Tuesday, October 6, 2015

సకలం సమ్మతం-భిన్నత్వంలో ఏకత్వం

  • భిన్నత్వంలో ఏకత్వం ప్రత్యేకతగా ఉన్న భారతీయ సమాజ లక్షణాల్లో అత్యంత ప్రధానమైన వాటిలో మతం ఒకటి. ఇక్కడ అనేక మతాలున్నాయి.. అన్ని మతాలూ మానవజీవనం సన్మార్గంలో, ఉత్కృష్టంగా సాగిపోవాలనే చెబుతున్నాయి. ఈ దిశగా ప్రతి మతం పలు నియమాలు, జీవన సూత్రాలను ప్రబోధిస్తోంది. మతపరంగా ఇంతటి వైవిధ్యమైన సమాజం పురాతన కాలంలోగానీ, ఆధునిక కాలంలోగానీ ఎక్కడా లేదు. అన్ని రకాల ప్రజలను, మతాలను సమాజంలోకి ఆహ్వానించడమే ఇందుకు కారణం. ఇంత సహనం ఉన్న సమాజాలు దాదాపు తక్కువ. అందుకే అనేక మతాలు, జాతులు మన దేశంలో స్థిరపడ్డాయి. మతాలను, మతపరమైన విభాగాలను అర్థం చేసుకుంటే భారతీయ సమాజాన్ని స్థూలంగా తెలుసుకోవచ్చు. పోటీపరీక్షల అభ్యర్థుల కోసం ఈ అంశాలపై టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ఆచార్య గణేశ్ అందిస్తున్న సమగ్ర విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం..
  • భారతీయ సమాజంలో ఉన్న మతాల్లో హిందూ, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైనం, సిక్కు, పార్సీ ప్రధానమైనవి...
  • హిందూమతం
  • హిందూమతమనేది కొన్ని తాత్విక సిద్ధాంతాలపై ఆధారపడింది. ప్రధానంగా కర్మ, ధర్మ, పునర్జన్మ, మోక్ష, ముక్తి సిద్ధాంతాలను హిందూమతం ప్రబోధిస్తుంది. వీటినే హిందూమత విశ్వాసాలని కూడా అనొచ్చు. హిందూమతం చెప్పేదేమంటే ప్రతి హిందువు జీవితలక్ష్యం మోక్షసాధన. ఆ మోక్షసాధనకు ధర్మమార్గంలో జీవితాన్ని గడపాలని చెబుతుంది. ఈ మత విశ్వాసం ప్రకారం మోక్షమంటే ఆత్మ, పరమాత్మలో లీనం కావడమే..హిందూమతానికి కొన్ని తాత్విక, ధార్మిక ప్రాతిపదికలున్నాయి. అవి..
    1. 1. వేదాలు
      2. స్మృతులు
      3. శ్రుతులు
      4. ఉపనిషత్తులు
      5. అహింస
      6. సహనం
      7. ధార్మికజీవనం
      8. వర్ణాశ్రమధర్మాలు
      9. పురుషార్థాలు.
  • హిందూమతానికి కులవ్యవస్థకు అవినాభావ సంబంధం ఉంది. హిందూ సమాజం వివిధ కుల సమూహాలుగా విభజితమైంది. హిందూ జీవన దృక్పథం ప్రధానంగా కిందివాటి ద్వారా అర్థమవుతుంది.
    1. 1. ధర్మ సిద్ధాంతం
      2. కర్మ సిద్ధాంతం
      3. వర్ణ వ్యవస్థ
      4. ఆశ్రమ వ్యవస్థ
      5. పురుషార్థాలు
      6. రుణాలు
      7. సంస్కారాలు.
    ధర్మం అంటే..?
  • హిందూ జీవనంలో ధర్మమనేది ప్రవర్తన నియమావళికి సంబంధించిన అంశం. ధర్మం అంటే సత్యానువర్తనం. ఏది సమాజానికి ఆమోద యోగ్యమో.. దానికి అనుగుణంగా వ్యక్తి జీవించాలి. అంటే నీతి, నిజాయతీ, నైతిక ప్రవర్తన గురించి ధర్మం చెబుతుంది. హిందూ సామాజిక వ్యవస్థలో ధర్మం అత్యంత ఉన్నతం, ఉత్కృష్టమైంది.
