయన ఆవిష్కరించిన భారతీయ రైల్వే ముఖచిత్రం, చేపట్టదల్చుకున్న చర్యల వివరాలు ఇలా ఉన్నాయి.మొత్తం రైళ్లు: 12,617ప్రయాణికుల సంఖ్య రోజుకు: 2,30,00,000 (ఆస్ట్రేలియా మొత్తం జనాభాతో సమానం)సరకు రవాణా రైళ్ల సంఖ్య: 7,421ప్రతిరోజూ తరలించే సరకు: 30 లక్షల టన్నులుమొత్తం రైల్వే ట్రాక్ పొడవు: 1.16 లక్షల కి.మీ.మొత్తం పెట్టెలు: 63,870మొత్తం వ్యాగన్లు: 2.4 లక్షలకు పైగాఉద్యోగులు: 13.1 లక్షల మందిమొత్తం క్రాసింగులు: 30,348. (వీటిలో కాపలా లేని క్రాసింగులు 11,563)
అభివృద్ధికి రాబడి లేదు:                సామాజిక బాధ్యత కింద చేపట్టాల్సిన సేవల విలువ ఏటా పెరిగిపోతోంది. 2012-13లో ఇలాంటి సేవల విలువ రూ.20,000 కోట్లు. అదే ఏడాది ప్రణాళికా వ్యయం కింద మొత్తం పెట్టుబడి రూ.35,241 కోట్లు. ప్రణాళికా వ్యయంలో సగానికి పైగా సామాజిక బాధ్యత కింద చేపట్టాల్సిన సేవలకే పోతుండటంతో అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఏమాత్రం సరిపోవడం లేదు.నామమాత్రం మిగులుతో అద్భుతాలు సాధించడం కష్టం:               2013-14లో స్థూల ట్రాఫిక్ రాబడి రూ.1,39,558 కోట్లు కాగా నిర్వహణ ఖర్చులు రూ.1,30,321 కోట్లు. అంటే ఒక రూపాయి రాబడిలో 94 పైసలు ఖర్చులకే పోతోంది. మిగిలింది 6 పైసలే. ఈ నామమాత్రపు మిగులుకు తోడు ఏళ్ల తరబడి ఛార్జీల సవరణ లేకపోవడంతో మిగులు ఏటా తరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగులు రూ.602 కోట్లు అని అంచనా వేశారు. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకే ఏడాదికి రూ.50 వేల కోట్ల చొప్పున పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరం. ఇక భద్రతా చర్యలు, సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం లాంటివి వీటికి అదనం. ట్రాక్‌ల పునరుద్ధరణ, కాపలాలేని క్రాసింగుల ఎత్తివేత, వంతెనల నిర్మాణానికే రూ.40 వేల కోట్లు అవసరం. అవసరమైన నిధులకు, మిగులుకు భారీ అంతరం ఉంది.ఛార్జీల్లో హేతుబద్ధత లోపం:                వ్యయం, మిగులు మధ్య అంతరాన్ని పూడ్చడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఛార్జీల విధానంలో హేతుబద్ధత లోపించింది. ఖర్చుల కంటే ప్రయాణికుల ఛార్జీలు తక్కువగా ఉన్నాయి. ఈ నష్టం 2000-01లో ఒక్కో ప్రయాణికుడిపై కిలోమీటరుకు పది పైసలు ఉండగా 2012-13లో 23 పైసలకు చేరింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి సరకు రవాణా ఛార్జీలను ఎప్పటికప్పుడు భారీగా పెంచుతున్నారు. దీంతో సరకు రవాణా ఖాతాదారులు ఇతరత్రా మార్గాలు చూసుకుంటున్నారు. ఈ విధంగా రాబడి పడిపోతోంది. సరకు రవాణాలో రైల్వే వాటా 31 శాతం మాత్రమే.ప్రాజెక్టులు పూర్తి చేయడంపై దృష్టి లేదు:               ప్రాజెక్టుల మంజూరుపై దృష్టి పెడుతున్నారే కానీ వాటిని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గత 30 ఏళ్లలో 676 ప్రాజెక్టులు మంజూరు చేశారు. వీటిలో 317 మాత్రమే పూర్తయ్యాయి. 359 పూర్తి కావాల్సి ఉంది. అందుకు రూ.1,82,000 కోట్లు కావాలి. గత పదేళ్లలో 99 కొత్త ప్రాజెక్టులు మంజూరు కాగా పూర్తయింది ఒకే ఒకటి. 30 ఏళ్ల నాటి నాలుగు ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే రూ.వేల కోట్లు ఖర్చు చేయడమే తప్పించి ఫలితం ఏ మాత్రం ఉండదు.
