Monday, September 7, 2015

ఐక్యరాజ్య సమితి 'ది మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ రిపోర్ట్ 2015' పేరుతో తుది, సమగ్ర నివేదిక

జులై - 12,2015

2000 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో సాధించిన పురోగతి మొత్తాన్ని మదింపు చేస్తూ ఐక్యరాజ్య సమితి జులై 6న 'ది మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ రిపోర్ట్ 2015' పేరుతో తుది, సమగ్ర నివేదికను విడుదల చేసింది.      
» మానవాభివృద్ధి విషయంలో ముఖ్యంగా తీవ్రమైన పేదరిక నిర్మూలన విషయంలో మనం ఒక చారిత్రక దశకు చేరుకున్నామని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది కడు బీదలను ఆ బీదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ఈ సహస్రాబ్ది లక్ష్యాలు (మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ - ఎండీజీ) దోహదం చేశాయని నివేదిక గుర్తించింది. సహస్రాబ్ది లక్ష్యాలు సాధించిన చరిత్రాత్మక విజయమిదని నివేదిక విశ్లేషించింది. అలాగే గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున బాలికలను బడిబాట పట్టించేందుకు కూడా ఈ లక్ష్యాలు దోహదపడ్డాయని ఐరాస వెల్లడించింది. ఆ అనుభవాన్ని, పురోగతినీ భూమికగా చేసుకుని ఈ ఏడాది మరింత స్పష్టతతో సరికొత్త 'సుస్థిర అభివృద్ధి అజెండా' (ఎస్‌డీఏ - సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అజెండా)ను తెరమీదకు తీసుకువస్తున్నట్లు ఐరాస వెల్లడించింది.

సహస్రాబ్ది లక్ష్యాలు - పురోగతి నివేదిక

1. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడంఈ పదిహేనేళ్లలో దాదాపు 100 కోట్ల మంది తీవ్ర దారిద్య్రం నుంచి బయటపడ్డారు. 1990లలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపుగా సగానికి సగం మంది అంటే 190 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉండేవారు. వీరి రోజువారీ తలసరి వ్యయం 1.25 డాలర్ల (సుమారు రూ.80) కంటే తక్కువగా ఉండేది. 2015 నాటికి వీరి సంఖ్య 83.6 కోట్లకు తగ్గింది. ఇలా తీవ్ర పేదరికం 47 శాతం నుంచి 14 శాతానికి తగ్గిపోవడం గొప్ప పురోగతిగా చెప్పుకోవాలి. అలాగే 1990లతో పోలిస్తే ఇప్పుడు పోషకాహార లోపంతో సతమతమవుతున్న వారి సంఖ్య దాదాపుగా సగానికి తగ్గింది.

2. సార్వత్రిక విద్యను సాధించడంప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల విషయంలో గణనీయమైన పురోగతి సాధించాం. 2000 సంవత్సరంలో వర్థమాన దేశాల్లో ప్రాథమిక పాఠశాలల సగటు ప్రవేశాల రేటు 83 శాతం ఉండేది. 2015 నాటికి ఇది 91 శాతానికి పెరిగింది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో తప్పించి మిగతా వర్థమాన దేశాలన్నింటిలోనూ దాదాపుగా లక్ష్యాలను అందుకున్నారు.

3. లింగపరమైన సమానత్వాన్ని సాధించడంవర్థమాన దేశాల్లో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల స్థాయిలో లింగపరమైన వివక్ష దాదాపుగా తొలగిపోయింది. దక్షణాసియా దేశాల్లో 1990లలో ప్రతి 100 మంది బాలురకు కేవలం 74 మంది బాలికలే పాఠశాలల్లో చేరేవారు. 2015 నాటికి ప్రతి 100 మంది బాలురకు 103 మంది బాలికలు చేరుతున్నారు. అలాగే చట్టసభల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం ఈ దశాబ్దిన్నర కాలంలో దాదాపుగా రెట్టింపు అయ్యింది. మొత్తం 174 దేశాల గణాంకాలను పరిశీలిస్తే 90 శాతం దేశాల్లో మహిళల ప్రాతినిధ్యం చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది.

4. శిశు మరణాలను తగ్గించడంశిశు మరణాల విషయంలో ఈ సహస్రాబ్ది లక్ష్యాల కాలంలో మానవ చరిత్రలోనే అద్భుతమైన పురోగతి నమోదవడం విశేషం. అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు దాదాపుగా సగానికి తగ్గిపోయింది. 1990లలో ప్రతి 1000 మంది శిశు జననాలకు 90 మరణాలు సంభవించేవి. 2015 నాటికి ఈ సంఖ్య 43కు తగ్గింది. ఒక తట్టు (మిజిల్స్) టీకా కారణంగానే 2000 - 2013 మధ్య దాదాపు 1.56 కోట్ల మరణాలను నివారించగలిగారు.

5. గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంగర్భిణుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో సుస్థిర పురోగతి సాధించాం. 1990లతో పోలిస్తే గర్భిణుల మరణాల నిష్పత్తి 45 శాతం వరకు తగ్గిపోయింది. సహస్రాబ్ది లక్ష్యాలకు కంకణ బద్ధమైన 2000 సంవత్సరం తర్వాతే ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తున్న పురోగతి. 2014లో దాదాపు 71 శాతం కాన్పులు వైద్య సహాయకుల పర్యవేక్షణలోనే జరిగాయి. 1990లలో ఇది 59 శాతమే.

