Wednesday, August 27, 2014

క్రీడలు - ట్రోఫీలు, కప్‌లు

హాకీ
రంగస్వామి కప్‌: ఇది జాతీయ సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌. రంగస్వామి కప్‌ను కర్ణాటక మే, 2013లో తొలిసారి గెలుచుకుంది. బెంగళూర్‌లో జరిగిన ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది.

సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌: 1983లో ప్రారంభమైంది. ప్రతి ఏటా మలేషియాలో నిర్వహిస్తారు. మార్చిలో ఆస్ట్రేలియా.. మలేషియాను ఓడించి సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ను గెలుచుకుంది.

ఇతర ప్రముఖ హాకీ ట్రోఫీలు: ఆగాఖాన్‌ కప్‌, బైటన్‌ కప్‌, ఇందిరా గోల్డ్‌ కప్‌, మోడీ గోల్డ్‌ కప్‌, రంజిత్‌సింగ్‌ గోల్డ్‌ కప్‌, బాంబే గోల్డ్‌ కప్‌, ధ్యాన్‌చంద్‌ ట్రోఫీ, లేడీ రతన్‌ టాటా ట్రోఫీ, గురునానక్‌, మురుగప్ప గోల్డ్‌, ఒబైదుల్లా, ప్రపంచ కప్‌, ఆసియా కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ.

బ్యాడ్మింటన్‌: థామస్‌ కప్‌, ఉబెర్‌ కప్‌, సుదీర్మన్‌ కప్‌, నారంగ్‌ కప్‌, మేయర్స్‌ కప్‌, ఆల్‌ ఇంగ్లండ్‌, ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (ఐబీఎల్‌), రెహమతుల్లా కప్‌, మలేషియన్‌ ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌, ఇండోనేషియా ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ మొదలైనవి.

బిలియర్డ్స్‌: ఆర్థర్‌ వాకర్‌ ట్రోఫీ, గోల్డ్‌ ఫ్లేక్‌ ట్రోఫీ

గోల్ఫ్‌: కెనడా కప్‌, రైడర్‌ కప్‌, వాకర్‌ కప్‌, ఐసన్‌హోవర్‌ కప్‌, ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ కప్‌, అగస్టా మాస్టర్స్‌, బ్రిటిష్‌ ఓపెన్‌, యూఎస్‌ ఓపెన్‌.

టేబుల్‌ టెన్నిస్‌: స్వేథ్‌లింగ్‌ కప్‌, బెర్నాబెల్లాక్‌ కప్‌, కార్బిల్లియన్‌ కప్‌, జయలక్ష్మి కప్‌.

టెన్నిస్‌
డేవిస్‌ కప్‌: 1900వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది పురుషుల అంతర్జాతీయ టీమ్‌ టైటిల్‌. యూఎస్‌ఏ అత్యధికంగా 32సార్లు డేవిస్‌ కప్‌ను గెలుచుకుంది. 2012 విజేత చెక్‌ రిపబ్లిక్‌.


ఫెడ్‌ కప్‌: మహిళల టీమ్‌ పోటీ. 1963లో మొదలైంది. 2012లో చెక్‌ రిపబ్లిక్‌ ఫెడ్‌కప్‌ను సాధించింది.

హాప్‌మన్‌ కప్‌: దీన్ని ప్రతి ఏటా జనవరిలో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో నిర్వహిస్తారు. ఇది మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌. 1989లో ప్రారంభించారు. ఆస్ట్రేలియా టెన్నిస్‌ క్రీడాకారుడు హారీ హాప్‌మన్‌ జ్ఞాపకార్థం దీనిని ఏర్పాటు చేశారు. 2013 విజేత స్పెయిన్‌.

గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్లు: టెన్నిస్‌లో నాలుగు అత్యుత్తమ టోర్నమెంట్లను గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలని పిలుస్తారు. పురుషుల, మహిళల విభాగాల్లో సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలు ఉంటాయి. టెన్నిస్‌లో పై కప్‌లే కాకుండా బ్రస్సెల్స్‌ ఓపెన్‌, జెర్రీ వెబర్‌ ఓపెన్‌, ఇటాలియన్‌ ఓపెన్‌, దుబాయ్‌ ఓపెన్‌, మాడ్రిడ్‌ ఓపెన్‌, బార్సిలోనా ఓపెన్‌, పోర్చుగల్‌ ఓపెన్‌, చెన్నై ఓపెన్‌, మాంటెకార్లో మాస్టర్స్‌, మియామి మాస్టర్స్‌, ఫ్యామిలీ సర్కిల్‌ కప్‌, మెక్సికన్‌ ఓపెన్‌, ఖతార్‌ ఓపెన్‌, బ్రెజిల్‌ ఓపెన్‌, చిలీ ఓపెన్‌, అక్‌లాండ్‌ ఓపెన్‌ ఉన్నాయి.

