Friday, June 10, 2016

మార్కుల విద్య... మార్పులు మిథ్య!

* ‘ప్రాథమిక’ సంస్కరణలు కీలకం... 
భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందడానికి మరీ ఇంత ఆలస్యమవుతోందేం? ఆర్థికాభివృద్ధి పథంలో చైనా పరుగులు చూసి ప్రతి ఒక్కరూ వేసుకొంటున్న ప్రశ్న ఇది. ఈ పరుగులో భారత్‌ వెనకబడటానికి అనేక కారణాలున్నా వాటిలో ప్రధానమైంది- లోపభూయిష్టమైన మన విద్యావ్యవస్థ. కొంతకాలం నుంచి అన్ని రంగాల్లో సంభవిస్తున్న సమూల మార్పులకు దీటుగా భారతీయ బాలలు, యువతీయువకులను సిద్ధం చేయడంలో మన విద్యావ్యవస్థ విఫలమైంది. 21వ శతాబ్దిలో పెరుగుతున్న సవాళ్లను ఎలా తట్టుకోవాలో తెలియక తెల్లమొహం వేస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రస్తుత వృత్తి ఉద్యోగాలకు క్రమంగా మంగళం పాడుతుంటే, వాటి స్థానంలో రాబోయే ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏయే కొత్త టెక్నాలజీలు ఉద్భవిస్తాయో, అవి ఎలాంటి రాజకీయ ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకువస్తాయో, నూతన వృత్తిఉద్యోగాల స్వరూప స్వభావాలు ఎలా ఉండబోతున్నాయో మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు. అయినాసరే ఎలాంటి మార్పులు వచ్చినా తట్టుకుని రాణించేలా మన విద్యార్థులను సిద్ధం చేసే సత్తా మన విద్యావ్యవస్థలో ఏ మాత్రం కనిపించడం లేదు. పైగా భారతీయ విద్యాయంత్రాంగం రానురానూ శిథిలమైపోతోంది. ఈ క్షీణదశ నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను రక్షించాలన్న స్పృహ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొరవడుతోంది.