6. హెచ్ఐవీ, మలేరియా తదితర వ్యాధులను ఎదుర్కోవడంప్రపంచ వ్యాప్తంగా 2000 - 2013 మధ్య కొత్తగా హెచ్ఐవీ బారిన పడుతున్న వారి సంఖ్య 40 శాతం పైగా తగ్గింది. ఇక హెచ్ఐవీకి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 2003లో 8 లక్షలు కాగా, 2014 నాటికి 1.36 కోట్లకు పెరగడం మంచి పరిణామం. ఈ చికిత్స కారణంగా 1995 - 2013 మధ్య 76 లక్షల మరణాలను నివారించగలిగారు. అలాగే 2000 - 2015 మధ్య దాదాపు 62 లక్షల మలేరియా మరణాలను, 3.7 కోట్ల క్షయ మరణాలను నివారించగలిగారు.

7.  సురక్షిత మంచినీరు అందించడం, ఓజోన్ పొర పరిరక్షణప్రపంచ జనాభాలో 76 శాతం మందికే మెరుగైన మంచినీటి సదుపాయలుండేవి. 2015 నాటికి 91 శాతం మందికి ఈ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల మందికి పారిశుద్ధ్య, మరుగుదొడ్ల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. 1990 తర్వాత బహిరంగా మలవిసర్జన చేస్తున్న వారి సంఖ్య సగానికి సగం తగ్గింది. కుళాయిల ద్వారా సురక్షిత నీటి సదుపాయం 1990 తర్వాత 190 కోట్ల మందికి అందుబాటులోకి వచ్చింది. 1990 తర్వాత ఓజోన్ పొరను దెబ్బతీసే పర్యావరణ హానికారక పదార్థాల వాడకం పూర్తిగా నిలిపివేశారు. దీని ఫలితంగా ఈ శతాబ్దం మధ్య కల్లా ఓజోన్ పొర తిరిగి పూర్తిగా భర్తీ అవుతుందని అంచనా వేస్తున్నారు.

8. అభివృద్ధి కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడం అభివృద్ధి కార్యాచరణ కోసం వెచ్చిస్తున్న అధికారిక నిధులు (ఓడీఏ) ఈ పదిహేనేళ్లలో 66 శాతం పెరిగాయి. 2014లో ఇది 13,520 కోట్ల డాలర్లు ఉంది. గత 15 ఏళ్లలో మొబైల్ ఫోన్ల వాడకందార్ల సంఖ్య పదిరెట్లు పెరిగింది. 2000 సంవత్సరంలో వీరి సంఖ్య 73.8 కోట్లు కాగా, ఇప్పుడు 700 కోట్లకు పెరిగింది. అలాగే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2000 సంవత్సరంలో ప్రపంచ జనాభాలో కేవలం 6 శాతం కాగా 2015 నాటికి ఇది 43 శాతానికి పెరిగింది. నేడు దాదాపు 320 కోట్ల మంది ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయంగా అనుసంధానమయ్యారు.

మరికొన్ని సమస్యలు: పాఠశాల చదువులు, చట్ట సభల్లో ప్రాతినిధ్యాలు ఎంతో కొంత పెరిగినా ఉద్యోగాలు, ఉపాధి, ఆస్తులు, నిర్ణయాధికారాల విషయంలో మహిళలు ఇప్పటికీ తీవ్ర వివక్షకు గురవుతూనే ఉన్నారు. నేటికీ 80 కోట్ల మంది తీవ్రమైన పేదరికం, ఆకలితో మగ్గుతున్నారు. 20 శాతం మంది పిల్లలు ఎదుగుదలకు, చదువులకు నోచుకోవడం లేదు. మన పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కర్బన ఉద్గారాలు 1990లతో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగాయి. సరైన పారిశుద్ధ్య సదుపాయాలు లేనివారు పట్టణ ప్రాంతాల్లో 18 శాతం వరకు ఉండగా, పల్లెల్లో నేటికీ 50 శాతం పైగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలు నీటి కొరతను అనుభవిస్తున్నారు. వీరి సంఖ్య ఇంకా పెరుగుతుంది.ఈ నేపథ్యంలో 2015 తర్వాత అభివృద్ధి అజెండాలన్నింటికీ ఇవే కీలకం కాబోతున్నాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొత్తగా చేపట్టనున్న 'సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు' రూపకల్పన చేస్తున్నారు.

భారత్ పరిస్థితిభారత్ తీవ్రమైన పేదరికాన్ని, దుర్భర దారిద్య్రాన్ని సగానికి సగం తగ్గించగలిగింది. సహస్రాబ్ది లక్ష్య నిర్దేశానికి ముందు దేశంలో తీవ్రమైన పేదరికం 49.4 శాతం ఉండగా, 2011 నాటికే, సహస్రాబ్ది లక్ష్యాల్లో భాగంగా పెట్టుకున్న గడువు కంటే ముందే ఇది 24.7 శాతానికి తగ్గింది. అయితే తీవ్ర పేదరికం నిర్మూలనలో మనం పొరుగున ఉన్న పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకబడి ఉన్నాం.      
» మనదేశం ఆకలి, ఆహార భద్రత విషయంలో కూడా సహస్రాబ్ది లక్ష్యాలకు చేరువ అవుతుందని నివేదిక వ్యాఖ్యానించింది. అయితే ఇప్పటికీ పోషకాహార లోపం విషయంలో ప్రపంచంలో నాలుగోవంతు మంది, తక్కువ బరువు ఉన్న పిల్లల విషయంలో మూడోవంతు మంది మన దేశంలోనే ఉన్నారు.      
» సహస్రాబ్ది లక్ష్యాల్లో భాగంగా నిర్దేశించుకున్న మొత్తం 22 అంశాల్లో భారత్ దాదాపు 11 అంశాలను చేరుకుంది. మరికొన్నింటిని ఈ సంవత్సరాంతానికి చేరుకోనుందని నివేదిక వెల్లడించింది. వీటిలో విద్య, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

No comments:

Post a Comment