Sunday, August 9, 2015

100 బిలియన్ డాలర్లు (రూ.6.50 లక్షల కోట్లు) మూలనిధితో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధు (ఐఎంఎఫ్)లకు పోటీగా బ్రిక్స్ దేశాల సారథ్యంలో కొత్త బ్యాంకు 'ది న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు' (ఎన్‌డీబీ) ప్రారంభోత్సవం

జులై - 21,2015

100 బిలియన్ డాలర్లు (రూ.6.50 లక్షల కోట్లు) మూలనిధితో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధు (ఐఎంఎఫ్)లకు పోటీగా బ్రిక్స్ దేశాల సారథ్యంలో కొత్త బ్యాంకు 'ది న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు' (ఎన్‌డీబీ) ప్రారంభోత్సవం చైనాలోని షాంఘైలో ఘనంగా జరిగింది.      
» వర్థమాన దేశాలు ప్రపంచ బ్యాంకు, ఐఎమ్ఎఫ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ బ్యాంకు ఏర్పాటైంది. వర్థమాన మార్కెట్ల నుంచి పుట్టుకొచ్చిన తొలి అతిపెద్ద ఆర్థిక సంస్థ కూడా ఇదే.     
 » తొలి అయిదేళ్ల పాటు ఎన్‌డీబీ అధ్యక్షుడిగా భారత్‌కు చెందిన కె.వి.కామత్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.      
» కె.వి.కామత్, చైనా ఆర్థికమంత్రి లూ జివే, షాంఘై నగర మేయర్ యాంగ్ షియాంగ్‌లు ఎన్‌డీబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.     
 » ఎన్‌డీబీకి శుభాకాంక్షలు చెప్పిన తొలి వ్యక్తి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్.     
 » 2012లో దిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో వర్థమాన దేశాలకు ఒక బ్యాంకు ఉండాల్సిన అవసరాన్ని భారత్ నొక్కి చెప్పింది.       
» ప్రాథమికంగా అయిదు వ్యవస్థాపన సభ్య దేశాలు (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) కలిసి సమాన నిష్పత్తిలో 50 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.25 లక్షల కోట్లు) మూలధనాన్ని సమకూరుస్తాయి.      
» మరో 100 బిలియన్‌డాలర్ల అత్యయిక నిధి ఈ బ్యాంకుకు మద్దతుగా ఉంటుంది. 41 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.66 లక్షల కోట్లు)ను చైనా సమకూరుస్తుండగా భారత్, రష్యా, బ్రెజిల్‌లు 18 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.2 లక్షల కోట్లు) చొప్పున, దక్షిణాఫ్రికా 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.25 లక్షల కోట్లు) చొప్పున ఇస్తాయి.      
» ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకుల తరహాలో ఏ సభ్యదేశానికీ వీటో పవర్ ఉండదు. అయిదేళ్లకోసారి రొటేషన్ పద్ధతిన అధ్యక్ష పదవి మారుతుంటుంది.

భారత్ - బంగ్లాదేశ్ మధ్య కుదిరిన భూ బదలాయింపు ఒప్పందం

ఆగస్టు - 1,2015

¤ భారత్ - బంగ్లాదేశ్ మధ్య కుదిరిన భూ బదలాయింపు ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు 70 ఏళ్లుగా ఏ దేశానికీ చెందని వ్యక్తులుగా కొనసాగిన 51 వేల మందికి తొలిసారిగా గుర్తింపు లభించింది. భారత్ - బంగ్లాదేశ్ మధ్య నివసిస్తూ ఏ దేశానికీ చెందనివారిగా కనీస సౌకర్యాలకు నోచుకోకుండా అవమానాల పాలైన వీరు ప్రస్తుతం తమకు నచ్చిన దేశాన్ని ఎంచుకున్నారు.
       
      
       
       

