Friday, June 10, 2016

తెలుగుతోనే బంగరు భవిత!

ప్రపంచవ్యాప్తంగా ఆయా జాతులవారు తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, పరివ్యాప్తికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి 'మాతృభాషా దినోత్సవాలు' ఒక వేదిక. ఈసారి మాతృభాషా దినోత్సవంనాడు కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మూడో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించడం అభినందనీయం.
కుటుంబానికి అమ్మ కేంద్రబిందువు. మన సంస్కృతీ సభ్యతలను పరిరక్షించుకోవడానికి అమ్మ భాష ఎంతో అవసరం. 'కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం మరచినవాడు మానవుడే కాదు' అంటారు కదా! నేనెంతో దురదృష్టవంతుణ్ని. ఏడాదిన్నర వయసులో ఉండగానే, అమ్మను కోల్పోయాను. తెలుగువాడిననే భావం, 'ఒక మహత్తర భాషకు వారసుణ్ని' అనే సంతృప్తి నాలో ఉంది. ఇంతటి మహోన్నత సంస్కృతి ఉన్న మన తెలుగు భాషను రక్షించుకోవాలి. మాతృభాషను రక్షించుకోవడం- మానసిక వికాసాన్ని, సృజనాత్మకతను వెలికితీస్తుంది. ఒక రచయిత చెప్పినట్లు 'మాతృభాష మన కళ్లలాంటిది. పరభాష కళ్లజోడులాంటిది. కళ్లు లేకుండా కళ్లజోడు పనికిరాదు. అంధుడికి ఎంత విలువైన కళ్లజోడు పెట్టినా ప్రయోజనం ఉండదు'. అందుకే మనం ముందుగా మాతృభాషను అభ్యసించాలి. ఆ తరవాత ఎన్ని భాషలనైనా సులభంగా నేర్చుకోవచ్చు. వాటిలో పాండిత్యం సంపాదించవచ్చు.
మహాసభలకు సందేశం పంపిస్తూ రామోజీరావు చెప్పినట్లు, 'ఇది మన ఇంట్లో పండుగ'. మన ఇంట, మన పంట, మన వంట, మన జంట- దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. మన మాట, మన పాట, మన ఆట, మన బాట, మన చేతి రాత, మన భాష, మన ధ్యాస, మన ప్రాస, మన మాండలికం, మన గ్రాంథికం, మన సంగీతం, మన సాహిత్యం... ఉత్కృష్టమైనవి. ఇలాగే భారతీయ భాషలన్నింటికీ విశిష్టతలున్నాయి.
మనకు స్వరాజ్యం వచ్చిందే కానీ- మన సొంత భాషను మరచి పరభాషలమీద మోహంతో పాశ్చాత్య సంస్కృతిపై వ్యామోహంతో కొట్టుమిట్టాడుతున్నాం. జాతీయ స్థాయిలో హిందీ తరవాత రెండో స్థానంలో ఉన్న మన తెలుగు భాష క్రమంగా వెనకబడిపోతోంది. ఇంగ్లిషు నేర్చుకోవడంలో తప్పు లేదు. ఆ మనస్తత్వాన్ని అలవరచుకోవడమే ప్రమాదకరం!
కొత్త తరంలో తెలుగు చదివేవారి సంఖ్య తగ్గిపోతోంది. తెలుగు సాహిత్యం, తెలుగు పద్యం, తెలుగు కథలు, తెలుగు కళలు మొదలైన అంశాలకు సంబంధించిన పరిజ్ఞానం క్రమంగా తగ్గుతోంది. తెలుగులో మాట్లాడటానికీ జంకుతున్నారు. నామోషీగా భావిస్తున్నారు. ఇప్పుడు చాలా విద్యాలయాల్లో తెలుగు అంతరించింది. దీని ఫలితంగా తెలుగు చదవటం, తెలుగు రాయడంలో ఈతరం పిల్లలు వెనకబడిపోతున్నారు.