కొరవడిన నియంత్రణ 
ఆర్థిక సరళీకరణ ఫలాలను అందుకున్న సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలు నాణ్యమైన విద్యను డిమాండు చేస్తున్నాయి. దీన్ని సర్వశిక్షా అభియాన్‌ కాని, రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్‌ కాని తీర్చలేకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు. వారిని చూసి పేద, దిగువ మధ్యతరగతి వర్గాలూ అదేబాట పడుతున్నాయి.ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో తమ విద్యార్థులు భారీగా ప్రవేశాలు సాధిస్తున్నారంటూ ప్రైవేటు సంస్థలు చేస్తున్న ఆర్భాటం మరింతమందిని ఈ సంస్థలవైపు ఆకర్షిస్తోంది. కానీ, ప్రైవేటు విద్య మహా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఈ ప్రైవేటు సంస్థలను ప్రధానంగా రాజకీయ నాయకులు, పలుకుబడి గలవారే నిర్వహిస్తున్న దృష్ట్యా అవి తీసుకునే విరాళాల(డొనేషన్ల) మీద కాని, వసూలుచేసే రుసుముల మీద కాని ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది. ప్రైవేటు విద్య నాణ్యమైందనే భావన జనంలో పాదుకుపోవడంతో ఈ సంస్థలకు గిరాకీ విజృంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు నాసిగా ఉండటంతో ప్రైవేటు విద్యాసంస్థల పట్ల జనాదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఈ గిరాకీ-సరఫరా చక్రంలో సామాన్యుడు నలిగిపోతున్నాడు. ప్రైవేటు విద్య అతడి పిల్లలకు అందని మాని పండు అయింది. విద్య ఓ వ్యాపార సరకుగా మారి, కిండర్‌ గార్టెన్‌ సీట్లూ బోలెడు డబ్బు ధారపోసి కొనుక్కోవలసిన అగత్యమేర్పడింది. ఆంగ్ల మాధ్యమం కోసం అందరూ ఆరాటపడటం ఈ ధోరణిని మరింత ఎగదోస్తోంది. పిల్లలకు మంచి చదువు చెప్పించడం కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. అనేకమంది తమకున్న కొద్దిపాటి ఆస్తులు కూడా తెగనమ్ముకుంటున్నారు. ఏటా పెరిగిపోతున్న ట్యూషన్‌ ఫీజులు తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. నర్సరీ స్కూళ్ల చదువు సైతం ఖరీదైనదిగా మారింది. అయిదు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వార్షిక ఆదాయం గల కుటుంబాలు అందులో 20శాతం పాఠశాల చదువుకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. కిండర్‌ గార్టెన్‌ నుంచి పదో తరగతి వరకు చదువు చెప్పి, ఆ తరవాత మీ డిపాజిట్‌ మీకు వాపసు చేస్తామంటూ కొన్ని విద్యాసంస్థలు వందలాది తల్లిదండ్రులకు టోపీ వేస్తున్నాయి. రుసుములకు తోడు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, రవాణా పేరిట డబ్బు పిండటం ప్రైవేటు విద్యాసంస్థలకు పరిపాటి. హైదరాబాద్‌ మహానగర పరిధిలోని మూడువేల పైచిలుకు ప్రైవేటు పాఠశాలల్లో సగానికి ఆట మైదానాలు లేవు. ప్రైవేటు విద్యాసంస్థల పాఠ్య ప్రణాళికల్లో వ్యాయామానికి స్థానం కల్పించడం లేదు. పాఠశాల అంటే బట్టీ చదువుల నిలయం కారాదు. అది విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి బాట వేయాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దిగనాసిగా ఉండటంవల్లే విద్యార్థులు ప్రైవేటు ట్యూషన్లు, కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోందని జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ఇటీవల తేల్చింది. ఫలితంగా ఒక కుటుంబ ఆదాయంలో 11-12శాతం ట్యూషన్లు, కోచింగ్‌కే పోతోంది. నేడు 7.1కోట్లమంది, అంటే మొత్తం విద్యార్థుల్లో 26శాతం ట్యూషన్లు తీసుకుంటున్నారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులిద్దరూ ఉన్నారు. వైద్య, ఇంజినీరింగ్‌, చార్టర్డ్‌ ఎకౌంటెన్సీ చదువుల పట్ల తల్లిదండ్రుల్లో ఉన్న మోజే కోచింగ్‌ సెంటర్ల విస్తరణకు దోహదం చేస్తోంది. తల్లిదండ్రులు తమ కలలు, కోరికలను పిల్లల మీద రుద్దకూడదని హితవు చెబుతూ కోట(రాజస్థాన్‌) కలెక్టర్‌ బహిరంగ లేఖ రాశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఫీజులు, పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ పేరిట భారీ మొత్తాలు వసూలుచేసే ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఉపాధ్యాయులకు సరైన జీతభత్యాలు చెల్లించడంలో మాత్రం అదే జోరు చూపడం లేదు. వారికి సామాజిక భద్రత లేదు. నిర్ణీత పని గంటలూ లేవు. అనేక స్కూళ్లు నైపుణ్యం లేని కూలీలకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలకన్నా తక్కువ మొత్తాలను ఉపాధ్యాయులకు చెల్లిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఉపాధ్యాయులు తమ విజ్ఞానస్థాయిని పెంచుకోవడానికి ఎలా కృషి చేయగలుగుతారు?
ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 25శాతం సీట్లు పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలని విద్యాహక్కు చట్టంలోని 12వ సెక్షన్‌ నిర్దేశిస్తున్నా, అది అమలుకు నోచుకోవడం లేదు. ఆదాయపరంగా ఇతరత్రా అసమానతలను తగ్గించి అందరికీ సమానావకాశాలు, సౌకర్యాలను కల్పించాలని రాజ్యాంగంలోని 38 (2) అధికరణ పేర్కొంటున్నా ప్రభుత్వాలు సాధించిందేమీ లేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యాహక్కు చట్టాన్ని వర్తింపజేయాల్సి ఉంది. దీని ప్రకారం ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉండాలి. మరుగుదొడ్లు, తాగునీటి వసతి, తరగతి గదుల నిర్మాణం, విద్యార్థుల భద్రత కోసం ప్రహరీగోడ నిర్మాణం వంటి నిబంధనలను కూడా విద్యాసంస్థలు పాటించడంలేదు.
ఒకప్పుడు ఉన్నత విద్య కోసం చైనా విద్వాంసులు భారతదేశానికి వచ్చేవారు. నేడు పరిస్థితి తారుమారైంది. ప్రపంచంలో 100 అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో తరచూ చైనా యూనివర్సిటీలు స్థానం సంపాదిస్తుండగా, భారత్‌ నుంచి కనీసం ఒక్క సంస్థ అయినా ఆ గౌరవం దక్కించుకోలేకపోయింది. చైనా ప్రాథమిక పాఠశాల స్థాయినుంచే పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటే, భారత్‌లో కనీసం ఉపాధ్యాయులు కూడా లేని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇప్పటికీ పాఠశాలలు లేని గ్రామాలు కొల్లలు. సర్వశిక్ష అభియాన్‌ పథకాన్ని చేపట్టి 14ఏళ్లు, విద్యాహక్కు చట్టం తీసుకొచ్చి ఎనిమిదేళ్లయినా ఇంకా ఈ దుస్థితి నెలకొని ఉండటం దారుణం. పటిష్ఠ విద్యావ్యవస్థ లేనిదే భారతదేశం విజ్ఞానాధారిత సమాజంగా ముందడుగు వేయలేదు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్పడంకన్నా ఇతర కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు ఏకరూప దుస్తులు అమరేలా చూడటం, పారిశుద్ధ్య రక్షణ, బాలలకు మందుల పంపిణీ, జనగణన, ఇంటింటి సర్వేలు, ఎన్నికల విధులు తదితరాలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను నిజానికి ప్రభుత్వ పథకాల సమన్వయకర్తలని పిలవాలి. ఇలా విద్యేతర పనుల ఒత్తిడి పెరిగిపోవడంతో టీచర్లు విద్యార్థులకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. పైగా అనేక ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల కొరత ఉంది. అదే ప్రైవేటు విద్యాసంస్థలను చూస్తే అక్కడ ఉపాధ్యాయులకు పాలనా వ్యవహారాలతో నిమిత్తం ఉండదు. వారు తమ పూర్తి సమయాన్ని, శక్తియుక్తులను విద్యార్థుల చదువుసంధ్యల మీదే కేంద్రీకరించాల్సి ఉంటుంది. అయినా, ఏవో కొన్ని పేరున్న విద్యా సంస్థల్లో తప్ప ఇతర ప్రైవేటు సంస్థల్లో టీచర్ల జీతభత్యాలు చాలా తక్కువ. ఈ వాతావరణంలో ప్రతిభావంతులు ఉపాధ్యాయ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనబరచడంలేదు. ఏ దారీ లేదనుకున్నప్పుడు మాత్రమే బోధనా వృత్తి ఎంచుకొంటున్నారు.

