Friday, June 10, 2016

మన ఘనత... మంగళ్ యాన్

భారత్ అంగారక యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మంగళ్‌యాన్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. మంగళ్‌యాన్ 300 రోజుల్లో 670 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించి, గమ్యస్థానాన్ని చేరుకుంది. భారత్ అంగారక గ్రహయాత్ర చేపట్టనుందన్న విషయాన్ని తొలిసారిగా ప్రభుత్వం 2012 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించింది.
మంగళ్‌యాన్ ప్రయాణం 2013 నవంబరు 5 న మొదలైంది. 2014, సెప్టెంబరు 24 న మంగళ్‌యాన్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. భారతదేశం ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన తొలి ఆసియా దేశంగా ఖ్యాతి గాంచింది. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అమెరికా, రష్యా తొలి ప్రయత్నంలో విఫలమయ్యాయి. అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సామర్థ్యం పొందిన నాలుగో సంస్థ ఇస్రో. ఇప్పటి వరకు అమెరికాకు చెందిన నాసా, రష్యన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే ఈ రకమైన విజయాన్ని సాధించాయి.
* మంగళ్‌యాన్‌గా పిలిచే భారత అంగారక యాత్రకైన ఖర్చు 73 మిలియన్ డాలర్లు మాత్రమే, అంటే రూ.450 కోట్లు. అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన మావెన్ ప్రోబ్ (Mars Atmosphere and Volatile Evolution - MAVEN) కు అయిన ఖర్చు 672 మిలియన్ డాలర్లు అంటే సుమారు పదిరెట్లు ఎక్కువ. దీన్ని మంగళ్‌యాన్ అంగారక కక్ష్యలోకి చేరే రెండు రోజుల ముందే కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
* చంద్రయాన్ ప్రాజెక్టును కూడా అమెరికా, యూరోపియన్ దేశాలతో పోలిస్తే భారత్ అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగింది.
అంగారక యాత్ర ఎందుకంటే..
అంగారక గ్రహ కక్ష్యలోకే కాదు, అమెరికా లాంటి దేశాలు ఆ గ్రహంపైకి కూడా చేరగలిగాయి. అమెరికా, రష్యా అంగారక గ్రహాన్ని పరిశోధించాయి. ఇలాంటి తరుణంలో భారత్ అంగారక గ్రహ యాత్ర చేపట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. చంద్రయాన్ ప్రయోగ సమయంలోనూ ఇలాంటి వాదనలే వినిపించాయి. అయితే తొలిసారిగా చంద్రుడిపై నీటి ఆనవాళ్లున్నాయని స్పష్టంగా, నిర్దిష్టంగా రుజువు చేసింది భారత్ చేపట్టిన చంద్రమండల యాత్రే. చంద్రయాన్-1 పై ఉన్న మూన్ మినరాలజీ మ్యాపర్ (M-3) ఈ విషయాన్ని బయటపెట్టింది. అమెరికాకు చెందిన నాసా ఈ మూన్ మినరాలజీ మ్యాపర్‌ను చంద్రయాన్‌లో ఏర్పాటు చేసింది. అందుకే భారత్ చంద్రయాన్ కృషిని నాసా కూడా కొనియాడింది.
* అంగారక గ్రహంపై మీథేన్ వాయువు ఆనవాళ్లపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు. మంగళ్‌యాన్ తన పరిశోధనల్లో ఈ విషయాన్ని పరీక్షించనుంది. చంద్రయాన్‌కు దక్కిన విజయమే మంగళ్‌యాన్‌కి కూడా లభిస్తే భారత్ మరో చరిత్ర సృష్టించినట్లే.
సాంకేతిక ప్రదర్శన
మార్స్ మిషన్ ద్వారా భారత్ జరిపే శాస్త్ర పరిశోధనలు పరిమితమే. వాస్తవానికి మంగళ్‌యాన్‌లో ఉన్నవి కేవలం అయిదు పరికరాలు మాత్రమే. ఇది అంగారక కక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. అందువల్ల పరిశోధనలకు ఉన్న అవకాశాలు పరిమితం. అందుకే భారత్ ఈ ప్రయోగం ద్వారా శాస్త్ర పరిశోధన కంటే సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించడం, ప్రదర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.
* గ్రహాంతర, సుదూర రోదసి యానంలో అనేక సంక్లిష్ట అంశాలుంటాయి. ఇస్రో ఈ ప్రయోగం ద్వారా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడమే కాకుండా దీని ఆధారంగా భవిష్యత్ యాత్రలకు పటిష్టమైన బాటలు వేసుకుంటోంది.
