Tuesday, October 21, 2014

స్వచ్ఛ భారత్‌ గురించి పూర్తి వివరాలు (Swachh Bharat Abhiyan)

పారిశుద్ధ్య పథకం 'స్వచ్ఛ భారత్‌'ను గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.

ముఖ్యాంశాలు     
 » స్వచ్ఛ భారత్ అమలుకు అయ్యే మొత్తం వ్యయం రూ.62,009 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.14,623 కోట్లను అందజేయనుంది.      
» ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 4,041 పట్టణాల్లో అయిదేళ్లపాటు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు.      
» అనారోగ్యం కారణంగా పనిచేయలేక ప్రతి భారతీయుడు ఏటా సగటున రూ.6,500 ను నష్టపోతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందన్నారు.      
» గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఇప్పటికే ఉన్న 'నిర్మల్ భారత్ అభియాన్‌'ను స్వచ్ఛ భారత్‌లో కలిపివేయాలని కేంద్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది.      
» ప్రధాని ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం కింద దేశంలోని 2.47 లక్షల గ్రామ పంచాయతీలకు ఏటా రూ.20 లక్షలు చొప్పున అందుతాయి.      
» ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో మోదీ స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు.      
» ప్రధాని ప్రజలందరితో భారత్‌ను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.      
» స్వచ్ఛభారత్ ప్రచారానికి ప్రధాని మోదీ తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో సచిన్ టెండూల్కర్, శశి థరూర్, అనిల్ అంబానీ, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, కమల్ హాసన్, బాబా రాందేవ్, గోవా గవర్నర్ మృదులా సిన్హాతోపాటు టీవీ సీరియల్ 'తారక్ మెహ్తా కా ఉల్టా చష్మా' బృందం ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ మరో తొమ్మిది మందిని ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ప్రధాని సవాల్ విసిరారు. ఆవిధంగా కొత్తగా వచ్చేవారు తమ వంతు బాధ్యతగా తొమ్మిది మందిని తీసుకురావాలని, ఈ విధంగా ఇది కొనసాగుతూనే ఉండాలని పేర్కొన్నారు.      
» దేశ జనాభా 125 కోట్లలో దాదాపు 72.2% మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. మొత్తం గ్రామాల్లోని 16.78 కోట్ల గృహ సముదాయాల్లో కేవలం 5.48 కోట్ల ఇళ్లకే మరుగుదొడ్ల సదుపాయం ఉంది. దీనర్థం 67.3% గ్రామీణ నివాసాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. ఇది చాలా బాధాకర విషయం అని, దీని వల్ల ప్రజారోగ్యం క్షీణిస్తుందన్నారు.      
» దేశంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి 1986లోనే కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకం (సీఆర్ఎస్‌పీ) ఆరంభించారు. తర్వాత 1999లో సంపూర్ణ పారిశుద్ధ్య పథకం (టీఎస్‌సీ), నిర్మల్ గ్రామ్ పురస్కార్ పథకం మొదలు పెట్టారు. బహిరంగ విసర్జనను 2017 నాటికి పూర్తిగా మాన్పించాలనేది వీటి లక్ష్యం.      
» భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన, అనుసరణీయమైన విధానాలతో స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని పశ్చిమబెంగాల్‌లోని మిడ్నపూర్ జిల్లా దశాబ్దం కిందటే సాధించింది. 'సుస్వాగతం... మా గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉంది. బహిరంగ మల విసర్జన లేదు' అని సాధికారతతో గ్రామాలకు స్వాగత బోర్డులను ఏర్పాటు చేసుకున్న ఘన చరిత్ర మిడ్నపూర్ జిల్లాది. దాదాపు 50 అభివృద్ధి చెందుతున్న దేశాలకు అక్కడి విధానం ఆదర్శంగా నిలిచింది. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యానికి 1999లో శ్రీకారం చుట్టి 2004 నాటికి సాధించింది.      
» స్వచ్ఛ భారత్ ప్రచారానికి గాంధీజీ కళ్లద్దాలతో వినూత్నమైన లోగోను రూపొందించిన మహారాష్ట్రకు చెందిన అనంత్‌ను ప్రధాని అభినందించారు.      
» 'ఏక్ కదమ్ స్వచ్ఛతా కీ ఓర్' (స్వచ్ఛత వైపు ఒక ముందడుగు) అనే నినాదానికి రూపకల్పన చేసిన గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీకి ప్రధాని అభినందనలు తెలిపారు.

స్మార్ట్ సిటీ గురించి పూర్తి వివరాలు (Full details about the Smart City)

స్మార్ట్ నగరాల ప్రాజెక్ట్‌లో విద్య, వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోగా ఆయా విభాగాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలను అమలుచేసి, ప్రజలకు విద్య, వైద్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించింది.
స్మార్ట్ సిటీ - వైద్యరంగం
 స్మార్ట్ సిటీల్లోని ప్రజల వైద్యానికి సంబంధించి అత్యవసర కేసులను 30 నిమిషాల్లోనే పరిష్కరించాలని భావిస్తోంది. ప్రతి లక్ష జనాభాకు అన్ని ఆసుపత్రుల్లో కలిపి దాదాపు 1210 పడకలు అందుబాటులోకి రానున్నాయి.