  • కర్మ సిద్ధాంతం
  • వ్యక్తి తాను చేసే పనులను బట్టి.. మంచి-చెడులను బట్టి.. ప్రస్తుత జీవితం, భావి జీవితం నిర్ధారితమవుతుందనేది కర్మ సిద్ధాంతం. ప్రతి వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆత్మ శాశ్వతం. దీనికి పునర్జన్మ ఉంటుంది. ఈ పునర్జన్మ అనేది వ్యక్తి చేసే ఉచితానుచితాలను బట్టి నిర్ధారితమవుతుంది. ప్రస్తుత జీవితం - గత జీవితంలో చేసిన మంచి-చెడుల ఫలితం! అలాగే భవిష్యత్తు అనేది ఇప్పుడు చేసే మంచి-చెడులపై ఆధారపడి ఉంటుందని కర్మసిద్ధాంతం చెబుతుంది. హిందూసమాజంపై ఈ కర్మసిద్ధాంతం ప్రభావం చాలా ఉంటుంది.
  • వర్ణ వ్యవస్థ
  • ఇది అత్యంత కీలకమైంది. రుగ్వేదంలోని పురుషసూక్తంలో చాతుర్వర్ణాల గురించిన ప్రస్తావన ఉంది. అక్కడే వర్ణవ్యవస్థ గురించి చెప్పారు. రుగ్వేదం ప్రకారం సృష్టికర్త 4 శరీర భాగాల నుంచి నాలుగు వర్ణాలకు సంబంధించిన ప్రజలు ఉద్భవించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు - ఈ నాలుగూ వర్ణాలు. దీన్నే దైవాంశసంభూత సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే ఈ సృష్టి అంతా దైవం నుంచి వచ్చిందనేది ఓ భావన. దీంతో విభేదించేవారున్నా వర్ణ వ్యవస్థ ప్రభావం హిందూ సమాజంపై ఉంది. తదనంతర కాలంలో వర్ణవ్యవస్థ నుంచి కులాలు, ఉపకులాలు ఉద్భవించాయి.
  • ఆశ్రమ వ్యవస్థ
  • ఆశ్రమాలు నాలుగు.. హిందూధర్మ శాస్త్రాల ప్రకారం ఆశ్రమం అంటే వ్యక్తి తన జీవితకాలంలో చేసే ఒక్కో మజిలీ అని అర్థం. వ్యక్తి సంపూర్ణ జీవితంలో నాలుగు దశలుంటాయి. మనిషి జీవితకాలం వంద సంవత్సరాలనుకుంటే ప్రతి 25 సంవత్సరాలను ఒక ఆశ్రమంగా భావిస్తారు.
    1. 1. బ్రహ్మచర్యాశ్రమం
      2. గృహస్థాశ్రమం
      3. వానప్రస్థాశ్రమం
      4. సన్యాసాశ్రమం.
  • బ్రహ్మచర్యాశ్రమంలో జ్ఞానాన్ని సంపాదించాలి. గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకొని, ధర్మబద్ధంగా పిల్లల్ని కనడం, కుటుంబానికి కావాల్సిన ధనాన్ని ధర్మబద్ధంగా ఆర్జించడం.. మొత్తం మీద ధర్మబద్ధంగా జీవించాలి. వానప్రస్థాశ్రమంలో.. గృహస్థాశ్రమం నుంచి బయటకు వచ్చి తన జీవతానుభవాలను సమాజంతో పంచుకోవాలి. సన్యాసాశ్రమంలో తన ఆత్మను పరమాత్మలో విలీనం చేయడానికి సిద్ధపడాలి. అంటే మోక్షప్రాప్తి కోసం సన్నద్ధంగా ఉండాలి. అంటే ఈ దశలో వ్యక్తి పూర్తిగా దైవచింతనలోనే గడపాలి. కుటుంబం, భార్యాబిడ్డల నుంచి పూర్తిగా దూరమవడం అంటే భౌతిక కాంక్షలకు లోనుకాకుండా సామాన్యజీవితాన్ని గడపడం.
