ఆగస్టు - 1,2015
¤ భారత్ - బంగ్లాదేశ్ మధ్య కుదిరిన భూ బదలాయింపు ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో దాదాపు 70 ఏళ్లుగా ఏ దేశానికీ చెందని వ్యక్తులుగా కొనసాగిన 51 వేల మందికి తొలిసారిగా గుర్తింపు లభించింది. భారత్ - బంగ్లాదేశ్ మధ్య నివసిస్తూ ఏ దేశానికీ చెందనివారిగా కనీస సౌకర్యాలకు నోచుకోకుండా అవమానాల పాలైన వీరు ప్రస్తుతం తమకు నచ్చిన దేశాన్ని ఎంచుకున్నారు.
» ఇరు దేశాల మధ్య 162 ప్రాంతాల బదిలీ జరిగింది. వీటిలో 111 భారత్‌కు, 51 బంగ్లాదేశ్‌కు చెందినవి. ఈ ప్రాంతాల్లో దశాబ్దాలుగా గుర్తింపులేని జీవనం గడిపిన దాదాపు 51 వేల మందిలో 14 వేల మంది భారతీయ పౌరులయ్యారు. వీరు ఇప్పటివరకు నివసిస్తూ వచ్చిన 51 బంగ్లాదేశ్ ప్రాంతాలు (7,110 ఎకరాలు) ప్రస్తుతం భారత్‌లో విలీనమయ్యాయి. అదే విధంగా పశ్చిమ్‌బంగ రాష్ట్రంలోని కూచ్ బెహార్ జిల్లాకు సమీపంలోని 111 భారతీయ ప్రాంతాలు (17,160 ఎకరాలు) ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విలీనమయ్యాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో దాదాపు అందరూ బంగ్లాదేశ్ పౌరులయ్యారు. వెయ్యి మంది మాత్రం భారత్‌లో ఉంటామని ముందుకొచ్చారు.
» భూ బదలాయింపు అమలు నేపథ్యంలో ఇక వీరందరికీ ఆయా దేశాల పౌరసత్వ పత్రాలు లభించనున్నాయి. తద్వారా పాఠశాల, ఆసుపత్రి, కరెంటు, మంచినీరు లాంటి సౌకర్యాలతో పాటు ఆస్తి కొనుగోలు లాంటి లావాదేవీలకు, ప్రభుత్వోద్యోగాలకు అర్హత లభించనుంది.
» భారత్ - బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్రమోదీ, షేక్ హసీనా సమక్షంలో ఇటీవల ఢాకాలో భారత ప్రధాని బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా 'భూ సరిహద్దు ఒప్పందం' పై సంతకాలయ్యాయి. దీని ఫలితంగానే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
» 1947 నాటి భారత ఉపఖండం విభజన సమయంలో తూర్పు పాకిస్థాన్ (తర్వాతి కాలంలో బంగ్లాదేశ్)కు దగ్గరగా ఉన్న ప్రాంతాలు భారత్‌లో, భారత్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలు తూర్పు పాకిస్థాన్‌లో చేరాయి. దీనివల్ల చొరబాట్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజలు ఏ దేశానికీ చెందనివారైపోయారు. తూర్పు పాకిస్థాన్ 1971లో పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించిన తర్వాత ఆ దేశ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్, భారత్ ప్రధాని ఇందిరా గాంధీ మధ్య 1974లో భూ ఒప్పందం కుదిరింది. అయితే మరుసటి ఏడాదే షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు. తదనంతర కాలంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోవడంతో ఈ సమస్య పరిష్కారం కాలేదు.
No comments:
Post a Comment