ఏ భాషైనా విశ్వవ్యాప్తం కావడానికి, పరిపుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరం. ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదం అయినంతగా, మన తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడం లేదు. దీనికోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 'కేంద్రీయ హిందీ సంస్థాన్‌'లా తెలుగు భాషకూ ఓ ప్రత్యేక సంస్థ ఉంటే, తెలుగును మరింతగా వ్యాపింపజేయవచ్చు. అనువాద విధానంలో మనం వెనకబడి ఉండటం వల్ల మన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, పొట్టి శ్రీరాములు పట్టుదల, మన టంగుటూరి, మన విశ్వనాథ, మన శ్రీనాథల సాహిత్య సౌరభాలు, వారి ప్రజ్ఞాపాటవాలు... వింధ్య పర్వతాల ఆవల ఉన్నవారికి తెలియడం లేదు.
మన తెలుగు ఎంతో మధురమైన భాష. ముత్యాలవంటి అక్షరాలు మన భాషకు ఉన్న ప్రత్యేకత. మన శబ్ద మాధుర్యం, భావ సౌందర్యం విశిష్టమైనవి. అందుకే తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 'సుందర తెలుంగు' అని ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయలు కన్నడ ప్రభువు అయినా తెలుగులో 'ఆముక్తమాల్యద' పేరిట అద్భుత ప్రబంధాన్ని రచించి 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు భాషా వైశిష్ట్యాన్ని కొనియాడాడు. ఇటలీ దేశవాసి నికోలో కోంటి తెలుగును 'ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌' అని ప్రశంసించాడు. మన తెలుగుభాష ఉన్నతికి, వ్యాప్తికి కృషిచేసిన విదేశీయుడైన సీపీ బ్రౌన్‌ మహాశయుణ్ని మనం గుర్తుంచుకోవాలి. మన భాష కోసం కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ, శ్రీపాద, విశ్వనాథ, తాపీ ధర్మారావు వంటి మహనీయుల్ని మనం నిత్యం స్మరించుకోవాలి.
సంస్కృతి, సంస్కారం భాషలో ఇమిడి ఉంటాయి. భాషలో సంస్కృతి, సంస్కృతిలో భాష మమేకం అవుతాయి. పలు భాషల్లో అధ్యయనం, వివిధ సంస్కృతులతో అనుబంధం- మానవాళికి మంచి చేకూరుస్తాయి. అంతకుముందే, మన పునాది అయిన మాతృభాషను శక్తిమంతం చేసుకోవాలి. మాతృభాషను కోల్పోతే మన వారసత్వాన్ని కోల్పోయినట్లే. 'తెలుగుభాషను నేర్చుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్తు' అనే భావన కల్పించాలంటే- తెలుగును తప్పనిసరిగా ప్రాథమిక, ఉన్నతవిద్యా స్థాయుల్లో పాఠ్యాంశంగా చేర్చాలి. పెద్ద బాలశిక్షను తిరిగి పాఠ్యాంశం చేయాలి. మాతృభాష అభివృద్ధికి శాసనకర్తలు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, అధికారులు, సాధారణ ప్రజలు... పరిపాలకుల నుంచి పరిపాలితుల వరకు అందరూ కృషిచేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలు, న్యాయస్థానాల్లో తీర్పులు, నామ ఫలకాలు, వీధుల సూచికలు, బస్సు మార్గాలు- ఇలా అన్నీ తెలుగులో ఉండాలి. ప్రాచీనమైన తెలుగుభాష పరిరక్షణకు ఒక సాధికారిక సంస్థ లేదా మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలి. అన్ని స్థాయుల్లో తెలుగుభాష వాడకాన్ని ప్రోత్సహించాలి.మన తెలుగువారికి ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఇద్దరు 'చంద్రులూ' శ్రీకృష్ణదేవరాయల్ని ఆదర్శంగా తీసుకుని, తెలుగుభాష అభ్యున్నతికి కృషిచేయాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం- ఏడాది పొడవునా మాతృభాషోత్సవాలు నిర్వహించాలని, అన్ని రాష్ట్రాలూ అందుకు చర్యలు తీసుకోవాలని కోరడం చాలా సంతోషం.