  • పురుషార్థాలు ఇవి ప్రధానంగా నాలుగు..
    1. 1. ధర్మ
      2. అర్థ
      3. కామ
      4. మోక్ష..
  • హిందువుగా జన్మించిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మొదటి మూడింటిని పాటించాలన్నది హిందూ ధర్మశాస్త్రాల సారం. ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి, ధర్మబద్ధంగా సంపాదించాలి. ధర్మబద్ధంగా పిల్లల్ని కని సమాజాన్ని వృద్ధి చేయాలి. వ్యక్తి శాశ్వతం కాదు సమాజం శాశ్వతం. సమాజాన్ని కొనసాగించడానికి పిల్లల్ని కనడం ఓ ధర్మం. ఈ మూడింటినీ ధర్మబద్ధంగా పూర్తిచేస్తే మోక్షం లభిస్తుంది.
    హిందూ జీవన విధానంలో వర్ణవ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, పురుషార్థాలు సమాంతరంగా నడిచే వ్యవస్థలు. ఇప్పటికీ ఇవి చాలామటుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే వ్యక్తులపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. పురుషార్థాల్లో అర్థం (డబ్బు) సంపాదించడం పురుషులకే అని ఎక్కడా లేదు. వ్యక్తిచేసే పనులు చెప్పారే తప్ప వ్యక్తి పురుషుడా, స్త్రీనా అని చెప్పలేదు.
  • రుణాలు
  • హిందూ జీవన దృక్పథం ప్రకారం ప్రతి వ్యక్తి మూడు రుణాలతో పుడతాడని చెబుతారు. ఈ మూడు రుణాలు తీర్చకుంటే మోక్షం ప్రాప్తించదనేది హిందూమత విశ్వాసం. ఆ రుణాలు-
    1. 1. రుషి రుణం.
      2. పితౄణం
      3. దేవరుణం.
  • వీటిలో పితౄణం ఉన్నతమైందిగా పరిగణిస్తారు.
    1. » రుషిరుణం అంటే గురురుణం. జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా దీన్ని తీర్చుకోవాలని చెబుతారు. గురువుకంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి, గురువుతో ప్రశంసలు పొందేలా జ్ఞానాన్ని పొందితే రుషిరుణం తీర్చుకున్నట్లు.
      » పితౄణం అంటే తల్లిదండ్రుల రుణం. వారిని గౌరవించడం, వారు వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు సేవలందించడం ద్వారా, వారికి మోక్షప్రాప్తి లభించేలా చేయాలి. అంటే వారికి అవసరమైన ప్రతీదీ చేయడం ద్వారా, సంస్కారాలను నిర్వర్తించడం ద్వారా పితౄణం తీర్చుకోవచ్చు.
      » దేవరుణం అంటే భగవంతుడి రుణం. యజ్ఞయాగాదులు చేయడం ద్వారా ఈ రుణం తీర్చుకోవచ్చని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది.
    సంస్కారాలు
  • సంస్కారం అంటే శుద్ధి చేయడమని అర్థం. హిందూ జీవన విధానంలో ఒక్కో దశలో ఒక్కో రకమైన శుద్ధి అవసరంగా భావిస్తారు. మనుస్మృతిలో ఈ సంస్కారాల గురించి చెప్పారు. గర్భదానంతో ఆరంభమై అంత్యేష్టితో ఇవి ముగుస్తాయి. గర్భదాన సంస్కారమంటే భార్యాభర్తలిద్దరూ తమకు సుపుత్రుడిని ప్రసాదించాలనే ప్రార్థన. తల్లి గర్భంలోకి రాకముందు నుంచే చేసే సంస్కారం. అంటే మనిషి పుట్టకముందే చేసేదిది. నామకరణం, ఉపనయనం, సమవర్తన (విద్యాభ్యాసం ముగించుకొని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే - వివాహానికి సిద్ధమయ్యే దశలో చేసే సంస్కారం), వివాహం, అంత్యేష్టి (చనిపోయేప్పుడు చేసే సంస్కారం) మరికొన్ని సంస్కారాలు. వీటిలో కొన్ని పురుషులకు మాత్రమే ఉన్నాయి.