 ఇక్కడి పౌరులందరికీ నూరు శాతం టెలి మెడిసిన్ సౌకర్యంతో పాటు, 15 వేల కుటుంబాలకు ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేస్తుంది.
 50 వేల జనాభాకు డయాగ్నస్టిక్ సెంటర్‌తో పాటు, 100 వరకు కుటుంబ సంక్షేమ కేంద్రాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.



స్మార్ట్ సిటీ - విద్యారంగం

 స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో కీలకమైన ప్రాథమిక, ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యలో ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తారు. నగరంలోని ప్రతి 10 లక్షల జనాభాకు ఒక ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే ఒక ప్రొఫెషనల్, పారామెడికల్, పశు వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతి 1.25 లక్షల జనాభాకు ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని, స్మార్ట్ సిటీకి యూనివర్సిటీ ఉండాలని అభివృద్ధి సూచిక కింద కేంద్రం పేర్కొంది.

స్మార్ట్ సిటీ లక్ష్యాలు:
 2500 కుటుంబాలకు ఒక నర్సరీ పాఠశాల.


 5 వేల కుటుంబాలకు ఒక ప్రాథమిక పాఠశాల (1 నుంచి 5వ తరగతి).
 7500 కుటుంబాలకు ఒక సీనియర్ సెకండరీ పాఠశాల (6 నుంచి 12వ తరగతి).


 ప్రతి లక్ష జనాభాకు సమీకృత పాఠశాల (1 నుంచి 12వ తరగతి).
 45 వేల కుటుంబాలకు ఒక సాధారణ వికలాంగుల పాఠశాల.


 10 లక్షల జనాభాకు మానసిక వికలాంగుల పాఠశాల.

ఎబోలా వైరస్ పూర్తి వివరాలు (Full details of the Ebola virus)

పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో ఎబోలా వైరస్ బారినపడి సుమారు 950 మంది మరణించారు.   
»    వైరస్ ప్రబలిన దేశాల్లో వైరస్‌ను అరికట్టేందుకు ప్రపంచ బ్యాంకు, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు రూ.1500 కోట్ల తక్షణ సాయం ప్రకటించాయి.   
»    వైరస్ బారిన పడిన రిపబ్లిక్ ఆఫ్ గినియా, లైబీరియా, సియెర్రా లియోన్‌కు ఔషధాల కొనుగోలుకు రూ.30 లక్షల చొప్పున సాయాన్ని భారత్ ప్రకటించింది.   
»    వైరస్ ప్రబలిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ, విమానాశ్రయాల వద్ద క్షుణ్నంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని భారత్ నిర్ణయించింది.  
 »    మనిషికి అత్యంత ప్రమాదకర వైరస్‌లలో ఒకటిగా ఎబోలా వైరస్‌ను పరిగణిస్తారు. మొదటిసారిగా కాంగోలోని ఎబోలా నది సమీపంలో 1976లో ఇది కనిపించింది. అందుకే దీనికి ఎబోలా అని పేరు పెట్టారు. వీటిలో అయిదు రకాలు ఉండగా మూడు చాలా ప్రమాదకరమైనవి. 100 మందికి సోకితే దాదాపు 70 మంది చనిపోతారు. 1979 నుంచి ఇప్పటివరకు 2,200 మందికి సంక్రమించగా 1500 మంది మరణించారు.   
»    ఎబోలా వైరస్ సహజ ఆతిథేయులు గబ్బిలాలు. గబ్బిలాల ద్వారా ఇవి జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి.  
 »    రోగి రక్తం, మలమూత్రాలు, చెమట, ఇతర శరీర ద్రవాలు అంటిన సూదులు, కలుషిత మాంసంతో ఇది సంక్రమిస్తుంది. మొదటి దశలో జ్వరం, తలనొప్పి, కీళ్లు, గొంతునొప్పి, బలహీనత, తీవ్ర అలసట వస్తాయి. రెండోదశలో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు రోగిని ఇబ్బంది పెడతాయి. మూడో దశలో వైరస్ దాడివల్ల కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయి. శరీరంపై మచ్చలు, బొబ్బలు ఏర్పడతాయి. శరీరంలో అంతర్గత, బహిర్గత రక్తస్రావం మొదలై చివరికి రోగి మరణిస్తాడు. ఈ మూడు దశలు 2 - 21 రోజుల వ్యవధిలో జరిగిపోతాయి. 50 - 90% మంది 10 రోజుల్లోనే మరణిస్తారు.   
»    ఎబోలా వైరస్ మనుషులకే కాకుండా గొరిల్లాలు, చింపాంజీలు, ముళ్లపందులు, దుప్పులుకు కూడా ప్రాణాంతకంగానే పరిణమిస్తోంది.