దారిచూపిన న్యాయస్థానం 
చాలినంతమంది ఉపాధ్యాయులు లేక పలు ప్రభుత్వ పాఠశాలలు మూతబడిపోయాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని అలహాబాద్‌ హైకోర్టు నిరుడు ఆగస్టులో జారీచేసిన ఆదేశం అందరికీ శిరోధార్యం. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు పెంచే ముందు విద్యాశాఖాధికారుల అనుమతి తీసుకోవాలంటూ ఇటీవల దిల్లీ ప్రభుత్వం జారీచేసిన ఆదేశమూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం. తల్లిదండ్రులు కూడా అధిక మార్కులే విద్యకు పరమావధి అని భావించరాదు. పిల్లల వ్యక్తిత్వం అన్ని విధాలుగా వికసించేలా శ్రద్ధ వహించాలి. వేగంగా మారిపోతున్న 21వ శతాబ్ది ప్రపంచంలో వారు రాణించగలిగేలా తీర్చిదిద్దాలి. దీనికి ఓం ప్రథమంగా మన ప్రాథమిక విద్యావ్యవస్థను పటిష్ఠపరచాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచాలి. అన్నింటినీ మించి విద్యకు అధిక నిధులు కేటాయించాలి. అమెరికా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 5.4శాతం, బ్రెజిల్‌లో 5.7శాతం విద్యకోసం వెచ్చిస్తుండగా, భారత్‌ తన జీడీపీలో కేవలం మూడు శాతం ఖర్చు చేస్తోంది. ఈ లోటుపాట్లను సరిదిద్దాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రహించారు. ‘ఇంతవరకు ప్రభుత్వం దేశమంతటికీ విద్యా సౌకర్యాలను విస్తరించడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. పిల్లలను పాఠశాలలకు పంపడంతోనే పని జరగదు. వారు విలువైన అంశాలు నేర్చుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి’ అంటూ ప్రధాని ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భవిష్యద్దర్శనం చేశారు. ఆయన పలుకులు ఆచరణ రూపం ధరిస్తే పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది!

No comments:

Post a Comment