  • ఇస్లాం
  • ఇస్లాం మతానికి కొన్ని సిద్ధాంతాలున్నాయి. హిందూమతంలో బహుదేవతారాధన ఉంటే ఇస్లాం ఏకదేవతారాధనా మతం. అల్లా యందు సంపూర్ణ విశ్వాసం ఉండాలని ఈ మతం చెబుతుంది. ఇందులో విగ్రహారాధన ఉండదు. ఖురాన్ మతగ్రంథం. ముస్లిం మతాన్ని ఆచరించేవారు ప్రధానంగా అయిదు విధులను పాటించాలి. వాటినే ఇస్లాం పంచ సూత్రాలంటారు.
    1. 1. అల్లాయందు విశ్వాసం
      2. రోజుకు 5 సార్లు ప్రార్థించడం (నమాజ్)
      3. జకాత్ (సంపాదించిన దాంట్లో కొంత దానం చేయడం)
      4. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం (రోజా)
      5. జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించడం
    క్రైస్తవం
  • క్రైస్తవమతం కూడా ఏకదేవతారాధనను విశ్వసిస్తుంది. ఈ మత స్థాపకుడు జీసస్ క్రైస్ట్. మతగ్రంథం బైబిల్. క్రైస్తవం ప్రకారం ఏక వివాహ పద్ధతిని పాటించాలి. బహు వివాహం నిషిద్ధం. భారత్‌లోని క్రైస్తవుల్లో రెండు వర్గాలు కనిపిస్తాయి.
    1. 1. ప్రొటెస్టెంట్లు
      2. క్యాథలిక్‌లు.
  • క్యాథలిక్‌ల్లో మళ్లీ రోమన్ క్యాథలిక్‌లు, సిరియన్ క్యాథలిక్‌లు ఉన్నారు. బైబిల్‌లో చెప్పిన అంశాలనే పాటించడం, సమష్టి ఆరాధన ఈ మత విధానం.
  • బౌద్ధమతం
  • భారతదేశంలో చాలా ప్రభావం చూపించిన మతం బౌద్ధం. బుద్ధుడు మధ్యేమార్గ సిద్ధాంతాన్ని (మిడిల్‌పాథ్) ప్రబోధించారు. అంటే మనిషి పూర్తిగా సన్యాసిగా కాకుండా, పూర్తిగా భౌతిక కాంక్షలతో కాకుండా స్వయం నిగ్రహశక్తితో జీవితాన్ని గడపాలనేదే మధ్యేమార్గ సిద్ధాంతం. ఎవరైతే ఈ నిగ్రహశక్తిని కోల్పోతారో అటువంటివారు తనకుతాను మానసికంగా బలహీనులయ్యే అవకాశముంది. నిగ్రహాన్ని నిలబెట్టుకోవటానికి.. అర్య అష్టాంగమార్గ సిద్ధాంతాన్ని కూడా బుద్ధుడు చెప్పారు. అవి...
