Saturday, August 2, 2014

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చరిత్రాత్మక ఒప్పందం ఏమిటి? ఎలా సాదించింది?

డిసెంబరు - 7,2014

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చరిత్రాత్మక ఒప్పందాన్ని సాధించింది. 1995లో సంస్థ ఏర్పడిన తర్వాత ఈ సభ్యదేశాల మధ్య తొలిసారిగా ఒక సమగ్ర ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని దాదాపు రూ.62 లక్షల కోట్ల (ట్రిలియన్ డాలర్ల)కు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.      
» అంతర్జాతీయ వాణిజ్య ప్రక్రియలో జాప్యాన్ని, ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది. కస్టమ్స్ ప్రక్రియలను సరళీకరించడం, వాటిని మరింత పారదర్శకంగా రూపొందించడం లాంటి చర్యలు చేపట్టడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి అవరోధాలు తొలగిపోనున్నాయి. నిరుపేద దేశాలు అమ్మే వస్తువులపై సుంకం విధించకపోవడం లేదా తక్కువగా వసూలు చేయడానికి ఇది ఉపకరిస్తుంది. వాణిజ్య ప్రక్రియ సరళీకరణ ఒప్పందం (ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్)గా దీన్ని పేర్కొన్నారు.      
» డబ్ల్యూటీవో ఒప్పందం కుదరడం అంత సులభం కాదు. ఎందుకంటే 159 సభ్యదేశాల మధ్యా ఏకాభిప్రాయం వస్తేనే కుదిరినట్లు. ఈసారి ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన సదస్సు షెడ్యూలు నాలుగు రోజులే కాగా, ఆ గడువు లోపు ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. ఇక చర్చలు విఫలమైనట్లే అని అందరూ భావించారు. అయితే ఒక రోజు గడువు పెంచారు.      
» చర్చల్లో కీలకమైన ఆహారభద్రత విషయంలో భారత్ తన వాదనను సమర్థంగా వినిపించింది. వ్యవసాయ ఒప్పందం కింద పదిశాతం రాయితీ పరిమితిని ఉల్లంఘిస్తే విధించాల్సిన ఆంక్షల నుంచి నాలుగేళ్లపాటు రక్షణ కల్పించే నిబంధనను అంగీకరించాలని భారత్‌ను అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు తొలుత కోరాయి. ఆతిథ్య దేశమైన ఇండోనేషియా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే శాశ్వత పరిష్కారం దొరికేవరకు ఈ నిబంధనను కొనసాగించాలని భారత్ గట్టిగా పట్టుబట్టడంతో అగ్రదేశాలు అంగీకరించక తప్పలేదు.      
» ఇక ఒప్పందం కుదిరినట్లే అని అంతా భావించగా, చివరి క్షణంలో క్యూబా ఒక అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దాదాపు 50 ఏళ్లనుంచి తమపై అమెరికా కొనసాగిస్తున్న ఆంక్షలకు ఈ ఒప్పందం ఎలా పరిష్కారం కాగలదని ప్రశ్నించింది. లాటిన్ అమెరికాకు చెందిన మరో మూడు దేశాలు క్యూబాకు మద్దతు తెలిపాయి. అమెరికా ఆంక్షలకు సమాధానం చెప్పే రీతిలో సంబంధిత అంశాలు ఒప్పందంలో ఉండాలని పట్టుబట్టాయి. క్యూబా ఆందోళనలను ఒప్పందంలో పొందుపరుస్తామని సభ్యదేశాలు అంగీకరించడంతో చర్చలు ఫలప్రదంగా ముగిశాయి.

No comments:

Post a Comment