ఫుట్‌బాల్‌
సంతోష్‌ ట్రోఫీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ సంతోష్‌ ట్రోఫీ. 1941లో ప్రారంభమైంది. మొదటి విజేత బెంగాల్‌. ఇప్పటివరకు బెంగాల్‌ జట్టు 31 సార్లు సంతోష్‌ ట్రోఫీని గెలుచుకుంది. 67వ సంతోష్‌ ట్రోఫీలో సర్వీసెస్‌ విజేతగా నిలిచింది.


డ్యురాండ్‌ కప్‌: సర్‌ మార్టిమర్‌ డ్యురాండ్‌ పేరిట డ్యురాండ్‌ కప్‌ను 1888లో ఏర్పాటు చేశారు. ఇది ఆసియాలో అతిపురాతనమైన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌. 2013 విజేత మహమ్మడన్‌ స్పోర్టింగ్‌. సెప్టెంబర్‌ 20న న్యూఢిల్లీలోని అంబేద్కర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓఎన్‌జీసీని ఓడించింది. మహమ్మడన్‌ స్పోర్టింగ్‌ 73 ఏళ్ల తర్వాత డ్యురాండ్‌ కప్‌ను సాధించింది.

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌: ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ 1930లో ప్రారంభమైంది. దక్షిణాఫ్రికాలో జరిగిన 2010 ప్రపంచకప్‌ను స్పెయిన్‌ గెలుచుకుంది. 2014లో జరిగే ప్రపంచకప్‌కు బ్రెజిల్‌, 2018లో రష్యా, 2022 ఖతార్‌లు ఆతిథ్యమివ్వనున్నాయి.

యూరో కప్‌: యూరో ఫుట్‌బాల్‌ కప్‌ 2012లో పోలండ్‌, ఉక్రెయిన్‌ దేశాల్లో జరిగింది. కీవ్‌లో జరిగిన ఫైనల్‌లో ఇటలీని ఓడించి స్పెయిన్‌ యూరో కప్‌ విజేతగా నిలిచింది. 2016 యూరో కప్‌ ఫ్రాన్స్‌లో జరుగుతుంది.

ఫిఫా కాన్ఫెడరేషన్స్‌ కప్‌: ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిఫా కాన్ఫెడరేషన్స్‌ కప్‌ను నిర్వహిస్తారు. 1992లో ప్రారంభమైంది. 2013 కాన్ఫెడరేషన్స్‌ కప్‌ జూన్‌లో బ్రెజిల్‌లో జరిగింది. ఫైనల్‌లో బ్రెజిల్‌ ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ స్పెయిన్‌ను ఓడించి కప్‌ను నాలుగోసారి గెలుచుకుంది. టోర్నమెంట్‌ అత్యుత్తమ ఆటగాడిగా బ్రెజిల్‌కు చెందిన నేమార్‌ ఎంపికయ్యాడు. 2017 ఫిఫా కాన్ఫెడరేషన్స్‌ కప్‌ను రష్యాలో నిర్వహిస్తారు. ఇవే కాకుండా ఫెడరేషన్‌ కప్‌, నెహ్రూ కప్‌, నిజాం గోల్డ్‌ కప్‌, సుబ్రతో కప్‌, రోవర్స్‌ కప్‌, మర్డేకా కప్‌, డాక్టర్‌ బి.సి.రాయ్‌ ట్రోఫీ, డీసీఎం ట్రోఫీ, ఐరోపా లీగ్‌, లా లీగా, బుందెస్లీగా, కొలంబో కప్‌లు కూడా ఫుట్‌బాల్‌కు సంబంధించినవే.

