Monday, September 7, 2015

జాతీయ నమూనా సర్వే (2011-12)

ఆగస్టు - 4,2015

జాతీయ నమూనా సర్వే (2011-12)ను కేంద్ర ప్రభుత్వ విడుదల చేసింది.
ముఖ్యాంశాలు
 నేటికీ గ్రామీణ భారత దేశంలో మూడింట రెండొంతుల మందికి గృహ అవసరాలకు వంట చెరకే ప్రధాన వనరుగా ఉంది.

 గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ కేవలం 15 శాతం కుటుంబాలకే అందుబాటులో ఉంది. 67 శాతం కుటుంబాలు వంట చెరకునే వినియోగిస్తున్నాయి.
 పట్టణ ప్రాంతాల్లో వంటకు 68 శాతానికి పైగా ఎల్‌పీజీ పైనే ఆధారపడుతున్నారు.

 జాతీయ సగటుతో పోల్చితే గ్రామీణ విద్యుదీకరణ మినహా ఇతర అంశాల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 67.5 శాతం కుటుంబాలు వంట చెరకుపైనే ఆధారపడి ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇది 93.2 శాతంగా, రాజస్థాన్‌లో 89.3 శాతంగా, ఒడిశాలో 87 శాతంగా ఉంది.
 గృహాలకు వెలుతురు కోసం పట్టణ ప్రాంతాల్లో దాదాపు అన్ని కుటుంబాలకు విద్యుత్ అందుబాటులో ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. బిహార్ గ్రామాల్లో ఇప్పటికీ 73.5 శాతం కుటుంబాలు కిరోసిన్ దీపాలనే వినియోగిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఇది 58.5 శాతం, అసోంలో 43.3 శాతం, జార్ఖండ్‌లో 36.8 శాతం, ఒడిశాలో 32.3 శాతం, పశ్చిమ్‌బంగలో 29.3 శాతం కుటుంబాలు కిరోసిన్ దీపాలనే వినియోగిస్తున్నాయి.

 దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కిరోసిన్ దీపాల వినియోగం 3.2 శాతంగా ఉంది. బిహార్‌లో 17.2 శాతం, ఉత్తర ప్రదేశ్‌లో 10.8 శాతం, అసోంలో 7.9 శాతం, గుజరాత్‌లో 5.2 శాతం, పశ్చిమ బెంగలో 5 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 3.6 శాతం, ఒడిశాలో 3.5 శాతం పట్టణ గ్రామీణులు రాత్రిళ్లు వెలుగు కోసం కిరోసిన్ దీపాలను ఉపయోగిస్తున్నారు.
 గృహ అవసరాలకు విద్యుత్ వినియోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందుంది. గ్రామాలకు విద్యుదీకరణలో జాతీయ సగటు 72.7 శాతం. ఉమ్మడి ఏపీలో 97.6 శాతం ఇళ్లకు విద్యుత్ అందుబాటులో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ (97.4%), కేరళ (96.2%), కర్ణాటక (95.2%), హరియాణ (95.1%), గుజరాత్ (93.2%) ఉన్నాయి.

 పట్టణ ప్రాంతాల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో 95 శాతం పైగా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది. ఉమ్మడి ఏపీలో ఇది 98.5 శాతం. 98.8 శాతంతో తమిళనాడు ముందుంది.
 గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ వినియోగానికి సంబంధించి తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 37.2 శాతం గ్రామీణ కుటుంబాలు ఎల్‌పీజీని వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో 30.8 శాతంతో కేరళ, 30.5 శాతంతో పంజాబ్ ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో 1.5 శాతం కుటుంబాలు ఎల్‌పీజీని వినియోగిస్తుండగా ఝార్ఖండ్‌లో ఇది 2.9 శాతం, ఒడిశాలో 3.9 శాతంగా ఉంది.

 పట్టణ ప్రాంతాల్లో కుటుంబాల వంట అవసరాలకు ఎల్‌పీజీ వినియోగంలో హరియాణ రాష్ట్రం ముందుంది. ఈ రాష్ట్రంలో 86.5 శాతం పట్టణ కుటుంబాలు ఎల్‌పీజీని వినియోగిస్తున్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఇది 77.3 శాతం, పంజాబ్ 75.4%, మహారాష్ట్ర 74.5%గా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని పట్టణ ప్రాంతాల్లో 39.8 శాతం కుటుంబాలు మాత్రమే ఎల్‌పీజీని వినియోగిస్తున్నాయి.
 పిడకలు, ఎండబెట్టిన పేడను వంటకు ఇంధనంగా వినియోగించడంలో ఉత్తరప్రదేశ్ ముందుంది. పిడకల వినియోగం యూపీలోని గ్రామాల్లో 33.4 శాతం కాగా పంజాబ్‌లో ఇది 30.3 శాతం. హరియాణలో 24.4 శాతం, బిహార్‌లో 20.8, మధ్యప్రదేశ్‌లో 10.6 శాతంగా ఉంది.

 పట్టణ ప్రాంతాల్లోనూ పిడకలు, ఎండబెట్టిన పేడను వంటకు ఇంధనంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఒడిశా అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో పట్టణ కుటుంబాలు 36.5 శాతం పిడకలను ఉపయోగిస్తున్నాయి. కేరళలో 36.3% కుటుంబాలు, ఛత్తీస్‌గఢ్‌లో 34.7% కుటుంబాలు పిడకలను వంటకు వినియోగిస్తున్నాయి.

No comments:

Post a Comment