    1. 1. సరైన విశ్వాసం,
      2. సరైన అభిలాష/కోరిక,
      3. సరైన భాష,
      4. సరైన చర్య,
      5. సరైన జీవనవిధానం,
      6. సరైన ప్రయత్నం,
      7. సరైన ఆలోచన,
      8. సరైన యోచన
  • కర్మ, అహింస, పునర్జన్మను విశ్వసించిన బుద్ధుడు విగ్రహారాధనను, కులాల్ని ఖండించారు. అంతా సమానమే అనేది బౌద్ధమతం. వాస్తవికంగా చెప్పాలంటే హిందూమతంలోని అసమానత్వం, కొన్ని మత ఛాందస భావాలకు వ్యతిరేకంగా, విభిన్నంగా ఏర్పడిందే బౌద్ధం. దీన్ని 'రియాక్షనరీ రిలీజియన్ అని అంటారు. భారత్‌లోనే పుట్టినా ఇతర దేశాల్లో బాగా వ్యాపించింది. మన దేశంలో మహారాష్ట్ర, అసోం, సిక్కింలలో బౌద్ధమత జనాభా ఎక్కువ. బౌద్ధ దేవాలయాలు, ఆరామాలు- బుద్ధగయ, కుశినగరం, సారనాథ్, సాంచిలో ఉన్నాయి. హేతుబద్ధమైన ఆలోచనలు, నియమాలు, ఆహారానికి సంబంధించి ఎలాంటి నియమనిబంధనలు లేకపోవడం (బుద్ధుడు శాకాహారి అని చెప్పినా ఏది ఇస్తే అది స్వీకరించేవారు).. పూర్తి ఆచరణాత్మకవాదం ఈ మతం ప్రత్యేకత. అహింస అని చెప్పినా మధ్యేమార్గ సిద్ధాంతం చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణాత్మకంగా జీవించాలనేది బౌద్ధం. అందుకే చాలా ప్రభావం చూపించి ప్రాచుర్యం పొందింది. ఒకదశలో హిందూమతానికి సవాల్‌గా నిలిచింది. బుద్ధుడి ప్రవచనాలను జాతక కథల్లో వివరించారు. వీటిని ప్రాకృతంలో రాశారు. బుద్ధుడి తర్వాతి కాలంలో బౌద్ధంలో రెండు శాఖలొచ్చాయి.
    1. 1. మహాయానం
      2. హీనయానం.
    జైనమతం
  • జైనమతం ప్రాచీనమైంది. దీన్ని ఎవరు స్థాపించారనే దానిపై భిన్న వాదనలున్నాయి. జైన తీర్థంకరుల్లో 24వ తీర్థంకరుడు మహావీరుడు. ఈ మహావీరుడే జైనమతానికి గుర్తింపు తెచ్చి, బలోపేతం చేశారు. జైనమతం కర్మ, అహింస, పునర్జన్మ సిద్ధాంతాలను విశ్వసిస్తుంది. అన్ని మతాల్లోకంటే అహింసకు అత్యంత ప్రాధాన్యమిచ్చేది జైనమతం. ఏ జీవికీ, ఏ రూపంలోనూ హింస ఉండకూడదని జైనమతం భావిస్తుంది. ఇందులోనూ రెండు శాఖలున్నాయి.
    1. 1. శ్వేతాంబర
      2. దిగంబర.
  • జైనమతంలో మోక్షమార్గం గురించి ప్రధానంగా చెబుతారు. ఇందుకోసం
    1. 1. సమ్యక్ దర్శన (సరైన విశ్వాసం)
      2. సమ్యక్ జ్ఞాన (సరైన జ్ఞానం)
      3. సమ్యక్ చరిత (సరైన ప్రవర్తన) ఉండాలని జైనం చెబుతుంది.
  • వీటినే రత్నత్రయాలంటారు. జైనమతం నైతిక ప్రవర్తన గురించి 5 సూత్రాలు చెబుతుంది. అవి..
    1. 1. అహింస
      2. సత్యం
      3. అస్థేయ (దొంగతనం చేయకుండా ఉండటం)
      4. బ్రహ్మచర్యం (లైంగిక నిగ్రహం)
      5. అపరిగ్రహ (అత్యాశ లేకపోవడం).
    సిక్కుమతం
  • ఇది కూడా హిందూమతం నుంచి వచ్చిందే. గురునానక్ దీని స్థాపకులు. గ్రంథసాహెబ్ సిక్కుల పవిత్ర మతగ్రంథం. సిక్కుమతానికి చెందిన పురుషులకు 5 మతపరమైన చిహ్నాలుంటాయి.
    1. 1. కేశాలు
      2. కంగన్ (దువ్వెన)
      3. ముంజేతి కడియం
      4. చిన్న చెడ్డి
      5. కృపాణ్ (చిన్న ఖడ్గం).
