Monday, July 21, 2014

ఆర్థిక సర్వే (2013 - 14)

జులై - 9,2014
¤  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వే (2013 - 14)ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆర్థికరంగం వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ బడ్జెట్ ప్రతిపాదనకు ముందురోజు ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది.
2013 - 14 ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు:
  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5.4 - 5.9 శాతం మాత్రమే ఉండొచ్చు. అయితే
2015 - 16 నాటికి ఇది 7 - 8 శాతానికి పెరిగే అవకాశముంది.

  ఈ సీజన్లో సకాలంలో రుతుపవనాలు రాకపోవడం, విదేశాల్లోని ఆర్థిక స్థితిగతులు వృద్ధి రేటుపై ప్రభావం చూపుతాయి.
  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014 - 15)లో కరెంటు ఖాతా లోటును (సీఏడీ) 2.1 శాతానికి పరిమితం చేయాలి.
 పన్ను సంస్కరణలు తక్షణావసరం. జీఎస్‌టీని అమలు చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టాల స్థానంలో డీటీసీ (ప్రత్యక్ష పన్నుల స్మృతి) తీసుకురావాలి.
 ఎగుమతులు ఇంకా ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇరాక్ స్థితిగతులు ఇబ్బందికరం.
 పారిశ్రామికోత్పత్తి మరో రెండేళ్లకు గానీ కోలుకునే అవకాశం లేదు.
 మౌలిక సదుపాయాలు, ఇనుము - ఉక్కు, దుస్తులు, పౌర విమానయానం, గనుల రంగాల్లో ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. బ్యాంకులకు మొండి బాకీలు పెరిగిపోయాయి. బ్యాంకు రుణాల నాణ్యత క్షీణించింది.
 మూలధన వ్యయాన్ని తగ్గించుకోవడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు.
 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఏపీఎంసీ చట్టాలు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవరోధాలుగా మారాయి. ఇది మార్కెట్‌ను గుప్పిట్లో పెట్టుకునే శక్తులు తయారయ్యేందుకు దోహదపడుతుంది.
 కరెంటు ఖాతా లోటు ఆశాజనకంగా ఉంది. 2012 - 13లో ఇది జీడీపీలో 4.7% కాగా,
2013 - 14 నాటికి బాగా తగ్గి ఒక శాతానికి చేరుకుంది. మనదేశం వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు 2013 మార్చి నాటికి 292 బిలియన్ డాలర్లు ఉండగా, 2014 మార్చి నాటికి 304.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

 2013 - 14లో బంగారం, వెండి దిగుమతులు 40% తగ్గి 33.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
 వచ్చే అయిదేళ్లలో 88,537 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉంది.
 మనదేశం ఉత్పత్తి రంగంలో వెనుకంజలో ఉన్నప్పటికీ సేవల రంగంలో సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్త సేవల విపణిలో 1990లో మనదేశం వాటా 0.6% కాగా 2013 నాటికి ఇది 3.3 శాతానికి పెరిగింది.
 పేదరికం నిష్పత్తి 2004 - 05లో 37.2 శాతం ఉండగా 2011 - 12 నాటికి 21.9 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 5.98 శాతం ఉండగా, సీపీఐ ద్రవ్యోల్బణం 9.49 శాతంగా ఉంటాయి. ఇవి నెమ్మదిగా తగ్గొచ్చు. రూపాయి మారక విలువ హెచ్చుతగ్గులు, అధిక ముడి చమురు ధర ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశముంది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం 16 జాతీయ పెట్టుబడుల, తయారీ జోన్ల (ఎన్ఐఎమ్‌జెడ్)ను ప్రకటించింది. జాతీయ తయారీ విధానం కింద ఈ ఎన్ఐఎమ్‌జెడ్‌ల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా దశాబ్ద కాలంలో జీడీపీలో తయారీ వాటాను 25 శాతానికి చేర్చడంతో పాటు 10 కోట్ల మందికి ఉద్యోగాలను సృష్టించాలన్నది లక్ష్యంగా ఉంది. 16 ఎన్ఐఎమ్‌జెడ్‌లలో ఎనిమిది ఢిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్‌లో రానుండగా, మరో ఎనిమిది నాగపూర్, చిత్తూరు, మెదక్, తుముకూరు, కోలార్, బీదర్, గుల్బర్గాల్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. ఎన్ఐఎమ్‌జెడ్‌లు అనేవి కనీసం 50 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉండే ఏకీకృత పారిశ్రామిక టౌన్‌షిప్‌లు.
 దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు సబ్సిడీలను నేరుగా నగదు రూపంలో వారి ఖాతాల్లో జమ చేయాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇందుకోసం బయోమెట్రిక్ గుర్తింపు తదితర సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలని పేర్కొంది. ప్రస్తుత విధానంలో కొన్ని ఇబ్బందులు, అవకతవకలు ఉన్నాయని అభిప్రాయపడింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ లెక్కల ప్రకారం 2013-14లో ప్రధాన సబ్సిడీల మొత్తం విలువ రూ.2,47,596 కోట్లుగా నమోదైంది.
 సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ), ఐటీ ఆధారిత సేవల్లో (ఐటీఈఎస్) భారత్ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. అయితే వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు, వేతన ద్రవ్యోల్బణం, మారకపు రేట్ల ఒడుదొడుకుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకోవాల్సి ఉంది. ఇంజినీరింగ్ సేవలు, ఆర్ అండ్ డీని మినహాయిస్తే 2013లో గ్లోబల్ అవుట్ సోర్సింగ్ మార్కెట్‌లో భారత్ వాటా 55 శాతానికి పెరిగింది. 2012లో ఇది 52 శాతం. 2013-14లో ఐటీ-బీపీఓ రంగంలో 1.66 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు లభించాయి.
 దేశంలో రిటైల్, టోకు వ్యాపారాల వృద్ధికి బహుళ నియంత్రణలు, రకరకాల నిబంధనలే అడ్డంకిగా ఉన్నాయి. ఈ కారణంగానే గ్లోబల్ రిటైల్ డెవలప్‌మెంట్ సూచీలో 2012లో అయిదో స్థానంలో ఉన్న భారత్ గతేడాది 14వ స్థానానికి పడిపోయింది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం పరిమాణం 2012-13లో 4.8 శాతం పెరిగి రూ.14.79 లక్షల కోట్లకు చేరింది. జీడీపీలో ఇది 15.8 శాతం ఉంది.