వివిధ పోటీ పరీక్షల్లో ట్రోఫీలపై అడిగిన ప్రశ్నలు
  1. ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్‌ సిరీస్‌ దేనికి సంబంధించింది?
  2. ఇరానీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది?
  3. మెర్డెకా కప్‌ దేనికి సంబంధించింది?
  4. ఆగాఖాన్‌ కప్‌ ఏ ఆటకు సంబంధించింది?
  5. థామస్‌ కప్‌ ఏ క్రీడకు సంబంధించింది?
  6. లాన్‌ టెన్నిస్‌కు సంబంధించిన కప్‌?
  7. రంజీ ట్రోఫీ దేనికి సంబంధించింది?
  8. ఫిఫా కప్‌ దేనికి సంబంధించింది?
సమాధానాలు:
1. క్రికెట్‌, 2. క్రికెట్‌, 3. ఫుట్‌బాల్‌, 4. హాకీ, 5. బ్యాడ్మింటన్‌, 6. వింబుల్డన్‌, 7.క్రికెట్‌, 8. ఫుట్‌బాల్‌.


క్రికెట్‌
రంజీ ట్రోఫీ: రంజీ ట్రోఫీని దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమమైందిగా పరిగణిస్తారు. నవానగర్‌ పాలకుడు, ప్రముఖ క్రికెటర్‌ రంజిత్‌ సింహ్‌జీ పేరిటఈ ట్రోఫీని ఏర్పాటు చేశారు. ఆయన 1896 నుంచి 1902 వరకు ఇంగ్లండ్‌ తరపున 15 టెస్టులు ఆడారు. రంజీ ట్రోఫీని ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్‌ షీల్డ్‌ ట్రోఫీకి సమానంగా పరిగణి స్తారు. 1934లో రంజీ ట్రోఫీ ప్రారంభమైంది. 2013 రంజీ ట్రోఫీని ముంబై జట్టు గెలుచుకుంది. ఫైనల్‌లో సౌరాష్టన్రు ఓడించింది. ఫైనల్‌ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. రంజీ ట్రోఫీ ముంబైకు 40వ టైటిల్‌.


ఇరానీ ట్రోఫీ: రంజీ ట్రోఫీకి 25 ఏళ్లు పూరె్తైన సందర్భంగా 1959-60లో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ) ఇరానీ ట్రోఫీని ప్రారంభించింది. బీసీసీఐ కోశాధికారిగా పనిచేసిన జల్‌ ఇరానీ పేరిట ఈ ట్రోఫీని ఏర్పాటు చేశారు. రంజీ ట్రోఫీ విజేత, రెస్టాఫ్‌ ఇండియా జట్ల మధ్య జరిగే పోటీలో గెలిచిన జట్టుకు ఇరానీ ట్రోఫీని బహూకరిస్తారు. 2013 ఇరానీ కప్‌ను రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా గెలుచుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు ముంబై జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. రెస్టాఫ్‌ ఆఫ్‌ ఇండియా వరుసగా ఎనిమిదోసారి ఈ కప్‌ను గెలుచుకోవడం విశేషం.

దులీప్‌ ట్రోఫీ: కుమార్‌ శ్రీదులీప్‌ సింహ్‌జీ పేరిట ఈ ట్రోఫీని ఏర్పాటు చేశారు. ఆయన ఇంగ్లండ్‌ జట్టుకు 1929 నుంచి 1931 వరకు 12 టెస్టులు ఆడాడు. 1961-62లో దులీప్‌ ట్రోఫీ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను జోన్ల మధ్య నిర్వహిస్తారు. 2012-13 విజేత ఈస్ట్‌ జోన్‌. చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌ను ఓడించి ఈస్ట్‌జోన్‌ విజేతగా నిలిచింది.
దేవ్‌ధర్‌ ట్రోఫీ: ప్రొఫెసర్‌ దినకర్‌ బలవంత్‌ దేవ్‌ధర్‌ పేరిట ఈ ట్రోఫీని 1973-74లో ప్రారంభించారు. నార్త్‌ జోన్‌, సౌత్‌ జోన్‌, ఈస్ట్‌ జోన్‌, వెస్ట్‌ జోన్‌, సెంట్రల్‌ జోన్‌ల మధ్య జరిగే 50 ఓవర్ల మ్యాచ్‌లో విజేతకు ఈ ట్రోఫీని బహూకరిస్తారు. 2013 విజేత వెస్ట్‌ జోన్‌. గువాహటిలో మార్చిలో జరిగిన ఫైనల్‌లో నార్త్‌ జోన్‌ను ఓడించి వెస్ట్‌ జోన్‌ దేవ్‌దర్‌ ట్రోఫీని దక్కించుకుంది. ఇది వెస్ట్‌ జోన్‌కు 11వ దేవ్‌దర్‌ ట్రోఫీ టైటిల్‌.