ఆకస్మిక విజయం కాదు..
రోదసి రంగంలోకి భారత్ 60వ దశకం ప్రారంభంలోనే అడుగుపెట్టింది. భారత్ ఒకవైపు పేదరికాన్ని ఎదుర్కొంటూనే మరోవైపు అంతరిక్షంలో వాతావరణ పరిశోధనల కోసం రాకెట్లను ప్రయోగించింది. 1975 లో తొలి ప్రయోగాత్మక ఉపగ్రహం 'ఆర్యభట్ట'ను విజయవంతంగా ప్రయోగించింది.
* 1980 లో ఇన్‌శాట్‌తో సహా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టింది. వాతావరణ పరిశోధన, కమ్యూనికేషన్ టెలివిజన్, టెలిఫోన్ మొదలైన ఆధునిక అవసరాలు తీర్చడమే కాకుండా అటవీ అధ్యయనం, కరవు, వరద ప్రాంతాల గుర్తింపు, విద్య, ఆరోగ్యం లాంటి అవసరాలను తీర్చడంలో కూడా భారత్ రోదసి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది.
ఆంక్షలను అధిగమించి..
మన శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీలో వాడిన వికాస్ ఇంజిన్‌ను దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు. కానీ జీఎస్ఎల్వీ ప్రయోగానికి సంబంధించిన క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానం, క్రయోజెనిక్ ఇంజిన్ల కోసం ఇస్రో రష్యాకు చెందిన గ్లావ్ కాస్మోస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే అమెరికా ఈ ఒప్పందానికి అడ్డుతగిలింది. భారత్, రష్యాలకు చెందిన స్పేస్ ఏజెన్సీలపై ఆంక్షలు విధించింది. భారత్ ఈ టెక్నాలజీని క్షిపణుల కోసం వాడుతోందని అభియోగాన్ని మోపింది.
* క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ (MTCR) కూడా భారత్‌పై వివిధ ఆంక్షలు విధించింది. దీంతో మన శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో దేశీయంగానే క్రయోజెనిక్ టెక్నాలజీని రూపొందించారు. ఇప్పుడు మంగళ్‌యాన్ ప్రయోగంలో ఉపయోగించిన రోదసి వాహక నౌక, ఉపగ్రహం కూడా దేశీయ పరిజ్ఞానంతోనే రూపొందించినవే.
మంగళ్‌యాన్‌తో పెరిగిన మార్కెట్
మార్స్ మిషన్ దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా రోదసి సాంకేతిక పరిజ్ఞానంలో భారీగా లాభాలను అందిస్తోంది. ప్రస్తుతం రోదసి వాహక నౌకల ద్వారా జరిపే ప్రయోగాలకు ప్రపంచ మార్కెట్‌లో ఉన్న విలువ మూడువేల కోట్ల డాలర్లు. వీటిపై అమెరికా, యూరోపియన్ దేశాల పెత్తనమే ఎక్కువ. అయితే ఇప్పుడిప్పుడే భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలు ఈ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయి.
* ఇప్పటికే పీఎస్ఎల్వీ రోదసి మార్కెట్‌లో మంచి ఆదాయాన్ని అందిస్తోందని, తాజాగా మంగళ్‌యాన్ విజయంతో ఇది మరింత పెరగనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో చంద్రమండలానికి, అంగారక గ్రహానికీ జీఎస్ఎల్వీ ద్వారా భారత్ చేరుకోగలిగితే ఈ మార్కెట్‌ను మరింతగా విస్తరించవచ్చు. భవిష్యత్‌లో చంద్రుడిపై ఉన్న హీలియం, అంగారకుడిపై ఉన్న మీథేన్, ఇతర ఖనిజాలను తీసుకు రాగలిగితే అధిక లాభాలు పొందవచ్చు.
బలపడనున్న బంధాలు..
ఇప్పటికే భారత్ రోదసి రంగంలో ప్రపంచ దేశాలకు తన సహకారాన్ని అందిస్తోంది. మన తొలి ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్యభట్టను ఆనాటి సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీలతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు అనేక అవగాహనలు కుదిరాయి. చంద్రయాన్-1 లో నాసా పరికరాలను కూడా ప్రయోగించారు. మంగళ్‌యాన్ విజయవంతం కావడంతో రోదసి రంగంలో ఈ అంతర్జాతీయ సంబంధాలు మరింతగా బలపడనున్నాయి.
* నాసాకు చెందిన మావెన్, భారత్ మంగళ్‌యాన్ దాదాపు ఒకేసారి అంగారక కక్ష్యలోకి ప్రవేశించాయి. ఇరుదేశాలూ ఈ మార్స్ మిషన్‌లను పంపించే శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం అందించుకుంటున్నాయి.
* ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా రోదసి రంగంలో పరస్పర సహకారంపై ఒప్పందం కుదరనుంది. భారత్, అమెరికా సంయుక్తంగా రాడార్ శాటిలైట్ మిషన్‌ను చేపట్టనున్నాయి.
* అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంపై ఇటీవల భారత్, చైనా మధ్య కూడా అవగాహనా ఒప్పందం కుదిరింది.
చైనాను మించిన తీరు..
20 వ శతాబ్దపు రోదసి రంగంలో అమెరికాకు, నాటి సోవియట్ యూనియన్‌కు మధ్య పోటీ ఉండేది. అయితే అది 21 వ శతాబ్దం నాటికి ఆసియా దేశాల మధ్య పోటీగా మారింది.
* ఇతర రంగాల మాదిరే రోదసి రంగానికి సంబంధించిన అనేక అంశాల్లో చైనా భారత్ కంటే ముందుంది. మనదేశంతో పోలిస్తే చైనాకు శక్తిమంతమైన వాహక నౌకలు, భారీ ఉపగ్రహాలు, అధిక సంఖ్యలో ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి.
* 2003 లో చైనా తొలి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించింది. భారత్ రోదసిలోకి వ్యోమగామిని పంపించడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. చంద్రమండల యాత్రలో కూడా భారత్ కంటే చైనా ముందుంది. కానీ అంగారకగ్రహ యాత్రలో మాత్రం భారత్ బలమైన పొరుగుదేశాన్ని పక్కకు నెట్టగలిగింది.
* 2012 లో చైనా తొలి మార్స్ మిషన్ Yinghuo-1 విఫలమైంది. 1998 లో జపాన్ జరిపిన అంగారక యాత్ర కూడా నిరాశనే మిగిల్చింది.
అనంతర దశ ...
తొలి ప్రయత్నంలోనే భారత్ మంగళ్‌యాన్‌ను విజయవంతంగా అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనిపై ఉన్న పరికరాలతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు మొదలుపెట్టారు. భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ మొదలైన దేశాల్లో ఉన్న గ్రౌండ్ స్టేషన్స్ కూడా మంగళ్‌యాన్‌ను మానిటర్ చేస్తున్నాయి.
* అమెరికా మాదిరే గ్రహాల మధ్య రోదసి యాత్రలు జరిపి మౌలిక, శాస్త్ర పరిశోధనలకు భారీగా నిధులు వెచ్చించే సామర్థ్యం భారత్‌కు లేదు. అందుకే భారత్ ఈ పరిజ్ఞానాన్ని నిర్దిష్టంగా దేశ ప్రజల సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగించనుంది.
* ప్రస్తుతం జరిపిన అంగారక యాత్రను మూడు దశల్లో చేపట్టారు. మంగళ్‌యాన్‌ను మొదటి దశలో భూకక్ష్యలోకి, రెండో దశలో సౌర కక్ష్యలోకి, మూడో దశలో అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. మంగళ్‌యాన్‌ను నేరుగా అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టకపోవడానికి కారణం దాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) ద్వారా ప్రయోగించడమే.
* అనేక సంవత్సరాలుగా భారత్ పీఎస్ఎల్వీ ద్వారా జరిపిన ప్రయోగాలన్నీ దాదాపు విజయవంతం అయ్యాయి. అందుకే ఇస్రో మంగళ్‌యాన్ కోసం పీఎస్ఎల్వీనే ఎంచుకుంది. భవిష్యత్‌లో మరింత సమర్థంగా జీఎస్ఎల్వీ ద్వారా గ్రహాంతర యాత్రలను భారత్ చేపట్టనుంది.
* పీఎస్ఎల్వీతో పోలిస్తే జీఎస్ఎల్వీ చాలా శక్తిమంతమైన రోదసి వాహక నౌక. సుదూర, స్థిర కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టగల సామర్థ్యం దీని సొంతం. అయితే భారత్ జరిపిన జీఎస్ఎల్వీ ప్రయోగాలు ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. అందుకే ఇప్పుడు దీన్ని ఉపయోగించలేదు. భవిష్యత్‌లో జరిపే అంగారక యాత్రలు నేరుగానే జరుగుతాయి. అంగారక, చంద్రమండల యాత్రల్లో కూడా భారత్ జీఎస్ఎల్వీని ఉపయోగించాల్సి ఉంది.

1 comment:

  1. excellent content for class 12th boards exams.
    i think this is the only site which provide the explanation of the answers .would suggest this for maths clases
    http://www.kidsfront.com/

    ReplyDelete