» ఇరు దేశాల మధ్య 162 ప్రాంతాల బదిలీ జరిగింది. వీటిలో 111 భారత్‌కు, 51 బంగ్లాదేశ్‌కు చెందినవి. ఈ ప్రాంతాల్లో దశాబ్దాలుగా గుర్తింపులేని జీవనం గడిపిన దాదాపు 51 వేల మందిలో 14 వేల మంది భారతీయ పౌరులయ్యారు. వీరు ఇప్పటివరకు నివసిస్తూ వచ్చిన 51 బంగ్లాదేశ్ ప్రాంతాలు (7,110 ఎకరాలు) ప్రస్తుతం భారత్‌లో విలీనమయ్యాయి. అదే విధంగా పశ్చిమ్‌బంగ రాష్ట్రంలోని కూచ్ బెహార్ జిల్లాకు సమీపంలోని 111 భారతీయ ప్రాంతాలు (17,160 ఎకరాలు) ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విలీనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో దాదాపు అందరూ బంగ్లాదేశ్ పౌరులయ్యారు. వెయ్యి మంది మాత్రం భారత్‌లో ఉంటామని ముందుకొచ్చారు.
 » భూ బదలాయింపు అమలు నేపథ్యంలో ఇక వీరందరికీ ఆయా దేశాల పౌరసత్వ పత్రాలు లభించనున్నాయి. తద్వారా పాఠశాల, ఆసుపత్రి, కరెంటు, మంచినీరు లాంటి సౌకర్యాలతో పాటు ఆస్తి కొనుగోలు లాంటి లావాదేవీలకు, ప్రభుత్వోద్యోగాలకు అర్హత లభించనుంది.
» భారత్ - బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనా సమక్షంలో ఇటీవల ఢాకాలో భారత ప్రధాని బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా 'భూ సరిహద్దు ఒప్పందం' పై సంతకాలయ్యాయి. దీని ఫలితంగానే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
» 1947 నాటి భారత ఉపఖండం విభజన సమయంలో తూర్పు పాకిస్థాన్ (తర్వాతి కాలంలో బంగ్లాదేశ్)కు దగ్గరగా ఉన్న ప్రాంతాలు భారత్‌లో, భారత్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలు తూర్పు పాకిస్థాన్‌లో చేరాయి. దీనివల్ల చొరబాట్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలు ఏ దేశానికీ చెందనివారైపోయారు. తూర్పు పాకిస్థాన్ 1971లో పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన తర్వాత ఆ దేశ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్, భారత్ ప్రధాని ఇందిరా గాంధీ మధ్య 1974లో భూ ఒప్పందం కుదిరింది. అయితే మరుసటి ఏడాదే షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు. తదనంతర కాలంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోవడంతో ఈ సమస్య పరిష్కారం కాలేదు.

Sunday, February 15, 2015

ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన 'భారత పరివర్తన జాతీయ సంస్థ (నీతి ఆయోగ్)' పాలక మండలి తొలి సమావేశం

 ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన 'భారత పరివర్తన జాతీయ సంస్థ (నీతి ఆయోగ్)' పాలక మండలి తొలి సమావేశం దిల్లీలో జరిగింది.       
» నీతి ఆయోగ్ ఛైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరఫున ముఖ్యమంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. 'సబ్ కా సాథ్.....సబ్ కా వికాస్ (అందరితో కలిసి.....అందరి వికాసం కోసం)' అనే నినాదంతో కేంద్రం-రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలని ప్రధాని పిలుపునిచ్చారు.       
» నీతి ఆయోగ్ కింద ముఖ్యమంత్రులతో మూడు ఉపబృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
ఆ బృందాలివే...ఉపబృందం - 1: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత నిధులతో అమల్లో ఉన్న 66 పథకాల్లో ఏవి కొనసాగించాలి? ఏ పథకాలను రాష్ట్రాలకు అప్పగించాలి? వేటిని పూర్తిగా రద్దు చేయవచ్చు? అనేది ఇది అధ్యయనం చేస్తుంది.
ఉపబృందం - 2: రాష్ట్రాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల కల్పనపై ఇది అధ్యయనం చేస్తుంది.
ఉపబృందం - 3: స్వచ్ఛభారత్ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా వ్యవస్థాగతమైన కార్యాచరణను రూపొందించడం ఈ బృందం లక్ష్యం.       
» పేదరికాన్ని పారద్రోలడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ఉత్పత్తిని పెంచడం కోసం రెండేసి కార్యసాధక బృందాలను (టాస్క్‌ఫోర్స్‌లు) ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలను ప్రధాని కోరారు.       
» ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు సమావేశానికి హాజరయ్యారు.       
» నీతి ఆయోగ్ సమావేశానికి పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. కీలకమైన ఈ సమావేశంలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.       
» కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ అంశాల్లో నీతి ఆయోగ్ సిఫార్సులు చేస్తుందనీ, వాటిఅమలును ఆయా ప్రభుత్వాలకే వదిలిపెడుతుందని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. శాశ్వత ప్రాతిపదికన పనిచేసే 'భారత జట్టు (Team India)' సహా పరిశోధన, నైపుణ్య సలహాలు లాంటి వివిధ విభాగాలు ఉండే ఈ సంస్థలో నిపుణులు, వివిధ రంగాల ప్రతినిధులు తమ మేధస్సును వినిమోగిస్తారని వివరించింది.