  • ఈ మతం విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది. సిక్కుల పదో గురువు గురు గోవింద్‌సింగ్ సిఖ్ ఖల్సా (సిఖ్ మిలిటరీ ఆర్డర్)ను స్థాపించారు. దీన్ని సిక్కుల అస్తిత్వం కోసం ఏర్పాటు చేశారు. ఈ ఖల్సాలోకి వచ్చేవారు పైనచెప్పిన చిహ్నాలను పాటిస్తారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వీరి పవిత్ర దేవాలయం.
  • పార్సీలు
  • వీళ్లనే జొరాస్ట్రియన్లు అంటారు. వీరి మతమే జొరాస్ట్రియన్ మతం. వీళ్లు అగ్నిని పూజిస్తారు. పార్సీల్లో రెండు ప్రధాన శాఖలున్నాయి. 1. కదీమి 2. శంషాయి. పార్సీలు ఎక్కువ నైతిక జీవనానికి ప్రాధాన్యమిస్తారు. పార్సీల అధిదేవత (సుప్రీం గాడ్)ను అహూరా మాజ్దా అంటారు. జరాతుస్త్రా - అనే వ్యక్తి వీరి మతప్రవక్త, మతగురువు. ఈ మతంలో చనిపోయిన తర్వాత కళేబరాన్ని దహనం గానీ, ఖననం గానీ చేయరు. నిశ్శబ్ద శిఖరం (టవర్స్ ఆఫ్ సైలెన్స్) వద్ద ఉంచుతారు. అంటే కళేబరాన్ని పక్షులకు అర్పితం చేస్తారు. హైదరాబాద్‌లో ఉన్న పార్సిగుట్టలో ఇలాంటి ఏర్పాటు ఉంది. పార్సీల పవిత్రగ్రంథం జెండ్ అవెస్థా. పార్సీలను పర్షియా నుంచి వచ్చినట్లు భావిస్తారు. అయితే అక్కడ చాలా తెగలున్నాయి. అంతా ముస్లింలు కాదు. ఇస్లాం మతంలోకి మారాలన్న ఒత్తిడిని తట్టుకోలేక దాన్ని వ్యతిరేకించి, తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చేశారు. వీరు ముఖ్యంగా వాణిజ్యవేత్తలు. వ్యాపారంలోనూ చాలా నైతికతను పాటిస్తారు. పార్సీల నైతిక నియమావళిలో మూడు సూత్రాలుంటాయి.
    1. 1. హూమత (మంచి ఆలోచన)
      2. హుక్తా (మంచి మాటలు)
      3. హువర్‌స్టా (మంచి పనులు).
    సాంస్కృతిక విభాగాలు
  • భారతీయ సమాజంలోని మరో వైవిధ్యం సాంస్కృతిక విభాగాలు. భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణాలు
    1. 1. ధార్మిక జీవనం జీవిత పరమార్థం.. భారత్‌లోని దాదాపు అన్ని మతాలు దీన్నే ప్రబోధిస్తున్నాయి.
      2. మతంపట్ల సమ్మేళనాత్మక దృక్పథం.. భారతీయ సమాజం కేవలం ఒక మతానికి సంబంధించిన సమాజం కాదు. విభిన్న మతాలున్నాయిక్కడ. అన్నీ సమానంగా జీవించే అవకాశం ఉంది. భారత రాజ్యాంగం కూడా ఈ అవకాశం ఇచ్చింది. భారత్‌లోని ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన మతాన్ని అనుసరించవచ్చు.. పాటించవచ్చు. ఆ రకమైన సాంస్కృతిక సమ్మిళిత దృక్పథం భారత్‌లో కనిపిస్తుంది.
      3. భిన్నత్వంలో ఏకత్వం.. వివిధ మతాలు, భాషలు, జాతులున్నా భారతీయులంతా ఒకటే అనే భావన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది.
      4. మతపరమైన, సాంస్కృతికపరమైన ఐక్యత.. ఏ మతానికి, సంస్కృతికి సంబంధించినవారైనా ఒకటే అనే భావన.
      5. సహనం.
      6. అహింస. ఇవన్నీ భారతీయ సమాజ సాంస్కృతిక లక్షణాలు.

    No comments:

    Post a Comment