వనరుల సమీకరణ ఇలా1. రైల్వే పీఎస్‌యూల ఆర్థిక వనరులను పరిపుష్టం చేయడం:రైల్వేల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మిగులు సాధించే విధంగా రైల్వేకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ)కు ప్రత్యేక పథకం. ఈ పథకం వల్ల ఆ సంస్థలకు ఆకర్షణీయమైన లాభాలు వస్తాయి.2. రైల్వే మౌలిక సదుపాయాల్లో దేశీయ ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు:రైల్వే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు నిధులు అందుబాటులో ఉంటేనే రైల్వే రంగం అభివృద్ధి సాధ్యం. అంతర్గత ఆదాయ వనరులు, ప్రభుత్వ నిధులు ఈ అవసరాలను తీర్చలేవు. రైల్వే రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తేనే అవసరాలు తీరుతాయి. ఇందుకోసం మంత్రివర్గ ఆమోదం కోరాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.3. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం: భారీ ఎత్తున నిధులు అవసరమయ్యే రైల్వే రంగంలో పీపీపీ మార్గం ద్వారా నిధుల సమీకరణ పెద్దగా జరగలేదు. హైస్పీడ్ రైలు సహా భవిష్యత్తులో ఎక్కువ ప్రాజెక్టులకు పీపీపీ ద్వారా నిధులు సమీకరించాలన్నది లక్ష్యం.4. నిధుల సమీకరణతోపాటు రైల్వే ప్రణాళిక, పరిపాలనలో కొన్ని వ్యూహాత్మక చర్యలు: ఎ) ప్రణాళిక విరామ వైఖరి బి) ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యాలు, గడువులు నిర్దేశించడం సి) రైల్వే మౌలిక సదుపాయాలకు నిధుల సమీకరణ నిమిత్తం యంత్రాంగాన్ని రూపొందించడం డి) ప్రాజెక్టు అమలుకు మద్దతుగా నిర్ణయ వ్యవస్థ ఇ) వనరుల సమీకరణలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పారదర్శకత ఎఫ్) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాల అనుసరణ. ప్రమాదాలకు కారణాలను అధ్యయనం చేయడానికి సిమ్యులేషన్ కేంద్రం ఏర్పాటు జి) లోకోమోటివ్‌లు, పెట్టెలు, వ్యాగన్ లీజింగ్ మార్కెట్ అభివృద్ధికి ప్రోత్సాహం.
