Tuesday, October 21, 2014

ఎబోలా వైరస్ పూర్తి వివరాలు (Full details of the Ebola virus)

పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో ఎబోలా వైరస్ బారినపడి సుమారు 950 మంది మరణించారు.   
»    వైరస్ ప్రబలిన దేశాల్లో వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు రూ.1500 కోట్ల తక్షణ సాయం ప్రకటించాయి.   
»    వైరస్ బారిన పడిన రిపబ్లిక్ ఆఫ్ గినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌కు ఔషధాల కొనుగోలుకు రూ.30 లక్షల చొప్పున సాయాన్ని భారత్ ప్రకటించింది.   
»    వైరస్ ప్రబలిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ, విమానాశ్రయాల వద్ద క్షుణ్నంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని భారత్ నిర్ణయించింది.  
 »    మనిషికి అత్యంత ప్రమాదకర వైరస్‌లలో ఒకటిగా ఎబోలా వైరస్‌ను పరిగణిస్తారు. మొదటిసారిగా కాంగోలోని ఎబోలా నది సమీపంలో 1976లో ఇది కనిపించింది. అందుకే దీనికి ఎబోలా అని పేరు పెట్టారు. వీటిలో అయిదు రకాలు ఉండగా మూడు చాలా ప్రమాదకరమైనవి. 100 మందికి సోకితే దాదాపు 70 మంది చనిపోతారు. 1979 నుంచి ఇప్పటివరకు 2,200 మందికి సంక్రమించగా 1500 మంది మరణించారు.   
»    ఎబోలా వైరస్ సహజ ఆతిథేయులు గబ్బిలాలు. గబ్బిలాల ద్వారా ఇవి జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి.  
 »    రోగి రక్తం, మలమూత్రాలు, చెమట, ఇతర శరీర ద్రవాలు అంటిన సూదులు, కలుషిత మాంసంతో ఇది సంక్రమిస్తుంది. మొదటి దశలో జ్వరం, తలనొప్పి, కీళ్లు, గొంతునొప్పి, బలహీనత, తీవ్ర అలసట వస్తాయి. రెండోదశలో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు రోగిని ఇబ్బంది పెడతాయి. మూడో దశలో వైరస్ దాడివల్ల కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయి. శరీరంపై మచ్చలు, బొబ్బలు ఏర్పడతాయి. శరీరంలో అంతర్గత, బహిర్గత రక్తస్రావం మొదలై చివరికి రోగి మరణిస్తాడు. ఈ మూడు దశలు 2 - 21 రోజుల వ్యవధిలో జరిగిపోతాయి. 50 - 90% మంది 10 రోజుల్లోనే మరణిస్తారు.   
»    ఎబోలా వైరస్ మనుషులకే కాకుండా గొరిల్లాలు, చింపాంజీలు, ముళ్లపందులు, దుప్పులుకు కూడా ప్రాణాంతకంగానే పరిణమిస్తోంది.

No comments:

Post a Comment