Sunday, October 11, 2015

తెలంగాణ రాష్ట్రం - సంక్షేమ ప‌థ‌కాలు


* తెలంగాణ ప్రభుత్వం సామాజిక భాగస్వామ్యంతో వికేంద్రీకరణ నమూనాలో 'మిషన్ కాకతీయ' పేరిట రాష్ట్రంలో ఉన్న 46,531 చెరువుల (చిన్న తరహా సాగునీటి వనరులు) పునరుద్ధరణ కోసం బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
* ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవ్గం, 'సదాశివనగర్ గ్రామం' లోని పాతచెరువులో ప్రారంభించారు.
* ఈ కార్యక్రమం కింద రానున్న అయిదేళ్లలో రూ.20,000 కోట్ల అంచనా వ్యయంతో అన్ని చెరువులను పునరుద్ధరించాలనేది లక్ష్యం.
* చెరువుల పునరుద్ధరణలో కింది అంశాలు భాగంగా ఉంటాయి.
1) పూడిక తొలగింపు - నిల్వ సామర్థ్యాన్ని పెంచడం.
2) పూడిక మట్టిని పొలాల్లో పునర్వినియోగించడం.
3) చెరువులకు సంబంధించిన పిల్ల కాలువల పునరుద్ధరణ.
4) గట్లు, తూములు, అడ్డుకట్టల మరమ్మతులు.
5) సాగునీటి కాలువల రీ-సెక్షనింగ్.
వర్తమానాంశాలు - ప్రాంతీయం
మిషన్ కాకతీయ ఆవశ్యకత:
* రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి చెరువుల వ్యవస్థ కీలకమైంది. భూసార, జలసంరక్షణ, వరదల నియంత్రణ, కరవు నివారణ, పశుగణం, గృహ వినియోగాలు, భూగర్భజలాలను పెంచడం, శీతోష్ణస్థితి, పర్యావరణ పరిరక్షణలకు చెరువుల పునరుద్ధరణ దోహదపడుతుంది.
* 2014-15 నుంచి మొదలయ్యే ఈ పథకంలో భాగంగా అయిదేళ్ల కాలంలో ఏడాదికి 20 శాతం చొప్పున మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరిస్తారు.
కళ్యాణ లక్ష్మి 
* తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఆర్థిక కుంగుబాటు లేకుండా చేయడానికి వివాహ సమయంలో యువతులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది.
* ఈ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన అవివాహిత యువతులకు వివాహ సమయంలో జీవితంలో ఒకసారి రూ.51,000 ఆర్థిక సాయం అందిస్తారు.
* ఈ పథకం 2014 అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ పథకం కింద లబ్ధి పొందే తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలకు మించకూడదు.
షాదీ ముబారక్
అవివాహిత మైనారిటీ కమ్యూనిటీ యువతులందరికీ వివాహ సందర్భంగా వారి కుటుంబ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం 'షాదీ ముబారక్' పథకాన్ని ప్రవేశపెట్టింది.
* ఈ పథకం 2014 అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* వివాహానికి కనీసం నెల ముందు దరఖాస్తు చేసుకునే ప్రతి మైనారిటీ బాలికకు ఒకసారి రూ.51,000 ఆర్థిక సాయం అందిస్తారు.
* ఈ మొత్తాన్ని పెళ్లికూతురు పేరిట అకౌంట్ పేయీ చెక్కు ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
ఆరోగ్య లక్ష్మి 
* గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో 'ఆరోగ్యలక్ష్మి' కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
* ఈ పథకం 2015 జనవరి 1 నుంచి అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ అమల్లోకి వచ్చింది.
* ఈ కార్యక్రమం కింద గర్భిణులకు, బాలింతలకు ప్రతి రోజూ ఒక పూట భోజనాన్ని సమకూరుస్తారు.
* రాష్ట్రంలో 5,66,917 మంది మహిళలకు ఈ ప్రయోజనాన్ని కల్పించారు.
మహిళలకు రక్షణ 
* రాష్ట్రంలోని మహిళలు, బాలికల భద్రత, రక్షణ, సంరక్షణ, సాధికారతల కోసం తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్ పేరుతో ఒక సంస్థను 2014 నవంబరు 25న రిజిస్టర్ చేశారు.
షీ క్యాబ్స్ 
* మహిళా డ్రైవర్లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 'షీ క్యాబ్స్' పేరుతో 2015 సెప్టెంబరు 8న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది.
* అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ప్రతి టాక్సీకి 35 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.

No comments:

Post a Comment