Saturday, August 2, 2014

బ్రిక్స్ (BRICS - బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి 6వ సదస్సు 2014 (BRICS SUMMIT 2014)

జులై - 15,16, 2014

బ్రిక్స్ (BRICS - బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి 6వ సదస్సు బ్రెజిల్‌లోని ఫోర్టాలెజాలో ప్రారంభమైంది.   
»    బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఈ సదస్సులో పాల్గొన్నారు.   
»    ఈ సదస్సులో కొత్త అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనపై అంగీకారం కుదిరింది.  
 »    100 బిలియన్ డాలర్ల ప్రారంభ అధీకృత పెట్టుబడితో ఈ బ్యాంకును ఏర్పాటు చేయాలని సదస్సు నిర్ణయించింది. ఇందులో ఏ ఒక్క దేశం ఆధిపత్యం లేకుండా అందరికీ సమాన వాటా ఉండాలన్న భారత్ చేస్తున్న వాదనకు సభ్య దేశాల నుంచి మద్దతు లభించింది. కంటింజెన్సీ రిజర్వు ఏర్పాటుపైనా ఒప్పందం కుదిరింది. భారత ప్రధానమంత్రి మోడీకి తొలి అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులోనే ఈ విజయం దక్కడం విశేషం.   
 »    బ్యాంకులోని సభ్య దేశాల ప్రారంభ వాటా పెట్టుబడిని 50 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని సభ్య దేశాలు సమానంగా సమకూరుస్తాయి.   
»    బ్యాంకు ప్రధాన కార్యాలయం కోసం భారత్ కూడా పోటీ పడినప్పటికీ, అది చైనాలోని షాంఘైకు దక్కింది. అయితే వంతుల వారీగా చేపట్టే బ్యాంకు అధ్యక్ష పదవి మాత్రం తొలుత భారత్‌కు దక్కింది. బోర్డ్ ఆఫ్ గవర్నర్ల తొలి అధ్యక్ష పదవి రష్యాకు దక్కింది.   
»    బ్రిక్స్ కూటమి సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తొలిసారిగా ఫోర్టాలెజాలో భేటీ అయ్యారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారం కావాలని మోడీ సూచించారు.   
»    నవంబరులో జరిగే కీలకమైన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార ఫోరం (అపెక్) శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ను చైనా ఆహ్వానించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి ఇది ఏర్పాటైంది. ఇందులో 21 దేశాలకు సభ్యత్వం ఉంది.   
»    షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లోనూ భారత్ కీలక పాత్ర పోషించాలని జిన్ పింగ్ కోరారు. ఈ సంస్థలో ప్రస్తుతం భారత్‌కు పరిశీలక హోదా ఉంది.

¤  బ్రెజిల్‌లోని ఫోర్టాలెజాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా 17 పేజీల ప్రకటనను విడుదల చేశారు.   
»    అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి స్థాయిలో ఒక సాధారణ తీర్మానం వెలువడేలా బ్రిక్స్ సభ్య దేశాలు కృషి చేస్తాయని పేర్కొన్నారు.   
»    భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసి వ్యక్తులపై, దేశాలపై నిఘావేయడాన్ని తీర్మానం తీవ్రంగా ఖండించింది.   
»    బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా ఏర్పాటు చేయనున్న 'న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు'కు తొలి ఆరేళ్లపాటు భారత్ నేతృత్వం వహించనుంది. ఆ తర్వాత బ్రెజిల్, రష్యా చెరో అయిదేళ్లపాటు బ్యాంకుకు సారథ్యం వహిస్తాయి.   
»    ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని చైనాలోని షాంఘైలో ఏర్పాటు చేయనున్నారు. రానున్న రెండేళ్లలో బ్యాంకు ఏర్పాటవుతుంది.   
»    బ్యాంకులో 10,000 కోట్ల అమెరికా డాలర్లతో ఏర్పాటు చేయనున్న అత్యవసర నిధికి చైనా 4,100 కోట్ల డాలర్లను; భారత్, రష్యా, బ్రెజిల్ చెరో 1800 కోట్ల డాలర్లను; దక్షిణాఫ్రికా 500 కోట్ల డాలర్లను ఇవ్వనున్నాయి.   
»    వచ్చే ఏడాది బ్రిక్స్ సదస్సును రష్యాలోని ఉఫా నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు.   
»    బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌తో సమావేశమయ్యారు.   
»    జీ-20 లాంటి సంస్థలు, అంతర్జాతీయ వేదికల్లో పరస్పరం సహకరించుకోవాలని నరేంద్రమోడీ, దిల్మా రౌసెఫ్ అంగీకరించారు. ఐరాస భద్రతా మండలిలో తక్షణం సంస్కరణలు చేపట్టాలని కోరారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్, బ్రెజిల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నేతలు ఈ పిలుపునిచ్చారు.   
»    భౌగోళిక సామీప్యం, సైద్ధాంతిక సారూప్యం లాంటి సహజ కూటమి లక్షణాలేవీ లేనప్పటికీ నాలుగు ఖండాలకు చెందిన అయిదు దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా 'బ్రిక్స్' పేరిట ఒక్కతాటిమీదికొచ్చాయి.   
»    గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ ఆర్థిక పరిశోధన విభాగ అధిపతి జిమ్ ఒ.నీల్ అభివృద్ధి పథంలో దూసుకొస్తున్న నాలుగు దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా)ను 2001లోనే 'బ్రిక్‌'గా ప్రాచుర్యంలోకి తెచ్చారు.   
»    ప్రపంచ ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అంతర్జాతీయ విత్త సంస్థలను సంస్కరించాలని 2008లో డిమాండ్ చేసిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా 2009లో 'బ్రిక్ కూటమిగా ఆవిర్భవించాయి. అప్పట్లో చైనా అధ్యక్షుడిగా హు జింటావో బ్రిక్ సదస్సు అజెండాగా సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు; ఇంధన - ఆహార - ఆరోగ్య భద్రత; ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సంస్కరణలను ప్రతిపాదించారు. తర్వాత కూటమిలో దక్షిణఫ్రికా చేరడంతో 'బ్రిక్స్‌'గా మారింది.   
»    ప్రపంచంలో మూడొందల కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 'బ్రిక్స్' దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి 24 లక్షల కోట్ల డాలర్లు.

No comments:

Post a Comment