రైల్వే బడ్జెట్ 2014 ముఖ్యాంశాలురైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో 58 కొత్త రైళ్లను ప్రకటించారు. వీటిలో అయిదు జన సాధారణ్ రైళ్లతో పాటు మరో అయిదు ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, రెండు మెయిల్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (మెము) సర్వీసులు, 5 డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెము) సర్వీసులు ఉన్నాయి. మరో 11 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించారు. అలాగే కేదార్‌నాధ్, బద్రీనాధ్ లాంటి చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైలు మార్గం నిర్మాణాన్ని ప్రతిపాదించడంతో పాటు మొత్తం 18 నూతన రైలు మార్గాలను మంత్రి ప్రకటించారు.కొత్త రైళ్లలో ముఖ్యమైనవి అహ్మదాబాద్ - దర్భంగా జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్ ముంబయి - గోరఖ్‌పూర్ జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్ ముంబయి సెంట్రల్ - న్యూఢిల్లీ ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు - మంగుళూరు ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ - వారణాసి ఎక్స్‌ప్రెస్ ఇండోర్ - జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ (వీక్లీ) నాగ్‌పూర్ - అమృత్‌సర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)¤  దేశవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధిలో రైలును ఓ ముఖ్య సాధనంగా మార్చాలని రైల్వే శాఖ సంకల్పించింది. వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల మీదుగా మంత్రి పలు రైళ్లను ప్రకటించారు. పుణ్యక్షేత్ర రైళ్లు నడిపేందుకు దేవీ సర్క్యూట్, జ్యోతిర్లింగ సర్క్యూట్, జైన్ సర్క్యూట్, క్రైస్తవ సర్క్యూట్, ముస్లిం/ సూఫీ సర్క్యూట్, సిక్ సర్య్కూట్, బౌద్ధ సర్క్యూట్, ప్రఖ్యాత ఆలయాల సర్క్యూట్ తదితర సర్క్యూట్‌లను గుర్తించినట్లు మంత్రి ప్రకటించారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ గడగ్ నుంచి బాగల్‌కోట్, బీజాపూర్, సోలాపూర్ మీదుగా పండరీపురం వరకు పర్యాటక రైలు నడుపుతామని మంత్రి ప్రకటించారు. బెంగళూరు, చెన్నై, అయోధ్య, వారణాసి, హరిద్వార్ లాంటి ప్రాంతాల మీదుగా రామేశ్వరం నుంచి మరో పర్యటక రైలును మంత్రి ప్రకటించారు. స్వామి వివేకానంద జీవిత విశేషాలతో ఒక రైలును ప్రకటించారు. ఆయన బోధనల వ్యాప్తి కోసం దీన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి ప్రకటించారు.¤  రైళ్లలో పాల ట్యాంకర్లు, పండ్లు, కూరగాయల రవాణాకు ప్రత్యేక శీతలీకరణ సదుపాయాలను బడ్జెట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల నిల్వ, రవాణాకు సిద్ధమైనట్లు మంత్రి ప్రకటించారు.¤  ఈ-టికెటింగ్ విధానం ద్వారా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో నిమిషానికి 2000 టికెట్లను జారీ చేస్తున్నారు. దీన్ని నిమిషానికి 7,200 టికెట్లు ఇవ్వగలిగేలా, లక్షా ఇరవై వేల మంది వినియోగదారులు ఒకేసారి ఈ విధానాన్ని వినియోగించుకునేలా మెరుగుపరుస్తారు. మొబైల్ ఫోన్లు, పోస్టాఫీసుల ద్వారా కూడా రైలు టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తారు. రిజర్వేషన్ లేని జనరల్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లను కూడా త్వరలో ఆన్‌లైన్ ద్వారా పొందే విధానాన్ని ప్రవేశపెడతారు. ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఇటు వాహనాల పార్కింగ్‌కు, అటు ప్లాట్‌ఫాం టికెట్‌గానూ ఉపయోగపడేలా ఒక ఉమ్మడి టికెట్‌ను ప్రవేశపెడతారు. వీటికోసం టికెట్ జారీ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల ఇంటర్నెట్ సేవల కోసం ఎ-1, ఎ గ్రేడ్ రైల్వే స్టేషన్లు, కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తారు. రైలు గమ్యస్థానం చేరబోతోందన్న విషయాన్ని ప్రయాణికులకు సెల్‌ఫోన్లలో మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో ఐటీ విధానాన్ని గరిష్ఠ స్థాయిలో వినియోగించాలని నిర్ణయించారు.