మన తెలుగుభాషను ఉపయోగించాల్సిన తీరులో మనం ఉపయోగించలేకపోవడం విచారకరం. పాశ్చాత్య వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాం. 'ఏ బోర్డు చూసినా ఏమున్నది గర్వకారణం... అంతటా ఆంగ్లమయం' అన్నట్లు పరిస్థితి తయారైంది. 'అమ్మా, నాన్నా!' అని నోరారా పిలవలేకపోతున్నాం. మమ్మీ డాడీల పిలుపులకు మురిసిపోతున్నాం! 'మమ్మీ' అనే పదం కేవలం పెదవులమీద నుంచి వస్తుంది. అమ్మ పదం హృదయపు లోతుల నుంచి వెలువడుతుంది, అదే మన భాషలోని గొప్పతనం. మన తెలుగును మనమే నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. 'మహాత్మాగాంధీ రోడ్డు' అని ముచ్చటగా పేరు ఉంటే 'ఎంజీ రోడ్డు' అంటున్నాం. ఎందుకీ భాషా దారిద్య్రం? తిరుమల-తిరుపతి దేవస్థానంవారు సైతం అర్చనానంతర దర్శనాన్ని 'ఏఏడీ' అంటున్నారు. నిజపాద దర్శనాన్ని 'ఎన్‌పీడీ' అని పిలుస్తున్నారు. 'ఎయిర్‌ హోస్టెస్‌'ను తెలుగులో 'గగన సఖి' అని ఎంత అందంగా చెప్పవచ్చు! 'గుడ్‌ మార్నింగ్‌' బదులు 'నమస్కారం' అనడంలో ఎంతో సంస్కారం ఉంది. నేను ఆంగ్లంలో మాట్లాడుతూ, అప్పుడప్పుడు పదాలు దొరక్క తెలుగులో మాట్లాడేస్తుంటా. వెంటనే చప్పట్లు మోగుతాయి. అదీ అమ్మ భాష ఘనత! తెలుగుభాష ఏ భాషా పదాన్నైనా ఇముడ్చుకోగలుగుతుంది. ఈ అంతర్జాల యుగంలో సాంకేతికత సాయంతో తెలుగును విశ్వవ్యాప్తం చేద్దాం. ఈ పని రాత్రికి రాత్రే జరగదు! మనం విశేషంగా కృషిచేసి, అన్ని రంగాల్లో తెలుగును ప్రయోగించినప్పుడే ఇది సాధ్యం.
భౌగోళికంగా, రాజకీయంగా విడిపోయినా తెలుగువారందరం ఒక్కటే. రాష్ట్ర విభజన తెలుగు ప్రజల్ని విభజించకూడదు. ప్రపంచంలోని ఏ భాషా వ్యవహర్తలూ ఒకే విధంగా మాట్లాడరు. అనేక వ్యవహార భేదాలు అంటే, మాండలిక భేదాలు ఉంటాయి. మన తెలుగులోనూ ఉన్నాయి. కళింగాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలికాలున్నాయి. అంతటా ఒకే తెలుగు. వ్యవహారంలోనే భేదం. ఎన్ని వ్యవహార భేదాలున్నా తప్పు లేదు. కానీ ప్రతిచోటా తెలుగు కనిపించాలి, వినిపించాలి. మొదట మాతృభాష అభ్యాసం, ఆ తరవాత పరభాష అధ్యయనం, బహు భాషల అధ్యయనం అవసరం.
మన మాతృభాష తెలుగును గౌరవిద్దాం. మన తెలుగు సంస్కృతిని మనం ఆదరిద్దాం. ప్రజలు నడుం కడితే తెలుగుభాషకు అంతం ఉండదు. తెలుగు భాషను, సంస్కృతిని రక్షించుకునే ఉద్యమం ప్రజల్లో మొదలు కావాలి. ప్రజలు కోరుకుంటే ప్రభుత్వం ఏ భాషావ్యాప్తికైనా దోహదం చేస్తుంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభ స్ఫూర్తితో తెలుగు వారందరం ఐక్యంగా సాగుదాం. మన భాషను, సంస్కృతిని సంరక్షించుకుందాం. మన ఉనికి కాపాడుకుందాం!

No comments:

Post a Comment