విజయ్‌ హజారే ట్రోఫీ: భారత మాజీ క్రికెటర్‌ విజయ్‌ హజారే పేరిట ఈ ట్రోఫీని 2002-03లో ప్రారంభించారు. ఇది కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌ టోర్నమెంట్‌. విజయ్‌ హజారే 1946-1953 మధ్య కాలంలో భారతదేశానికి 30 టెస్టు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆయన సారథ్యంలోనే చెన్నైలో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌ తొలి టెస్టు విజయాన్ని 1952లో సాధించింది. విజయ్‌ హజారే ట్రోఫీ ప్రస్తుత విజేత ఢిల్లీ. విశాఖపట్నంలో మార్చిలో జరిగిన ఫైనల్‌లో అస్సాంను ఓడించి ఢిల్లీ ట్రోఫీని దక్కించుకుంది.

ఎన్‌కేపీ సాల్వే ట్రోఫీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వే పేరిట ఎన్‌కేపీ సాల్వే చాలెంజర్‌ ట్రోఫీ 1994-95లో ప్రారంభమైంది. 2013 ట్రోఫీ విజేత ఇండియా బ్లూ. సెప్టెంబర్‌లో ఇండోర్‌లోని హోల్కార్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఇండియా బ్లూ.. ఢిల్లీని ఓడించింది.

కల్నల్‌ సి.కె.నాయుడు ట్రోఫీ: భారత టెస్ట్‌ క్రికెట్‌ మొదటి కెప్టెన్‌ కల్నల్‌ సి.కె.నాయుడు పేరిట ఈ ట్రోఫీ ఏర్పాటైంది. సి.కె.నాయుడు సారథ్యంలో భారతదేశం తన తొలి టెస్ట్‌ను 1932లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో ఆడింది. 2012-13 ట్రోఫీ విజేత ముంబై. రాజ్‌కోట్‌లో సౌరాష్టన్రు ఓడించి ముంబై ట్రోఫీని గెలుచుకుంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌): ఇది ట్వంటీ20 క్రికెట్‌ చాంపియన్‌షిప్‌. భారతదేశంలో ప్రతి ఏటా ఐపీఎల్‌ను నిర్వహిస్తారు. ప్రస్తుత ఐపీఎల్‌ చైర్మన్‌ రంజీబ్‌ బిశ్వాల్‌. 2008లో ఐపీఎల్‌ ప్రారంభమైంది. ఆరో ఐపీఎల్‌ ఏప్రిల్‌ 3, 2013న ప్రారంభమై మే 26, 2013న ముగిసింది. పెప్సీ కంపెనీ దీన్ని స్పాన్సర్‌ చేసింది. ఇందులో 9 జట్లు పాల్గొన్నాయి. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ను తొలిసారి గెలుచుకుంది. ముంబై ఇండియన్స్‌కు చెందిన కీరన్‌ పొలార్డ్‌కు ఫైనల్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ: ఆస్ట్రేలియా, ఇండియా టెస్ట్‌ సిరీస్‌ విజేతకు ఈ ట్రోఫీని ప్రదానం చేస్తారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌, భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ల పేరిట ఈ ట్రోఫీని 1996-97లో ప్రారంభించారు. ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించి భారత్‌ తొలి విజేతగా నిలిచింది. 2013లో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 4-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీని గెలుచుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నమెంట్లు
ఐసీసీ క్రికెట్‌ ప్రపంచ కప్‌: ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రపంచ కప్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్వహిస్తోంది. ప్రతి నాలుగేళ్లకొకసారి ప్రపంచ కప్‌ పోటీలు ఉంటాయి. మొదటి ప్రపంచ కప్‌ను


1975లో ఇంగ్లండ్‌లో నిర్వహించారు. దీన్ని వెస్టిండీస్‌ గెలుచుకుంది. పదో ప్రపంచ కప్‌ను మూడు దేశాలు (భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌) సంయుక్తంగా నిర్వహిం చాయి. ఈ టోర్నమెంట్‌ 2011లో ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగింది. ముంబైలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్‌ ప్రపంచ కప్‌ విజేతగా నిలిచింది. ఇది భారత్‌కు రెండో ప్రపంచ కప్‌. మొదటిసారి 1983లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలో భారత్‌ ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. 2015 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. 2019లో ఇంగ్లండ్‌, 2023లో భారత్‌ ఈ పోటీలకు ఆతిథ్యమివ్వనున్నాయి. అదేవిధంగా మహిళల ప్రపంచకప్‌ తొలిసారి 1973లో ఇంగ్లండ్‌లో జరిగింది. తొలి విజేత ఇంగ్లండ్‌. పదో మహిళల ప్రపంచ కప్‌ 2013లో భారతదేశంలో జరిగింది. ముంబైలో ఫిబ్రవరి 17న జరిగిన ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ గెలుచుకుంది. ఇది ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచ కప్‌.