¤  రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఆహారాన్ని మెరుగుపరచాలని నిర్ణయించారు. ప్రస్తుతం దూరప్రాంత రైళ్లు, స్టేషన్లలో రైల్వే క్యాటరింగ్ సంస్థ అందజేస్తున్నట్లు ఒకేరకమైనవి కాకుండా రకరకాల పసందైన వంటకాలతోపాటు నాణ్యతకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇక రైల్వే సిబ్బంది తయారుచేసేవి కాకుండా బ్రాండెడ్ ఆహారం అందుబాటులోకి రానుంది. అప్పటికప్పుడు వండి వడ్డించేవి కాకుండా ముందుగానే తయారుచేసి పొట్లాల్లో వీటిని సిద్ధం చేస్తారు. ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్ని ప్రాంతాలకు చెందిన రకరకాల ఆహారం లభిస్తుంది. ఈ-మెయిల్స్, ఎస్ఎమ్ఎస్ ద్వారా మనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ విధానాన్ని తొలిదశలో ఢిల్లీ - అమృతసర్, ఢిల్లీ - జమ్ముతావి సెక్షన్లలో అమలు చేస్తారు.¤  రైల్వే టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ పరిధిని విస్తృతం చేశారు. ఇంతవరకు సీట్లు, బెర్తులను మాత్రమే ముందస్తుగా బుక్ చేసుకునే వీలుండగా ఇప్పుడు మొత్తం బోగీని, ఏకంగా రైలునే బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. రైల్వే విశ్రాంతి గదులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏడాదిలో అన్ని స్టేషన్లకూ వర్తింపజేయాలని నిర్ణయించారు.¤  రైల్వే ఉద్యోగుల సంక్షేమం కోసం పలు చర్యలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. సిబ్బంది సంక్షేమ నిధికి ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కేటాయిస్తున్న మొత్తాన్ని రూ.800కు పెంచనున్నట్లు ప్రకటించారు. విద్య, క్రీడల రంగాల్లో ప్రతిభను చాటే ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేక పథకాన్ని మంత్రి ప్రతిపాదించారు.¤  ప్రస్తుతమున్న ప్రయాణ సమయాన్ని దాదాపుగా సగానికి తగ్గించే అత్యంత ఆధునికమైన బుల్లెట్ రైలును ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మొదట అహ్మదాబాద్ - ముంబయి మధ్య బుల్లెట్ రైలును నడిపేందుకు నిర్ణయించామని, భవిష్యత్తులో అన్ని ముఖ్య నగరాలకు విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా వజ్ర చతుర్భుజి పేరుతో మెట్రో నగరాల మధ్య అత్యంత వేగవంతమైన రైళ్లను నడిపేందుకు ప్రస్తుతమున్న వ్యవస్థలను ఆధునికీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఫలితంగా గంటకు 200 కి.మీ. వేగంతో రైళ్లను నడిపించగలరు. ఈ ప్రాజెక్టుపై నివేదిక కోసం రూ.100 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్, హై స్పీడ్ రైల్ కారిడార్ చర్యలు చేపడతాయని మంత్రి ప్రకటించారు, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రూ.60 వేల కోట్లు, వజ్ర చతుర్భుజి ప్రాజెక్టుకు రూ.9 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.¤  మొదటి బుల్లెట్ రైలును అహ్మదాబాద్, ముంబయి నగరాల మధ్య గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు 491 కి.మీ. ప్రస్తుతం అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ గరిష్ఠ వేగం 160 కి.మీ. వజ్ర చతుర్భుజిలో భాగంగా గంటకు 160 నుంచి 200 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను ఢిల్లీ - ఆగ్రా, ఢిల్లీ - చండీగఢ్, అహ్మదాబాద్ - ముంబయి, ఢిల్లీ - కాన్పూర్, నాగ్‌పూర్ - బిలాస్‌పూర్, మైసూర్ - బెంగళూరు - చెన్నై, ముంబయి - గోవా, చెన్నై - హైదరాబాద్, నాగ్‌పూర్ - సికింద్రాబాద్ మధ్య నడపాలని బడ్జెట్‌లో నిర్ణయించారు.¤  పెట్రో ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా రైలు ఛార్జీల సవరణకు వీలు కల్పిస్తున్న గత యూపీఏ ప్రభుత్వ విధానాన్ని తమ ప్రభుత్వమూ కొనసాగించనుందని మంత్రి ప్రకటించారు. దీని ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఛార్జీలు పెరుగుతాయి.¤  వికలాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీతో నడిచే కార్లను ప్లాట్‌ఫామ్‌లపై ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని పీపీపీ విధానంలో అందుబాటులోకి తెస్తారు. ఇవి ప్రధాన స్టేషన్లలో ఉంటాయి.¤  రైళ్లలో మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రైల్వే రక్షణ దళంలో 17,000 మంది కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు. 4000 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. మహిళలకు ప్రత్యేకించిన బోగీల్లో వీరిని వినియోగిస్తారు.