 భారత మౌలిక సదుపాయాల రంగం పరుగులు తీయడానికి విధానపరమైన అడ్డంకులను తొలగించడంతో పాటు విధానాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడం తక్షణ అవసరం. 239 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 110 ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ రూ.1000 కోట్లు, అంతకుమించి వ్యయం అయ్యేవే. ప్రారంభంలో 239 ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.7,39,882 కోట్లు ఉండగా పూర్తయ్యే నాటికి రూ.8,97,684 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే జాప్యం కారణంగా వాస్తవ వ్యయం కంటే 21.3 శాతం అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2014, మార్చి చివరినాటికి రూ.6,94,040 కోట్ల విలువైన 1300 ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు.

 గత ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగంలో విదేశీ పెట్టుబడులు నాలుగు రెట్లకు పైగా పెరిగి 130 కోట్ల డాలర్లకు చేరాయి. అంతక్రితం ఏడాది ఈ రంగంలోకి 30.4 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2014 మార్చి చివరి నాటికి మొత్తం టెలిఫోన్ కనెక్షన్లు 93.30 కోట్లకు పెరిగాయి. ఏడాది క్రితం 89.80 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి.
 దేశీయ విమానయాన రంగం కష్టకాలం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంకేతాలు అందుతున్నాయి. 2013-14లో విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ కేవలం 5.2 శాతమే పెరిగినప్పటికీ పరిశ్రమ పరిస్థితులు మెరుగయ్యాయి. 2012-13లో భారత విమానాశ్రయాలు 11.63 కోట్ల దేశీయ ప్రయాణికులను హ్యాండిల్ చేయగా 2013-14 నాటికి ఈ సంఖ్య 12.24 కోట్లకు పెరిగింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ 8.34 శాతం వృద్ధితో 4.30 కోట్ల నుంచి 4.66 కోట్లకు పెరిగింది.
 గత రెండు సంవత్సరాల్లో వసూలు కాని రుణాల భారం ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిల భారం నాలుగింతలు పెరిగిపోయింది. 2008-09లో 2.09 శాతం (రూ.59,972 కోట్లు)గా నమోదైన బ్యాంకింగ్ రంగ స్థూల నిరర్థక రుణాలు (గ్రాస్ ఎన్‌పీఏ) 2014 మార్చి నాటికి 4.4 శాతానికి (రూ.2,04,249 కోట్లు) చేరాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులను కూడా కలుపుకుంటే మొత్తం మీద ఎన్‌పీఏలు 2.36 శాతం నుంచి 3.90 శాతానికి పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రస్తుత బలహీనతలను అధిగమించేలా చూడటానికి ఫైనాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్ (ఎఫ్ఎస్ఎల్ఆర్‌సీ) ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ ముసాయిదాను తెస్తోంది. ఇది రానున్న 30 ఏళ్లపాటు భారత ఆర్థిక వ్యవస్థ అవసరాలను నెరవేర్చే విధంగా ఉంటుంది.
 బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి ధరలకు స్వేచ్ఛ కల్పించాలి. బొగ్గు తవ్వకాల్లో ప్రైవేటు రంగాన్ని అనుమతించాలి. కోల్ ఇండియాను పునర్వ్యవస్థీకరించాలి.
అప్పుడే బొగ్గు దిగుమతుల బిల్లు తగ్గుతుంది. 2012-13లో రూ.92,538 కోట్ల విలువైన 146 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకుంటే 2013-14కు రూ.95,175 కోట్ల విలువైన 169 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకున్నారు.

 మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) ర్యాంకింగ్‌లో భారత్ స్థానం దిగజారింది. ఆర్థిక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) రూపొందించిన హెచ్‌డీఐ వివరాలను ఆర్థిక సర్వేలో పొందుపరిచారు.

 హెచ్‌డీఐను మూడు ప్రాథమిక పరామితుల ఆధారంగా నిర్ణయిస్తారు. 1) దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవితం గడపడం 2) విద్యావంతులై, జ్ఞానవంతులై ఉండటం 3) గౌరవప్రదమైన ఆర్థిక ప్రమాణాలతో జీవించడం. ఈ ప్రమాణాల ఆధారంగా 2012లో హెచ్‌డీఐలో భారత్ ర్యాంకు 136. 2011లో 134వ స్థానంలో ఉంది. అంటే రెండు స్థానాలు దిగజారింది. ఆరోగ్య, విద్యారంగాల సూచీలను పరిశీలిస్తే పలు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్ చాలా వెనకబడి ఉంది. మానవాభివృద్ధి సూచీలో ఈ రెండు రంగాలూ ఎంతో కీలకం. ఈ రెండు రంగాలనూ ఇంకా విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్‌డీఐ విశ్లేషణను బట్టి అర్థమవుతోంది.

No comments:

Post a Comment