టీ20 ప్రపంచ కప్‌: దీన్ని రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. మొదటి ట్వంటీ20 ప్రపంచకప్‌ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇందులో భారత్‌ విజేతగా నిలిచింది. 2009లో ఇంగ్లండ్‌ ఆతిథ్యమివ్వగా పాకిస్థాన్‌ టైటిల్‌ను గెలుచుకుంది. 2010లో మూడో ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌లో నిర్వహించారు. ఇందులో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. నాలుగో టీ20 ప్రపంచకప్‌ను 2012లో శ్రీలంకలో నిర్వహించారు. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి వెస్టిండీస్‌ విజేతగా నిలిచింది. తర్వాత జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ను 2014లో బంగ్లాదేశ్‌లో, 2016లో భారతదేశంలో, 2020లో ఆస్ట్రేలియాల్లో నిర్వహిస్తారు. మహిళల టీ20 ప్రపంచకప్‌-2012 కూడా శ్రీలంకలోనే జరిగింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా రెండోసారి టైటిల్‌ను సాధించింది. 2014లో మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌లో జరుగుతుంది.

చాంపియన్స్‌లీగ్‌ టీ20: అత్యుత్తమ దేశవాళీ జట్ల మధ్య జరిగే ఈ చాంపియన్‌షిప్‌ 2009లో ప్రారంభమైంది. ప్రతి ఏటా భారత్‌ లేదా దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. 2013 చాంపియన్స్‌లీగ్‌ టీ20ని సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 6 వరకు భారతదేశంలో నిర్వహించారు. ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడ్డాయి. ముంబై ఇండియన్స్‌ విజేతగా నిలిచి చాంపియన్స్‌లీగ్‌ కప్‌ను దక్కించుకుంది. ఈ మ్యాచ్‌ ద్వారా సచిన్‌ టెండ్కూలర్‌ పరిమిత ఓవర్ల కెరీర్‌ ముగిసింది.

చాంపియన్స్‌ ట్రోఫీ: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ 1998లో ప్రారంభమైంది. 50 ఓవర్ల ఈ టోర్నమెంట్‌ చివరిసారిగా జూన్‌, 2013లో ఇంగ్లండ్‌, వేల్స్‌ల్లో జరిగింది.

ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌ టైటిల్‌ను దక్కించుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా శిఖర్‌ ధావన్‌ ఎంపికయ్యాడు. ఈ ట్రోఫీని భారత్‌ గెలుచుకోవడం ఇది రెండోసారి. 2002లో భారత్‌, శ్రీలంకలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. చాంపియన్స్‌ ట్రోఫీ స్థానంలో 2017 నుంచి ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభమవుతుంది. 2017లో ఇంగ్లండ్‌, వేల్స్‌ల్లో ఇది జరుగుతుంది. రెండో టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ను 2021లో భారత్‌లో నిర్వహిస్తారు.

ఆసియా కప్‌: వన్డేల్లో నిర్వహించే ఆసియా కప్‌ను మొదటిసారి 1984లో షార్జాలో నిర్వహించారు. భారత్‌ అత్యధికంగా ఐదుసార్లు ఈ కప్‌ను గెలుచుకుంది. 2012 ఆసియా కప్‌ బంగ్లాదేశ్‌లో జరిగింది. ఇది 11వ ఆసియా కప్‌. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్‌ కప్‌ దక్కించుకుంది. ఇది పాకిస్థాన్‌కు రెండో ఆసియా కప్‌.

యాషెస్‌: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌ విజేతకు యాషెస్‌ను బహూకరిస్తారు. 1882-83లో ప్రారంభమైంది. 2013 యాషెస్‌ సిరీస్‌ ఇంగ్లండ్‌లో జరిగింది. 3-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ యాషెస్‌ను గెలుచుకుంది.

ఇవే కాకుండా భారతదేశంలో జరిగే ఇతర క్రికెట్‌ టోర్నమెంట్లు: కూచ్‌ బిహార్‌ ట్రోఫీ, మెయినుద్దౌలా కప్‌, విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ, విజ్జీ ట్రోఫీ, శీష్‌ మహల్‌ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ.

No comments:

Post a Comment