¤  రైల్వేలకు సంబంధించిన అంశాల అధ్యయనం లక్ష్యంగా రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సాంకేతికేతర అంశాల అధ్యయనం కోసం ఈ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది.¤  రైళ్ల భద్రతను పెంచడానికి, పట్టాల్లో ఏర్పడే లోపాలను, పగుళ్లను సమర్థంగా గుర్తించడానికి అత్యాధునిక అల్ట్రాసోనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు.¤  బొగ్గు రవాణా కోసం మూడు కీలకమైన రైలు మార్గాల నిర్మాణాన్ని శీఘ్రగతిన పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తోరి - శివపూర్ - కతౌటియా ఏరియా (జార్ఖండ్), జార్సిగుడ - బార్‌పల్లి - సర్‌డేగా ఏరియా (ఒడిశా), భూప్‌దేవ్‌పూర్ - రాయ్‌గఢ్ - మండ్ ఏరియా (చత్తీస్‌గఢ్) మధ్య ఈ మార్గాల పనులు సుమారు రూ.7500 కోట్ల ఖర్చుతో జరుగుతున్నాయని మంత్రి ప్రకటించారు.¤  ప్రధాన రైళ్లు, సబర్బన్ బోగీలకు తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.¤  విమానాశ్రయాన్ని తలపించేలా, అలాంటి అనుభూతిని కలిగించేలా అంతర్జాతీయ స్థాయికి టాప్ 10 స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ.¤  స్టేషన్ల నిర్వహణకు మూలనిధి ఏర్పాటు; స్టేషన్లు, రైళ్లలో ఆర్వో తాగునీరు, ప్రధాన స్టేషన్లకు సౌర విద్యుత్ సౌకర్యం.¤  శుభ్రత కోసం ఉద్దేశించిన బడ్జెట్ 40% పెంచారు. స్టేషన్లలో శుభ్రతను పర్యవేక్షించేందుకు సీసీటీవీల వినియోగం, థర్డ్ పార్టీ తనిఖీలను సైతం ప్రవేశపెడతారు. 50 పెద్ద స్టేషన్లలో పారిశుద్ధ్యాన్ని అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని నిర్ణయించారు.¤  రైల్వే రిక్వెస్టు స్టాపులు సెప్టెంబరు 30 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని, ఆ తర్వాత వాటిని సమీక్షిస్తామని మంత్రి ప్రకటించారు. ఆపరేషన్ ఫిజిబులిటీ, కమర్షియల్ జస్టిఫికేషన్ ఆధారంగా వాటిని సమీక్షిస్తామని, భవిష్యత్తు డిమాండ్లను కూడా వాటి ఆధారంగానే పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.¤  దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి జబ్బు రైల్వే శాఖనూ వదల్లేదు. గత ఏడాది సుమారు 5,300 మంది రైల్వే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రైల్వే బడ్జెట్ విశేషాలు               రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. రెండు హై స్పీడ్ రైళ్లతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుతో మరో రైలును కేటాయించింది. కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి కేవలం రూ.1159 కోట్లను కేటాయించింది. రెండు రాష్ట్రాల్లో పెండింగు ప్రాజెక్టుల ప్రాథమ్యాలను నిర్ధారించడానికి ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది. వజ్ర చతుర్భుజి పథకంలో రాష్ట్రానికి ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా రెండు రైళ్లకు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం మాత్రం కల్పించింది. వీటిలో ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్ (చెన్నై - హైదరాబాద్, నాగ్‌పూర్ - సికింద్రాబాద్)కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి న్యూఢిల్లీకి రోజూ నడిచేలా ఏసీ రైలును ప్రకటించారు. వాస్తవానికి ప్రస్తుతం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరుతో రైలు నడుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడ నుంచి న్యూఢిల్లీకి నడపాలని నిర్ణయించిన రైలుకూ ఏపీ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలును 'టీజీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

No comments:

Post a Comment